జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
సంగారెడ్డి రూరల్ : కర్ణాటకలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ అడ్డదారులు తొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.అధికార దాహంతో గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సంఖ్యా బలం తక్కువగా ఉన్న బీజేపీ చేత ప్రభుత్వం ఏర్పాటు చేయించడం సమంజసం కాదన్నారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లిలోని జాతీయ రహదారి చౌరస్తాపై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో మేఘాలయా, గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యా బలం లేకున్నా గవర్నర్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ బీజేపీచేత ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు 15 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోకుండా ఒకే రోజులో బల నిరూపణ చేపట్టాలని ఆదేశించడం వారికి చెంప పెట్టులాంటిదన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు డబ్బులను ఎరవేస్తూ తమవైపు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలను హెలిక్యాప్టర్‌లో తరలిస్తుంటే ఏటీసీ నుంచి సిగ్నల్స్ ఇవ్వకపోవడం బీజేపీ కుట్రే అన్నారు.
ప్రజలంతా గమనిస్తున్నారని, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శశికళ యాదవ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అనంతకిషన్, జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, నాయకులు మునిపల్లి సత్యనారాయణ, ఆంజనేయులు, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment