సాక్షి, బెంగళూరు: దశాబ్దకాలం తర్వాత భారత ఐటీ రాజధాని బెంగళూరు నగరంపై కాంగ్రెస్ పార్టీ తిరిగి గట్టి పట్టు సాధించినట్లైంది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జయనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి గెలుపొందడంతో సిటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు పెరిగింది. బెంగళూరు నగర పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, బీజేపీ 11 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.. అందునా ఐదు చోట్ల బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి తారుమారు అవుతున్నదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని, 2019లో బెంగళూరులోని అన్ని లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
70 శాతం మంది మిడిల్ క్లాసే! : దక్షిణ బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గంలో 70 శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న జయనగర్ స్థానంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కూడా అయిన విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నిక జూన్ 11కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గడిచిన పదేళ్లుగా జయగనర్‌లో బీజేపీదే ఆధిక్యం. గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలుపొంది, డీలిమిటేషన్ తర్వాత వేరే స్థానానికి వెళ్లిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్. రామలింగారెడ్డి.. ఈ దఫా జయనగర్ నుంచి తన కూతురు సౌమ్య రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పటికే జేడీయూ-కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా మిత్రపక్షాలకు చెందిన పెద్ద నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. దీంతో రామలింగారెడ్డే అంతా తానై వ్యవహరించారు. బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్(దివంగత విజయ్‌కుమార్ సోదరుడు)పై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి.
యడ్యూరప్ప కస్సుబుస్సు: జయనగర్‌లో పార్టీ ఓటమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్రఅసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడకుండా ముఖంచాటేశారు. జయనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అనంతకుమార్ వల్లే పార్టీ ఓడిపోయిందని యడ్డీ తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ప్రచార బాధ్యతలు తీసకున్న అనంతకుమార్.. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించారని, ఎగువ మధ్యతరగతి ఓట్లు అధికంగా ఉన్న జయనగర్‌లో బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని భావించినా, చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిందని యడ్డీ కస్సుబుస్సులాడినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment