సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 17, 18న జరిగే ప్రతిపక్షాల కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం చెప్పారు. ఈ భేటీలో పాల్గొనాలని సోనియాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారని తెలిపారు. దీనిపై సోనియా సానుకూలంగా స్పందించినట్లు,ఆమె రాబోతున్నట్లు తమకు సమాచారం అందిందని అన్నారు.
అలాగే, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఈ నెల 12న ఇక్కడి ఫ్రీడమ్ పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఒక్కటి కావాలని సూచించారు. దేశంలో మార్పు కోసం జరుగుతున్న మహా యుద్ధంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తొలి సమావేశం జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే.
చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున
Comments
Please login to add a commentAdd a comment