భవనం కుప్పకూలి ఐదుగురు మృతి.. డిప్యూటీ సీఎం సీరియస్‌ | Bengaluru Building That Collapsed Illegal, Will Take Action: DK Shivakumar | Sakshi
Sakshi News home page

Bengaluru: భవనం కుప్పకూలి ఐదుగురు మృతి.. డిప్యూటీ సీఎం సీరియస్‌

Published Wed, Oct 23 2024 10:29 AM | Last Updated on Wed, Oct 23 2024 11:25 AM

Bengaluru Building That Collapsed Illegal, Will Take Action: DK Shivakumar

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు వణికించాయి. మంగళవారం కురుసిన కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ‍ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు అయిదుగురు మృతి చెందారు.మరో ఏడుగురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 13 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బీహార్‌కు చెందిన హర్మన్ (26), త్రిపాల్ (35), మహ్మద్ సాహిల్ (19), సత్యరాజు (25), శంకర్ ఉన్నారు.

బెంగళూరు తూర్పు ప్రాంతంలోని హోరామావు ​​అగరా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలిందదని, ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 20 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాత్రి వరకు సహాయక చర్యలు ఆపేశారు. తిరిగి బుధవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. సహాయక చర్యల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు డాగ్‌ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించారు.

భవనం కూలిన ప్రాంతాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సందర్శించారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. అయితే భవన నిర్మాణం చట్టవిరుద్ధమని, దాని యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవనానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెప్రనిరు. అక్రమ నిర్మాణాలు  చేపడుతున్న యజమాని, కాంట్రాక్టర్, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెంగళూరు వ్యాప్తంగా అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపేసేలా తాము అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టర్, యజమాని, అధికారులు ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు.

 భవనం కూలిన ఘటనపై మాకు సమాచారం అందిన తర్వాత, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌  సమాచారం అందించామని, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు.. తమకు అందిన సమాచారం ప్రకారం ప్రమాద సమయంలో 21 మంది కూలీలు ఉన్నారని, రోజూ 26 మంది ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. 60/40 ప్లాట్‌లో ఇంత పెద్ద భవనాన్ని నిర్మించడం నేరమని, మూడుసార్లు నోటీసులు జారీ చేశామని చెప్పారు. 

మరోవైపు రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. బెంగళూరు నగరానికి నేడు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. సిటీలోని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement