బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును నీటి సంక్షోభం వేధిస్తోంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు.
తాజాగా బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి సమస్యను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు. నగరంలో నీటి కొరతకను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోనీ బీజేపీ కూడా కారణమేనంటూ శివకుమార్ విమర్శించారు.
చదవండి: అమేథీ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలోకి రాహుల్ గాంధీ?
బెంగుళురుకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు తాము శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈ ప్రాజెక్టు అనుమతులు ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
కరవు పరిస్థితులతో తాగునీటి కొరత గ్రామాలనే కాకుండా, సిలికాన్ సిటీలో, అందులోనూ సీఎం అధికార నివాసం కృష్ణను కూడా పీడిస్తోంది. నగరంలో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో సీఎం నివాసానికి జలమండలి కొళాయిల నుంచి నీరు రావడం లేదు. అధికారులు హడావుడిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారమే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment