అందరూ వినాయక చవితి సంబరాల్లో మునిగి ఉండగా వరుణుడు ఆగ్రహించాడా అన్నట్లు బెంగళూరును కుంభవృష్టి కుదిపేసింది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు కుండపోత గుప్పిట్లో విలవిలలాడాయి. ఎటుచూసినా చెరువును తలపించే మాదిరిగా తయారైంది. రోడ్లు, ఇళ్లు, అపార్టుమెంట్ల సెల్లార్లు మునిగిపోయాయి. పోలీసులు, ఫైర్, పాలికె సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. దోణెలు, రబ్బరు బోట్లలో నిస్సహాయుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సాక్షి, బెంగళూరు: ఏకధాటిగా రెండు రోజుల వర్షాలతో బెంగళూరు నగరం వణికిపోయింది. మహదేవపుర వలయంలో అతి భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతం మడుగుకట్టింది. అత్యధికంగా ఐటీ బీటీ కంపెనీలు ఉన్న బెళ్లందూరు, మారతహళ్లి, అవుటర్‌రింగ్ రోడ్డులో రెండురోజులైనా వరదనీరు తగ్గలేదు. ఐటీ హబ్‌లు జలమయం కాగా రోడ్లు ధ్వంసమయ్యాయి. ఐటీ ఉద్యోగులు నివసించే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేనంతగా జలావృతమైంది. అవుటర్ రింగ్‌రోడ్డు చెరువులా మారింది.
1989 తరువాత ఇదే భారీ వర్షం
నగరంలో రికార్డుస్థాయిలో ఒకేరోజు 162 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. గతంలో 1989 ఆగస్టు 27 తరువాత ఇంత వర్షం పడడం ఇదే మొదటిసారి. బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ మాట్లాడుతూ.. బెళందూరు ఇకోస్పేస్ వద్ద, మారతహళ్లి రింగ్ రోడ్డు మునిగిపోవడానికి కారణం రాజకాలువలు కబ్జాలకు గురికావడమేనని చెప్పారు.
iTWEET:And here comes the rain once again! Another day! Another big rain! Another set of road-woes ahead Bengaluru! Stay safe! #Bengaluru #BengaluruRains #BangaloreRains #Rains #RainRoadRuins pic.twitter.com/peB25F1PCh
— Harish Bijoor (@harishbijoor) September 1, 2022
బెంగళూరును కాపాడాలి
ప్రధాని నరేంద్రమోదీ నేడు శుక్రవారం కర్ణాటక పర్యటన నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్ సిలికాన్‌సిటీ సమస్యల గురించి ట్విట్టర్లో ప్రస్తావించారు. దయచేసి బెంగళూరును కాపాడండి అని వినతి చేశారు. రాజకాలువల్లో పూడిక తీయకుండా బీబీఎంపీ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.
ముంపులో 209 ప్రదేశాలు
వర్షపు నీరు వెళ్లే దారి లేక వైట్‌ఫీల్డ్, ఇకోస్పేస్ చుట్టుపక్కల రోడ్లు జలమయమయ్యాయి. మారతహళ్లి రోడ్డు, బెళ్లందూరు, వర్తూరు మెయిన్‌రోడ్డు, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో వాన నీరు నిలవటంతో నీటిని పంపడానికి ప్రయత్నాలు చేపట్టారు. కార్లు, బైకులలోకి నీరు దూరి చెడిపోవడంతో వాహనదారులు లబోదిబోమన్నారు. 209 ప్రదేశాలు ముంపునకు గురయ్యాయి. ఇందులో ఐటీ కారిడార్లు కూడా ఉన్నాయి. అనేక ఏటీఎంలలోకి నీరు చొరబడింది. గురువారం సాయంత్రం కూడా బెంగళూరు చుట్టుపక్కల భారీ వానలు పడ్డాయి.
రోడ్డుపై చేప
కర్ణాటకలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బెంగుళూరులో కురిసిన కుండపోత వానలకు రోడ్డుపై చేప దొరికింది. దీనిని ఓ మున్సిపల్ సిబ్బంది పట్టుకోగా మరో వ్యక్తి ఫోటీ తీస్తున్నాడు. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. చేపల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని.. బెంగళూరు రోడ్ల మీదకు వస్తే చాలని సరదాగా కామెంట్ చేస్తున్నారు.
"Do not be angry with the rain; it simply does not know how to fall upwards." ~ Vladimir Nabokov#bengalururains pic.twitter.com/rRP4Bt6cq2
— Prachi Pareekh (@prachipareekh) September 1, 2022
నేడు, రేపు వానలు
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీవానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెళగావి, గదగ, బళ్లారి, తుమకూరు బెంగళూరు నగర, శివమొగ్గ, చిక్కమగళూరు తదితర జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. బెంగళూరులో ఆదివారం వరకూ వర్షసూచన ఉండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment