
కర్ణాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఇవి పక్కన పెడితే, ఈసారి ఓటింగులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంతకుముందు వరకు ఓటరు గుర్తింపు కార్డులో ఆడ, మగ రెండే ఉండేది. ట్రాన్స్‌జెండర్ల పోరాట ఫలితంగా వీరిని కూడా ఓటర్లలో చేర్చారు. వారికి కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఈసారి ఎంతో సంబరంగా ఉన్నారు. 2013 ఎలక్షన్ల కంటే ఈ సారి వీరి సంఖ్య రెట్టింపుగా ఉంది. వీరి సంఖ్య బెంగళూరులో బాగా ఎక్కువగా ఉంది. మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను వీరు 1,629 మంది ఉన్నారు. వీరిలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిలో లావణ్య కూడా ఉన్నారు.ఎవరు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ‘మాకు మాత్రం రక్షణ కల్పించాలి’ అంటున్నారు వీరంతా ముక్తకంఠంతో. ఓటు వేయడమనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అని తెలుసుకున్నారు వీరు. ‘‘ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఎంతోమంది రాజకీయ నాయకులు మా ఓట్లను కూడా అర్థించడానికి మా ఇళ్లకు వచ్చారు. మమ్మల్ని ఎంతో గౌరవంగా పలకరించారు. ముందుముందు కూడా అందరూ మా పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాం’’ అంటున్నారు లావణ్య.
ట్రాన్స్‌జెండర్లు కూడా మనుషులేనని గుర్తించి, వారిని గౌరవంగా చూస్తే, ముందుముందు కూడా వీళ్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉందంటున్నారు విద్య దినకర్ అనే సామాజికవేత్త. ‘‘ట్రాన్స్‌జెండర్లను చాలామంది అవమానకరంగా చూస్తున్నారు. వారికి కూడా మనసు ఉంటుందని అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఎన్నికలలో మొదటిసారిగా ఓట్లు వేస్తున్న వీరంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. తాము కూడా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భాగస్వాములవుతున్నందుకు ఆనందిస్తున్నారు’’ అంటున్నారు దివ్య. కర్వార్ జిల్లా దండేలి గ్రామానికి చెందిన సంజన దక్షిణ కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘‘నా పేరు మీద నాకు గుర్తింపు కార్డు ఇచ్చారు ‘సంజన’ అని. నేనంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నా కల నిజమవుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది’’ అంటున్నారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఒక విధానం రూపొందించింది. వీరిని సంరక్షించేందుకు, ఉద్యోగం చేసేందుకు వీలుగాను, సమాజంలో ఎవ్వరూ వీరిని ఎగతాళి చేయకుండా మర్యాదగా చూసేందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించింది. వారిని కూడా సాటివారిగా చూస్తూ, వారి పట్ల బాధ్యతగా ఉండాలని చెబుతున్నారు విద్య.
– రోహిణి
Comments
Please login to add a commentAdd a comment