సాక్షి, మేడ్చల్ జిల్లా: సాధారణ ఎన్నికల ‘ముందస్తు’ ప్రచారంతో జిల్లాలో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా బీఎల్‌ఎఫ్, టీజేఎస్, వామపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీలు ప్రణాళికలు రూపొందించుకునే పనిలో పడ్డాయి. అధికార టీఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న కొందరికి మళ్లీ టికెట్ ఇచ్చే విషయమై సీఎం కేసీఆర్ నుంచి మౌఖిక సందేశాలు అందటంతో.. వారు మరింత చురుగ్గా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. ఇందులో మేడ్చల్, కుత్బుల్లాపూర్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కమలనాథుల సమధికోత్సాహం..
జిల్లాలో బీజేపీ నాలుగు అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానం ఉప్పల్‌తో పాటు మేడ్చల్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలబెట్టనున్న అభ్యర్థులకు మౌఖిక సంకేతాలివ్వటంతోపాటు కేంద్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర నేతల పర్యటనలతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్‌లో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిర్వహించిన మార్పు కోసం.. బీజేపీ జన చైతన్య యాత్ర సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించారు.
కాంగ్రెస్‌లో కదనోత్సాహం..
జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌తో సహా పలు పార్టీలు ‘ముందస్తు’ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ సైతం కదనోత్సాహానికి ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా ఆవిర్భావం అనంతరం ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నప్పటికీ.. పార్టీ కార్యకర్తల వరకు పరిమితమై నాయకులు పర్యటనలు సాగిస్తున్నాయి. ఎట్టకేలకు ఇందిరా భవన్‌లో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఏఐసీసీ కార్యదర్శి బోస రాజుతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇతర పార్టీల్లోనూ..
బీఎల్‌ఎఫ్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు సైతం ప్రజా సమస్యల పరిష్కారానికి మండల, జిల్లాస్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. బీఎల్‌ఎఫ్ ఒకడుగు ముందుకేసి పార్లమెంట్, అసెంబ్లీ కన్వీనర్లను నియమించి జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment