
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !
ఇటు యూపీఏ, అటు ఎన్డీయే... లేదంటే థర్డ్ ఫ్రంట్
జత కట్టేందుకు లాభనష్టాలు బేరీజు వేస్తున్న పార్టీలు
కాంగ్రెస్‌తో జతకట్టిన ఎన్సీ, ఎన్సీపీ
బీజేపీతో సేన, అకాళీదళ్, ఎల్‌జేపీ పొత్తు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం ప్రాంతీయ పార్టీల సమాహారంగా మారనుంది. ఈ సమర భేరిలో ఏ పార్టీ ఏ పక్షాన చేరుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్‌తో, కొన్ని బీజేపీతో, మరికొన్ని మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్)గా జతకట్టాయి. మరో పది, పదిహేను రోజులకల్లా పార్టీలన్నీ గీతకు కుడి వైపో, ఎడమ వైపో చేరనున్నాయి. కొన్ని ఒంటరిగా పోటీకి దిగినా ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసే కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముందంజలో ఉందని వెల్లడించగా.. వాటిని నమ్మొద్దని, 2004, 2009 ఎన్నికల వేళ కూడా ఇదే రీతిలో సర్వేలు వెలువడ్డాయని కాంగ్రెస్ చెబుతోంది. 2004లో 145 సీట్లు, 2009లో 206 సీట్లు సాధించిన కాంగ్రెస్... యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహించి పదేళ్లు పాలించింది.
బీజేపీకి 2004లో 138, 2009లో 116 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు కూడా సొంతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అందువల్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ప్రాంతీయ పార్టీలను, చిన్న జాతీయపార్టీలను ఆకర్షించే పనిలో పడ్డాయి. అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలబడితే ప్రభుత్వ ఏర్పాటు సులువవుతుందని భావిస్తున్నాయి. కనీసం 160 నుంచి 180 సీట్లు సొంతంగా సాధిస్తే ఆ దిశగా అడుగులేయవచ్చని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలు సహా చిన్నచిన్న జాతీయపార్టీలు కూడా తాము ప్రాతినిథ్యం వహించే ప్రాంతాలకు గరిష్ట ప్రయోజనం సాధించుకునేందుకు గాను ఎన్నికల అనంతరమే తాము ఏ కూటమిలో చేరాలన్న నిర్ణయం తీసుకోవాలని వ్యూహరచన చేస్తున్నాయి.
ఎవరు ఎటు వైపు?
ఈసారి ఎన్నికల బరిలోకి దిగినవాటిలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, ఏడీఎంకే, జేడీయూ, బీజేడీ, ఆర్‌జేడీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎండీఎంకే, పీఎంకే, ఆర్‌ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏజీపీ, జేఎంఎం, శిరోమణి అకాళీదళ్, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఉన్నాయి. వీటిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్జేడీతో పొత్తులు కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీతో శివసేన, శిరోమణి అకాళీదళ్, ఎల్‌జేపీ పొత్తులు కుదుర్చుకున్నాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరే అవకాశం ఉన్న పార్టీల్లో ఆర్‌ఎల్డీ, జేఎంఎం, ముస్లింలీగ్, కేరళ కాంగ్రెస్ తదితర పార్టీలు ఉన్నాయి.
ఎన్నికల అనంతరం ఎన్డీఏలో పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు చేరే అవకాశం ఉంది. అయితే ఇవి ఎన్నికలకు ముందే పొత్తులు కుదర్చుకునే పనిలో పడ్డాయి. మరోవైపు జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మూడో కూటమికి వామపక్షాలు గురువారం రాంరాం చెప్పేశాయి. దీంతో అన్నాడీఎంకే ఎన్డీయేతో జట్టుకట్టే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీతో సత్సంబంధాలే జయలలితను ఎన్డీయే వైపు మళ్లిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేడీ నేత నవీన్ పట్నాయక్ సైతం మూడో కూటమి విఫలమైతే ఎన్డీయే పక్షానే చేరనున్నారు. ఇక మరో కీలకపార్టీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మూడో కూటమి విఫలమైతే యూపీఏ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల అనంతరం ఎన్డీయే వైపు మొగ్గే చూపవచ్చు.
మూడో ఫ్రంట్ ముచ్చట...
నాలుగు వామపక్ష పార్టీలు, ఎస్పీ, జేడీ(యూ), జేడీ(ఎస్), జేవీఎం తదితర పార్టీలు మూడో కూటమిగా జతకట్టాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలన్నీ థర్డ్ ఫ్రంట్‌గా బరిలో నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా పలు పార్టీలు ప్రయత్నిస్తున్నా అదొక తీరని కలగానే ఉంది. ఇటీవలే 11 పార్టీలతో కూడిన థర్డ్ ఫ్రంట్ సమావేశం జరిగింది. అయితే ఎన్నికల నాటికి దీని స్వరూపం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుందా? అన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు పొత్తులు పెట్టుకోని పలు పార్టీలు... ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అటు వెళ్లేందుకే ఆసక్తి చూపించే అవకాశం ఉంది.