మూడో కూటమి రావాల్సిందే: అఖిలేష్ | Third Front needed to fight communal forces: Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

మూడో కూటమి రావాల్సిందే: అఖిలేష్

Published Fri, Nov 1 2013 5:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

మూడో కూటమి రావాల్సిందే: అఖిలేష్

మూడో కూటమి రావాల్సిందే: అఖిలేష్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ మూడో కూటమికి సై అన్నారు. 2014 ఎన్నికల తర్వాత మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా ఉండేందుకు థర్డ్‌ఫ్రంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పిదాల వల్ల బీజేపీ బలోపేతం అవుతోందని చెప్పారు. గురువారమిక్కడ ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడో కూటమికి ప్రధాని అభ్యర్థిగా సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఉంటారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. ‘ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతతత్వ శక్తులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. మూడో కూటమి మాత్రమే ఇలాంటి శక్తులను అడ్డుకోగలదు’ అని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్, కమ్యూనిస్టులు, తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే, బీహార్‌లో జేడీయూ.. ఇలా బీజేపీయేతర , కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో బీజేపీకి మద్దతిచ్చిందని, ఈసారి కూడా ఆ పార్టీతో కలిసి వెళ్లొచ్చని చెప్పారు. థర్డ్‌ఫ్రంట్‌కు మీ తండ్రి ములాయంసింగ్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారా అని అడగ్గా.. రైతుల సమస్యలను అర్థం చేసుకునే వారు ప్రధాని పగ్గాలు చేపట్టాలని అన్నారు. ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతునివ్వడంపై ప్రశ్నించగా.. మతశక్తులను దూరంగా ఉంచేందుకు ఆ పార్టీకి మద్దతిస్తున్నామని వివరించారు.
 
 అలా అనడం రాహుల్‌కు తగునా?
 ముజఫర్‌నగర్ బాధితుల్లో కొందరిని పాక్ ఐఎస్‌ఐ సంప్రదించిందన్న రాహుల్ వ్యాఖ్యలను అఖిలేష్ తప్పుపట్టారు. జాతీయ పార్టీ నేతగా అలా మాట్లాడడం ఆయనకు తగదన్నారు. ఐఎస్‌ఐని ఎవరు సంప్రదించారని దేశం అడుగుతున్న ప్రశ్నలకు రాహు ల్ వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయం చేసేందుకే ఆయన అలా మాట్లాడారో ఏమోనని చెప్పారు.
 
 లెఫ్ట్‌దే కీలక పాత్ర: సురవరం
 వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వామపక్షాలు కీలకపాత్ర పోషిస్తాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి తమ పార్టీ పొత్తులు ఉంటాయని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటులో వామపక్షాలదే ముఖ్యభూమిక అని స్పష్టంచేశారు. పార్టీ జాతీయ సమితి మూడు రోజుల సమావేశాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం అవసరమయ్యే ప్రణాళికలపై చర్చించామని తెలిపారు.
 
 అదో విఫల భావన: జైట్లీ
 తృతీయ కూటమి ఏర్పాటు అవకాశాలను బీజేపీ నేత అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. తృతీయ కూటమిని ఆయన ‘విఫల భావన’గా అభివర్ణించారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా 14 పార్టీలు ఏకమై సమావేశం నిర్వహించడంపై జైట్లీ విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement