ఏజెన్సీలో కలకలం
మణుగూరు:ఏజెన్సీ ప్రాంతంలో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు సేవ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో మణుగూరు ఏజెన్సీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో ప్రత్యేక కేంద్రంగా ఇస్లాం మత మార్పిడులు జరుగుతున్న విషయాన్ని నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు గుర్తించి.. హైదరాబాద్ పోలీసుల ద్వారా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో మతమార్పిడిల బాగోతం బయటపడింది. రామానుజవరం గ్రామం కేంద్రంగా అనాథ పిల్లలు, పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అనాథాశ్రమం పేరుతో...
అనాథ పిల్లలకు సకల సౌకర్యాల ఏర్పాటుతోపాటు ఉన్నత విద్యను అందిస్తామనే ప్రచారంతో హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా మణుగూరు మండలం రామానుజవరం, విజయనగరం గ్రామాలతోపాటు వరంగల్, ఖమ్మం నగరాలను అనుకూల ప్రాంతాలుగా ఎంపిక చేసుకొని మత మార్పిడుల బృందం కార్యకలాపాలు కొనసాగించింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్ల కిత్రం ఇస్లాం మతం స్వీకరించి వరంగల్, హైదరాబాద్‌లలో తనకంటూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాగా.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఎర్రగుంటలో పీస్ ఆర్గనైజేషన్ పేరుతో ప్రత్యేకంగా కార్యాలయం నడుపుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి, హిందువులను ఇస్లాం మతం స్వీకరించేలా ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం. అన్ని ప్రాంతాల్లో ఉండే అనాథ పిల్లలను, పేదరికం అనుభవిస్తున్న పిల్లలను దగ్గరకు తీసి చదువు పేరుతో హైదరాబాద్ ముఖ్య కేంద్రానికి తరలించడమే కార్యాచరణగా పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
17 మంది పిల్లల గుర్తింపు...
మల్కాజ్గిరి పోలీసులు ప్రత్యేక నిఘాతో విచారణ చేపట్టడంతో పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో 17 మంది అనాథ పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మత మార్పిడులకు పాల్పడుతున్న సత్యనారాయణ అలియాస్ సిద్దిఖీని ముందుగా అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్రాలు, పీస్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తున్న సభ్యుల పేర్లు బయటకు రావడంతో మణుగూరు మండలంలో గల మత మార్పిడుల కేంద్రం వార్తల్లోకి వచ్చింది. మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన బత్తిని సోమేశ్వరరావు అలియాస్ అబ్దుల్లాతోపాటు ఇదే మండలం విజయనగరం గ్రామానికి చెందిన సాగర్‌ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంతో 10 మందికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా, అందులో 9 మందిని అరెస్ట్ చేశారు. రామానుజవరం గ్రామానికి చెందిన ఒక పాప, ఒక బాబును సోమేశ్వరరావు ఉచిత విద్య పేరుతో హైదరాబాద్ కేంద్రానికి తరలించినట్లు సమాచారం.
గ్రామాల్లో చెరగని నమ్మకం...
కాగా.. మత మార్పిడుల విషయం బహిర్గతం కావడంతో పాటు కీలకంగా పని చేస్తున్న బత్తిని సోమే శ్వరరావు, సాగర్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించినా.. ఆయా గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ వారు అదే మతంపై పూర్తి నమ్మకంతో ఉన్న ట్లు సమాచారం. సుమారు 35 కుటుంబాలు రహస్యంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు తెలు స్తోంది. ఈ మత మార్పిడుల విషయంపై ఎన్ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ అధికారులు) రాష్ట్రవ్యాప్తంగా గల పీస్ ఆర్గనైజేషన్ కార్యాలయాలు, వాటి పనులు, నిధుల సేకరణ, నిర్వహణ తీరుపై క్షుణ్ణంగా వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇస్లాం మత మార్పిడి, పిల్లలకు ఉచిత విద్య పేరుతో ఉర్దూ, అరబిక్ భాషలు నేర్పడంతోపాటు ఇస్లాం మత సిద్ధాంతాలను నూరిపోయడంపై కూడా ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నారు.