పట్నా : జేడీ(యూ) నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎల్‌జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌ల మధ్య పెరుగుతున్న మైత్రి బీజేపీలో గుబులు రేపుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరు బీజేపీయేతర ఫ్రంట్‌కు చేరువవుతారనే సందేహాలు కమలనాధులను కలవరపెడుతున్నాయి. మరోవైపు లాలూ నేతృత్వంలోని మహాకూటమిలో ఎన్‌డీఏ పార్టీలు కొన్ని చేరతాయనే ప్రచారం ఊపందుకుంది. దేశంలో తలెత్తుతున్న మత ఘర్షణల్లో బీజేపీ దూకుడు వైఖరితో పాటు బీహార్ సర్కార్‌పై ఆర్‌జేడీ విరుచుకుపడుతున్న తీరుతో ముస్లింలు, దళితులు తమకు దూరమవుతారనే ఆందోళన నితీష్, పాశ్వాన్‌లను పునరాలోచనలో పడేస్తున్నాయని భావిస్తున్నారు. బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్‌డీఏను వీడి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో చేరారు.
కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్‌పీ సైతం బీజేపీని వీడుతుందనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడటంలో ఆర్జేడీ తన ప్రాబల్యాన్ని విస్తరించడం నితీష్, పాశ్వాన్‌లకు మింగుడుపడటం లేదు. గత ఆరు నెలల్లో పాశ్వాన్, నితీష్‌లు కనీసం నాలుగు సార్లు భేటీ అయ్యారని ఎల్‌జేపీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రి కుష్వాహ కూడా పాల్గొన్నారు.
మరోవైపు ఏప్రిల్ 14న పాట్నాలో జరిగే దళిత్ సేన జాతీయ సమ్మేళనంలో మరోసారి వీరు కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాశ్వాన్ విడిగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తారనే వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. దళిత్ సేన సమ్మేళనానికి డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీని కూడా ఆహ్వానించారని బీజేపీ చెప్పుకొచ్చింది. ఈ సమావేశం నేపథ్యంలో ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు అవుతుందని భావించడం సరికాదని పేర్కొంది. మరోవైపు పాశ్వాన్ మహాకూటమిలో చేరతారని ఆర్జేడీ పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment