లెఫ్ట్ నేతలతో నితీష్ మంతనాలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నివాసంలో సీపీఎం, సీపీఐ, జేడీయూ నేతలు సమావేశమయ్యారు. ప్రకాష్ కారత్, ఏబీ బర్దన్లతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు నేతలు మామూలుగా కలిసారని, ఇది అధికారిక భేటీ కాదని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలోనే అధికారికంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత 11 పార్టీలు సమావేశమయి మూడో ఫ్రంట్ చర్చిస్తాయని దేవెగౌడ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి మూడో ఫ్రంట్‌కు రూపురేఖలు వస్తాయని ప్రకాష్ కారత్ అన్నారు.