Ram Vilas Paswan
-
Bihar:మరో ‘కుటుంబ ఆధిపత్యం’.. ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు
గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. బీహార్‌లోని నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానమైన గయ ఇప్పుడు జితన్ రామ్ మాంఝీ కుటుంబానికి దక్కింది.గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో జితన్ రామ్ మాంఝీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ఆయన కోడలు, బీహార్ ప్రభుత్వ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ భార్య దీపా మాంఝీ విజయం సాధించారు. ఫలితంగా బీహార్ రాజకీయాల్లో జితన్ రామ్ మాంఝీ కుటుంబ పరపతి పెరిగింది. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.జితన్ రామ్ మాంఝీ కేంద్ర మంత్రిగా, ఆయన కుమారుడు సంతోష్ కుమార్ బీహార్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందిన జ్యోతి మాంఝీ బారాచట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా అయ్యారు. జితన్‌రామ్ మాంఝీ 1980లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఘోర పరాజయం పాలవడంతో, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు. ఏడాది తరువాత అతను కూడా రాజీనామా చేశారు.అనంతరం జితన్ రామ్ మాంఝీ 2015లో హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీని స్థాపించి ఎన్డిఎలో చేరి ఇమామ్‌గంజ్ నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015 నుండి మే 2024 వరకు ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జూన్ 2024లో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. గయ నుంచి ఎంపీ అయిన తర్వాత మోదీ కేబినెట్లో కూడా చోటు దక్కించుకుని ఎంఎస్ఎంఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: వామదేవుడి వృత్తాంతం -
ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్‌విలాస్)!
పట్నా: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) భాగస్వామిగా చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నిత్యానంద రాయ్ తాజాగా చర్చలు జరిపారు. బీజేపీ, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ ఒకే విలువలను పంచుకొనేవారని గుర్తుచేశారు. ప్రజా సాధికారతతోపాటు అభివృద్ది కోసం పాశ్వాన్ ఎంతగానో తపించేవారని కొనియాడారు. అయితే, ఎన్డీయేలో లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) చేరికపై నిత్యానంద రాయ్ నేరుగా స్పందించలేదు. చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. బీజేపీతో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయేలో చేరికపై ఇప్పుడే స్పందించడం సరైంది కాదన్నారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని ఆయన గతంలో పలుమార్లు చాటుకున్నారు. -
నా తల్లి, నేను ఒంటరిగా పోరాడుతున్నాం: చిరాగ్ భావోద్వేగం
న్యూఢిల్లీ/పట్నా: ‘‘ఈరోజు నా తల్లి, నేను ఒంటరిగా పోరాడుతున్నాం. నా బలం బిహార్ ప్రజలే. మీ మద్దతు కారణంగానే ఇదంతా సాధ్యమమవుతోంది. నేను సింహం బిడ్డను. నన్ను ఎంతగా దెబ్బకొట్టాలని చూసినా... ఎవరికీ, ఎప్పటికీ భయపడను. మీరే నా ధైర్యం’’ అంటూ లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులు అనుకున్న వారు నట్టేట ముంచినప్పటికీ, ప్రజల అండతో తిరిగి పుంజుకుంటానని పేర్కొన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ సోమవారం.. ‘‘పాశ్వాన్’’ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఈరోజు మా బాబాయ్ నాకు అండగా నిలబడతారని ఆశించా. కానీ అది జరుగలేదు. మరేం ఫర్వాలేదు. అంకితభావం, కఠిన శ్రమతోనే గుర్తింపు దక్కుతుందని నాన్న చెప్పేవారు. ఆయన మాటలే నాకు స్ఫూర్తి. నేను నాన్నగారి బాటనే ఎంచుకున్నాను’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అదే విధంగా బాబాయ్ పశుపతి పరాస్తో విభేదాల గురించి ప్రస్తావిస్తూ... ‘‘కొంత మంది కుటుంబ సభ్యులే మమ్మల్ని మోసం చేశారు. కానీ.. ఎంతో శక్తివంతమైన మా ప్రజాకుటుంబం మాతోనే ఉంది. సొంతం అనుకున్న వాళ్లు మోసం చేయవచ్చేమో కానీ.. ఈ విస్త్రృత కుటుంబం మాత్రం నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా’’ చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇక హాజీపూర్ నుంచి ఆశీర్వాద్ యాత్ర ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా హాజీపూర్ ఎంపీ పశుపతి పరాస్ ఎల్జేపీలో తిరుగుబాటు లేననెత్తి ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి దక్కించుకోవడంతో పాటు పార్లమెంటరీ నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గం నుంచే చిరాగ్ యాత్ర మొదలుపెట్టడం గమనార్హం. #WATCH | LJP leader Chirag Paswan breaks down during the book launch of his late father Ram Vilas Paswan, on his birth anniversary. He says, "I am the son of a lion, will never be scared, no matter how much people try to break us..." pic.twitter.com/rh6qC5v53y — ANI (@ANI) July 5, 2021 -
మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్ పాశ్వాన్
పట్నా/న్యూఢిల్లీ: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ అంశంపై చట్టబద్ధ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. పశుపతి పరాస్ సహా ఐదుగురు ఎంపీలు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకోవడం.. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లాకు తెలపడం.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఈ క్రమంలో చిరాగ్‌ను జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ఎల్జేపీ ప్రకటన విడుదల చేయగా.. ఇందుకు స్పందించిన చిరాగ్.. తానే ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్... ‘‘ఒకవేళ పశుపతి పరాస్ పార్లమెంటరీ నేతగా ఉంటానని నన్ను కోరితే ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకునేవాడిని. ఆయనను నాయకుడిని చేసేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా నన్ను పార్టీ పదవి నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విషయంపై పోరాడేందుకు నేను సిద్ధమవుతున్నా. నిజానికి దీనంతటి వెనుక జేడీయూ హస్తం ఉంది. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీలను విడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తాం. ప్రస్తుత పరిస్థితికి జేడీయూనే ముఖ్య కారణం. ఏదేమైనా నేను రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడిని. సింహం బిడ్డను. కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తాను’’అని చెప్పుకొచ్చారు. అదే విధంగా.. ‘‘నన్ను ఘోరంగా మోసం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు. టైఫాయిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను మంచాన పడి ఉన్న సమయంలో ఇలాంటి వ్యూహంతో నాకు వెన్నుపోటు పొడవడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. పార్టీని, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. మా అమ్మ కూడా బాబాయ్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. పరాస్‌ను నా తండ్రిలా భావించాను. కానీ ఆయన నా తండ్రి మరణించిన నాడే మాకు దూరంగా వెళ్లిపోయారు’’ అని చిరాగ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020లో తమ పార్టీ పరాజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయం నాకు అత్యంత కఠినమైనది.. అప్పుడే నాన్నను కోల్పోయాను. నా కుటుంబంతో సరిగ్గా సమయం గడిపే వీలు కూడా దొరకలేదు. శాసనసభ ఎన్నికల్లో ఎల్జేపీ బాగానే పనిచేసింది. మా పార్టీకి ఓటింగ్ శాతం 2 నుంచి 6 శాతానికి పెరిగింది’’ అని తన నాయకత్వాన్ని చిరాగ్ సమర్థించుకున్నారు. చదవండి: ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
బీజేపీకి చెక్: చిరాగ్ చెంతకు తేజస్వీ
పట్నా : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బిహార్‌లో రాజకీయం మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటు దీనికి కేంద్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోరుమీదుకున్న ఎన్డీయే కూటమికి చెక్ పెట్టాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎత్తులు వేస్తున్నారు. దీనికి లోక్‌జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాం విలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి తమ కుటుంబానికే కేటాయిస్తుందని చిరాగ్ భావించారు. అయితే ఊహించని విధంగా ఆ స్థానానికి బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ పేరును నామినేట్ చేయడం యవనేతకు షాకింగ్ కలిగించింది. తన తండ్రి స్థానంలో జరుగుతున్న ఎన్నికకు కనీసం తమకు సంప్రదించకుండా సుశీల్ పేరును ఖరారు చేయడం ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. (ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) ఈ క్రమంలో చిరాగ్‌తో దోస్తీకి ప్రయత్నం చేస్తున్న తేజస్వీ వ్యూహత్మకంగా ఆలోచన చేశారు. పాశ్వాన్ మృతితో జరుగుతున్న ఎన్నికలో ఆయన భార్య, చిరాగ్ తల్లి రీనాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో చిరాగ్‌కు దగ్గర కావడంతో పాటు ఎన్డీయే విజయానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. రీనాకు ఆర్జేడీ మద్దతు ఇస్తామని తేజస్వీ ఇదివరకే వర్తమానం పంపినట్లు బిహార్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఆర్జేడీ సీనియర్ నేత శక్తీ యాదవ్ మాట్లాడుతూ.. రినా పాశ్వాన్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే దానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నిర్ణయం చిరాగ్‌కే వదిలేస్తామని తెలిపారు. ఒకవేళ చిరాగ్ ముందుకు రాకపోతే మహాకూటమి తరుఫున సుశీల్ మోదీకి వ్యతిరేకంగా తామూ అభ్యర్థిని బరిలో నిలుపుతామని వెల్లడించారు. బిహార్ అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిగిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సహకారంతో రాజ్యసభ స్థానాన్ని కైవలం చేసుకునే విధంగా ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) మరోవైపు తేజస్వీ ఎత్తుగడ బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ చిరాగ్‌ను తనవైపుకు తిప్పుకుంటే ఎల్జేపీ సానుభూతిపరులు దాదాపు తేజస్వీ వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌తో విభేదించిన చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జేడీయూపై తీవ్ర ప్రభావం చూపగా.. బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చిపెట్టింది. అయితే తాము ఎన్డీయే భాగస్వామ్యం పక్షంగానే కొనసాగుతామని ప్రకటించిన ఎల్జేపీ.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో మాత్రం చేరలేదు. దీంతో తండ్రి మరణం అనంతరం చిరాగ్ ఒంటరి వాడు అయ్యాడనే భావన కలుగుతోంది. దీనిని తేజస్వీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫర్‌పై చిరాగ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్ పాశ్వన్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారులో కీలకంగా వ్యవహరించి రాం విలాస్ పాశ్వాన్ మృతి కూటమికి తీరని లోటనే చెప్పవచ్చు. అయితే నితీష్ కుమార్‌తో విబేధాల నేపథ్యంలో ఈ సారి రాం విలాస్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తాను ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇది తన తండ్రి కోరిక అన్నారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మా నాన్న భావించారు. అలా అయితేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ నుంచి విడిపోయినా.. బీజేపీతో పొత్తుకు కట్టుబడి ఉన్నాం. నితీష్ కుమార్ ప్రభుత్వంపై పోరాడతాం. ఒంటరిగా బరిలో దిగాలని నాన్న నన్ను ప్రేరేపించారు. ఇది నాన్న గారి అతిపెద్ద కల. 2005లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని గరించి విదేశాంగ శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్, షహనావాజ్ హుస్సేన్ వంటి చాలా మంది బీజేపీ నాయకులకు తెలుసు’ అన్నారు. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) అంతేకాక ‘ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో ఐదేళ్లు కొనసాగితే మీరు మరో 10-15 ఏళ్లు చింతించాల్సి వస్తుంది. మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు బాధపడతారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని నాన్న భావించారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నన్ను ప్రేరేపించారు’ అన్నారు చిరాగ్ పాశ్వాన్. తన తండ్రి మరణం తనను ఎంతో కుంగదీసిందన్నారు. ‘నేను తనని చాలా మిస్ అవుతున్నాను. ఇలాంటి పరిస్థితిని ఎవ్వరు ముందుగా ఊహించలేరు. ఈ బాధ వర్ణణాతీతం. నాన్న లేరు.. మరో వైపు ఎన్నికలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాలే నాకు బలం. ఆయన పాటించిన విలువలను నేను కొనసాగిస్తాను’ అని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ బతికి ఉంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదన్నారు సుశీల్ కుమార్ మోదీ. -
పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!
పట్నా : కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు కష్టాలు తప్పేలా లేవు. మాయావతి తరువాత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన దళిత నేతగా పేరొందిన రాంవిలాస్ మరణించడం.. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. దళిత ఓట్లను ఆకట్టుకోవడంలో వ్యూహ రచనచేయడంలో ఆయన దిట్టగా పేరొందారు. దశాబ్ధాలుగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు. యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళిత, బహుజనులను రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని చెప్పకతప్పడంలేదు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా పాశ్వాన్ దేశవ్యాప్తంగా పేరుగాంచారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకు దక్కింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. నితీష్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని దళిత నేత ప్రణాళికలు రచించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించడంతో యువనేత చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలను భుజానకెత్తునే పరిస్థితి నెలకొంది. తండ్రి అంతటి రాజకీయ అనుభవంతో పాటు వ్యహరచనలో మెలుకువులు తెలియకపోవడం చిరాగ్‌కు పెద్ద సమస్యగా మారింది. పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనప్పటికీ ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఇంకా రాం విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారు. పాశ్వాన్ లేని ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఏ విధంగా ఆదరిస్తారానేది ఆసక్తికరంగా మారింది. (సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ) ఇన్నేళ్లు పార్టీ కార్యక్రమాలను చిరాగ్ పర్యవేక్షిస్తున్నా అంతియ నిర్ణయం తండ్రిదే కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తాజాగా నెలకొన్న విపత్కరమైన పరిస్థితుల్లో ప్రచార బాధ్యతల నుంచి, అభ్యర్థుల ఎంపిక కూడా చిరాగే చూడాల్సి ఉంది. అయితే చిరాగ్ మాటను పార్టీలోని సీనియర్లు ఎంత వరకు గౌరవిస్తారనేది భవిష్యత్‌లో బయటపడనుంది. మరోవైపు తొలివిడత పోలింగ్‌లో ఎల్జేపీకి అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. వాటికి దీటుగా అనుభవంలేని చిరాగ్ ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. అయితే యువనేతకు మద్దతుగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు ఉన్నారనేది బిహార్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. -
ఇక మిగిలింది అథవాలే ఒక్కరే!
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎన్డీయే మంత్రివర్గంలో బీజేపీ మిత్రపక్షాల నుంచి రాంధాస్ అథవాలే ఒక్కరే మిగిలారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు అయిన అథవాలే ప్రస్తుతం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రిగా పని చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే–2 ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన అరవింద్ సావంత్(శివసేన), హర్సిమ్రత్ కౌర్ బాదల్(శిరోమణి అకాలీదళ్) గతంలోనే రాజీనామా చేశారు. తాజాగా పాశ్వాన్(ఎల్జేపీ) అనారోగ్యంతో మృతిచెందారు. (చదవండి: పాశ్వాన్ కన్నుమూత ) ఇక శివసేన, శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోయాయి. మరో మిత్రపక్షం జేడీ(యూ) కేంద్రంలో ఎన్డీయే సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా 57 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 24 మంది కేబినెట్, 9 మంది సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా), 24 మంది సహాయ మంత్రులు. అరవింద్ సావంత్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా, పాశ్వాన్ మరణంతో కేబినెట్ మంత్రుల సంఖ్య 21కి పడిపోయింది. అలాగే రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతితో సహాయ మంత్రుల సంఖ్య 23కు పడిపోయింది. రాజ్యాంగం ప్రకారం ప్రధాని మోదీ 80 మంది మంత్రులను నియమించుకునేందుకు అవకాశం ఉంది. -
పాశ్వాన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో ఉన్న దళిత నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్ఎస్పి) చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు.ఈ సందర్భంగా పాశ్వాన్ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. (చదవండి : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత) హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ మృతి పట్ల పార్టీ కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘అందుకే ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు’
పట్నా: ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ నిర్ణయానికి మద్దతిచ్చారు. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సంజయ్ పాశ్వాన్, చిరాగ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాక ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరికొద్ది రోజులు అధికారంలో ఉండటానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల కమిషన్ చేసుకుంటుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరేవారు సొంత పార్టీ వారు అయినా లేక ప్రతిపక్షం వారైనా సరే.. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని భావించాల్సి వస్తుంది’ అన్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్‌కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. జనాలకు ప్రమాదమే కాక ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాక ‘కరోనా కారణంగా, సామాన్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితులలో, ఎన్నికలు అదనపు భారాన్ని కలిగిస్తాయి. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని (ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి) పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. సకాలంలో ఎన్నికలు ‘సుపరిపాలన’ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని.. జాతీయ వేదికపై బిహార్‌కు ‘తగిన గౌరవం’ పొందడానికి సహాయపడుతుందని అన్నారు. -
బీజేపీకి షాక్.. ఒంటరిగానే పోటీ చేస్తాం!
న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామి లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) బీజేపీకి షాకిచ్చింది. జార్ఖండ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలోకి దిగుతామని స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు జార్ఖండ్‌లో 50 శాసన సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని.. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. కాగా 81 శాసన సభ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించింది. కాగా జార్ఖండ్‌లో ఎల్జేపీ ప్రభావం లేకపోయినా మిత్రపక్షానికి వ్యతిరేకంగా పోటీకి దిగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో కీలక పాత్ర పోషించిన చిరాగ్.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ప్రకారం 50 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో పోటీ చేసిన ఎల్జేపీ అక్కడ పరాజయం పాలైంది. झारखंड में चुनाव लड़ने का आख़िरी फ़ैसला प्रदेश इकाई को लेना था।लोक जनशक्ति पार्टी झारखंड प्रदेश इकाई ने यह फ़ैसला लिया है पार्टी 50 सीटों पर अकेले चुनाव लड़ेगी।आज शाम तक पार्टी के उमीदवारों की पहली सूची का एलान हो जाएगा। — Chirag Paswan (@ichiragpaswan) November 12, 2019 -
వారసుడికి పార్టీ పగ్గాలు
న్యూఢిల్లీ: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) కొత్త అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరంలో ఎల్జేపీని స్థాపించిన సీనియర్ నేత రామ్ విలాస్ పాశ్వాన్ (73) దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్‌గా కొనసాగారు. నూతన అధ్యక్షుడిగా తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుందని మంగళవారం ఆయన ప్రకటించారు. రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన చిరాగ్ కొంతకాలంగా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌ను ఎల్జేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ‘యువ నాయకత్వం కోసం కార్యకర్తలందరూ పట్టుబట్టారు. ఎంపీలు కూడా దీనికి మద్దతు ప్రకటించారు. పేదలు, నిమ్నవర్గాలకు న్యాయం జరిగేలా పార్టీని చిరాగ్ నడిపిస్తాడని నాకు నమ్మకముంద’ని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. సంస్థాగతంగా ఎల్జేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియాకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. త్వరలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. గత ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఎల్జేపీ కేవలం ఒకచోట మాత్రమే పోటీ చేసింది. -
‘ప్రధాని పదవి కాదు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు’
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్ని ఏకమైనప్పటికి ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించింది. ప్రధానిగా మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వన్ ఫలితాలపై స్పందిస్తూ.. ‘2019లో ప్రధాని పీఠం ఖాళీగా ఉండదని గత మూడేళ్ల నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ నా సూచనను పట్టించుకోలేదు. ఈ ఐదేళ్లు వారు ప్రధాని పీఠం కోసం కాకుండా ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కృషి చేస్తే బాగుండేది. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలవలేకపోయింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 52 సీట్లకే పరిమితమయ్యింది’ అని ఎద్దేవా చేశారు. అంతేకాక అమేథీలో స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీ మీద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్మృతి ఇరానీకి, రామ్ విలాస్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బిహార్‌లో ఏ పార్టీ లేదని... ఏ నాయకుడు లేడని అన్నారు. అన్ని పార్టీలను ప్రజలు మట్టి కరిపించారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, ఉన్నత వర్గం వారు అందరూ బీజేపికే ఓటు వేశారని తెలిపారు. కులతత్వాన్ని బీజేపీ బ్రేక్ చేసిందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలంటే మొత్తం సీట్లలో కనీసం 10 శాతం స్థానాల్లో విజయం సాధించాలి. ఈ లెక్కన 55 స్థానాల్లో గెలుపొందిన పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమయ్యింది. -
నితీష్-పాశ్వాన్ దోస్తీతో బీజేపీలో గుబులు
పట్నా : జేడీ(యూ) నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ల మధ్య పెరుగుతున్న మైత్రి బీజేపీలో గుబులు రేపుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరు బీజేపీయేతర ఫ్రంట్‌కు చేరువవుతారనే సందేహాలు కమలనాధులను కలవరపెడుతున్నాయి. మరోవైపు లాలూ నేతృత్వంలోని మహాకూటమిలో ఎన్డీఏ పార్టీలు కొన్ని చేరతాయనే ప్రచారం ఊపందుకుంది. దేశంలో తలెత్తుతున్న మత ఘర్షణల్లో బీజేపీ దూకుడు వైఖరితో పాటు బీహార్ సర్కార్‌పై ఆర్జేడీ విరుచుకుపడుతున్న తీరుతో ముస్లింలు, దళితులు తమకు దూరమవుతారనే ఆందోళన నితీష్, పాశ్వాన్‌లను పునరాలోచనలో పడేస్తున్నాయని భావిస్తున్నారు. బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఇప్పటికే ఎన్డీఏను వీడి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో చేరారు. కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ సైతం బీజేపీని వీడుతుందనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడటంలో ఆర్జేడీ తన ప్రాబల్యాన్ని విస్తరించడం నితీష్, పాశ్వాన్లకు మింగుడుపడటం లేదు. గత ఆరు నెలల్లో పాశ్వాన్, నితీష్‌లు కనీసం నాలుగు సార్లు భేటీ అయ్యారని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కేంద్ర మంత్రి కుష్వాహ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏప్రిల్ 14న పాట్నాలో జరిగే దళిత్ సేన జాతీయ సమ్మేళనంలో మరోసారి వీరు కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాశ్వాన్ విడిగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తారనే వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. దళిత్ సేన సమ్మేళనానికి డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీని కూడా ఆహ్వానించారని బీజేపీ చెప్పుకొచ్చింది. ఈ సమావేశం నేపథ్యంలో ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు అవుతుందని భావించడం సరికాదని పేర్కొంది. మరోవైపు పాశ్వాన్ మహాకూటమిలో చేరతారని ఆర్జేడీ పేర్కొంటోంది. -
ఉల్లి దిగుమతులకు ఓకే
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఎంఎంటీసీ ద్వారా 2000 టన్నుల ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు సరఫరాలు పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు దేశీయ మార్కెట్ల నుంచి నాఫెడ్,ఎస్ఎఫ్ఏసీలు 12,000 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసేందుకు సంసిద్ధమయ్యాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు కనిష్ట ఎగుమతి ధరను తిరిగి విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలు తగ్గడంతో దేశంలోని పలు చోట్ల ఉల్లి ధరలు కిలో రూ 50-65 మధ్య పలుకుతున్నాయి. ధరలకు చెక్ పెట్టేందుకు 12,000 టన్నుల ఉల్లిని సేకరించాలని తాము నాఫెడ్, ఎస్ఎఫ్ఏసీలను కోరామని చెప్పారు. ఉల్లి సరఫరాలను పెంచి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. -
కొత్త మంత్రులు ఏం చెప్పారు?
ఢిల్లీ: కేంద్రంలో కొత్త మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై స్పందించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించడానికి సిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తామని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పారు. ధరల పెరుగుదలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఎగుమతులు పెంచడానికి కృషి చేస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మీడియాను నియంత్రించే ఆలోచనలు ఏవీ లేవని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసన్నారు. తనకు తానుగా మీడియా నియంత్రించుకోగలదన్న భావన వ్యక్తం చేశారు. సురక్షిత ప్రయాణం, భద్రత, వేగం ఇవే తమ ప్రాధాన్యతలని రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు. సీబీఐ విశ్వసనీయత పెంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని పీఎంఓ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటరీ వ్యవహారాల, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. -
బీజేపీతో ఎల్జేపీ పొత్తు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) మధ్య పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని ఎల్జేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సూరజ్‌భన్ తెలిపారు. ఆదివారమిక్కడ పాశ్వాన్ ఇంట్లో జరిగిన ఎల్జేపీ నేతల సమావేశం అనంతరం సూరజ్‌భన్ విలేకర్లతో మాట్లాడారు. బీజేపీతో పొత్తుపై త్వరలో అధికార ప్రకటన ఉంటుందని, బీహార్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ అందులో వెల్లడిస్తామని అన్నారు. దీనిపై పాశ్వాన్ త్వరలోనే బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుంటారని చెప్పారు. అయితే కమలనాథులతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎల్జేపీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాలిక్ పేర్కొన్నారు. తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలదన్నారు. పాశ్వాన్ తనయుడు చిరాగ్ కూడా ఇదే విధంగా స్పందించారు. కాగా, గుజరాత్ అల్లర్లకు నిరసగా 2002లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన పాశ్వాన్ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో ఎలా పెట్టుకోగలరని విలేకర్లు అడగ్గా సూరజ్‌భన్ స్పందించారు. ‘మోడీకి కోర్టులే క్లీన్చిట్ ఇచ్చాక ఇక ఏదైనా అనేందుకు మేమెవరం?’ అని అన్నారు. గతంలో యూపీఏలో జట్టుకట్టిన పాశ్వా న్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కాంగ్రెస్ చీఫ్ సోనియాతో పొత్తుపై చర్చలు జరిపినప్పటికీ సీట్ల పంపిణీలో తకరారు వచ్చింది. ఎల్జేపీతో పొత్తుకు యత్నించి విఫలమైన కాంగ్రెస్ కక్ష తీర్చుకోవడానికి పాశ్వాన్‌ను ఓ స్కామ్ సాకుతో వేధించేందుకు సీబీఐని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, బీహార్‌లో బీజేపీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.