కొత్త మంత్రులు ఏం చెప్పారు?
ఢిల్లీ: కేంద్రంలో కొత్త మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై స్పందించారు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించడానికి సిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తామని కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పారు. ధరల పెరుగుదలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
ఎగుమతులు పెంచడానికి కృషి చేస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
మీడియాను నియంత్రించే ఆలోచనలు ఏవీ లేవని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. మీడియాకు తన బాధ్యత ఏంటో తెలుసన్నారు. తనకు తానుగా మీడియా నియంత్రించుకోగలదన్న భావన వ్యక్తం చేశారు.
సురక్షిత ప్రయాణం, భద్రత, వేగం ఇవే తమ ప్రాధాన్యతలని రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు.
సీబీఐ విశ్వసనీయత పెంచడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని పీఎంఓ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేక హోదా అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
మేనిఫెస్టోలో తామిచ్చిన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటరీ వ్యవహారాల, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.