గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. బీహార్‌లోని నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానమైన గయ ఇప్పుడు జితన్ రామ్ మాంఝీ కుటుంబానికి దక్కింది.
గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో జితన్ రామ్ మాంఝీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ఆయన కోడలు, బీహార్ ప్రభుత్వ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ భార్య దీపా మాంఝీ విజయం సాధించారు. ఫలితంగా బీహార్ రాజకీయాల్లో జితన్ రామ్ మాంఝీ కుటుంబ పరపతి పెరిగింది. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
జితన్ రామ్ మాంఝీ కేంద్ర మంత్రిగా, ఆయన కుమారుడు సంతోష్ కుమార్ బీహార్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందిన జ్యోతి మాంఝీ బారాచట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా అయ్యారు. జితన్‌రామ్ మాంఝీ 1980లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఘోర పరాజయం పాలవడంతో, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు. ఏడాది తరువాత అతను కూడా రాజీనామా చేశారు.
అనంతరం జితన్ రామ్ మాంఝీ 2015లో హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీని స్థాపించి ఎన్‌డిఎలో చేరి ఇమామ్‌గంజ్ నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015 నుండి మే 2024 వరకు ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జూన్ 2024లో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. గయ నుంచి ఎంపీ అయిన తర్వాత మోదీ కేబినెట్‌లో కూడా చోటు దక్కించుకుని ఎంఎస్‌ఎంఈ శాఖను నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: వామదేవుడి వృత్తాంతం
Comments
Please login to add a commentAdd a comment