బీజేపీతో ఎల్జేపీ పొత్తు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) మధ్య పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని ఎల్జేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సూరజ్‌భన్ తెలిపారు. ఆదివారమిక్కడ పాశ్వాన్ ఇంట్లో జరిగిన ఎల్జేపీ నేతల సమావేశం అనంతరం సూరజ్‌భన్ విలేకర్లతో మాట్లాడారు. బీజేపీతో పొత్తుపై త్వరలో అధికార ప్రకటన ఉంటుందని, బీహార్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ అందులో వెల్లడిస్తామని అన్నారు. దీనిపై పాశ్వాన్ త్వరలోనే బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుంటారని చెప్పారు. అయితే కమలనాథులతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎల్జేపీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాలిక్ పేర్కొన్నారు. తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలదన్నారు. పాశ్వాన్ తనయుడు చిరాగ్ కూడా ఇదే విధంగా స్పందించారు. కాగా, గుజరాత్ అల్లర్లకు నిరసగా 2002లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన పాశ్వాన్ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీతో ఎలా పెట్టుకోగలరని విలేకర్లు అడగ్గా సూరజ్‌భన్ స్పందించారు.
‘మోడీకి కోర్టులే క్లీన్‌చిట్ ఇచ్చాక ఇక ఏదైనా అనేందుకు మేమెవరం?’ అని అన్నారు. గతంలో యూపీఏలో జట్టుకట్టిన పాశ్వా న్, ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కాంగ్రెస్ చీఫ్ సోనియాతో పొత్తుపై చర్చలు జరిపినప్పటికీ సీట్ల పంపిణీలో తకరారు వచ్చింది. ఎల్జేపీతో పొత్తుకు యత్నించి విఫలమైన కాంగ్రెస్ కక్ష తీర్చుకోవడానికి పాశ్వాన్‌ను ఓ స్కామ్ సాకుతో వేధించేందుకు సీబీఐని దుర్వినియోగం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, బీహార్‌లో బీజేపీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.