పట్నా : కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ) అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు కష్టాలు తప్పేలా లేవు. మాయావతి తరువాత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన దళిత నేతగా పేరొందిన రాంవిలాస్ మరణించడం.. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. దళిత ఓట్లను ఆకట్టుకోవడంలో వ్యూహ రచనచేయడంలో ఆయన దిట్టగా పేరొందారు. దశాబ్ధాలుగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు. యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళిత, బహుజనులను రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని చెప్పకతప్పడంలేదు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా పాశ్వాన్ దేశవ్యాప్తంగా పేరుగాంచారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకు దక్కింది.
ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. నితీష్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని దళిత నేత ప్రణాళికలు రచించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించడంతో యువనేత చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలను భుజానకెత్తునే పరిస్థితి నెలకొంది. తండ్రి అంతటి రాజకీయ అనుభవంతో పాటు వ్యహరచనలో మెలుకువులు తెలియకపోవడం చిరాగ్‌కు పెద్ద సమస్యగా మారింది. పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనప్పటికీ ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఇంకా రాం విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారు. పాశ్వాన్ లేని ఎల్‌జేపీని బిహార్ ఓటర్లు ఏ విధంగా ఆదరిస్తారానేది ఆసక్తికరంగా మారింది. (సోలోగా ఎల్‌జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ)
ఇన్నేళ్లు పార్టీ కార్యక్రమాలను చిరాగ్ పర్యవేక్షిస్తున్నా అంతియ నిర్ణయం తండ్రిదే కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తాజాగా నెలకొన్న విపత్కరమైన పరిస్థితుల్లో ప్రచార బాధ్యతల నుంచి, అభ్యర్థుల ఎంపిక కూడా చిరాగే చూడాల్సి ఉంది. అయితే చిరాగ్ మాటను పార్టీలోని సీనియర్లు ఎంత వరకు గౌరవిస్తారనేది భవిష్యత్‌లో బయటపడనుంది. మరోవైపు తొలివిడత పోలింగ్‌లో ఎల్‌జేపీకి అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. వాటికి దీటుగా అనుభవంలేని చిరాగ్ ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. అయితే యువనేతకు మద్దతుగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు ఉన్నారనేది బిహార్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట.
Comments
Please login to add a commentAdd a comment