![Chirag Paswan Elected Lok Janshakti Party President - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/6/paswan_chirag.jpg.webp?itok=6fJtcPgU)
న్యూఢిల్లీ: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్‌జేపీ) కొత్త అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరంలో ఎల్‌జేపీని స్థాపించిన సీనియర్ నేత రామ్ విలాస్ పాశ్వాన్ (73) దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్‌గా కొనసాగారు. నూతన అధ్యక్షుడిగా తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుందని మంగళవారం ఆయన ప్రకటించారు. రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన చిరాగ్ కొంతకాలంగా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌ను ఎల్‌జేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్‌జేపీ చేరడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ‘యువ నాయకత్వం కోసం కార్యకర్తలందరూ పట్టుబట్టారు. ఎంపీలు కూడా దీనికి మద్దతు ప్రకటించారు. పేదలు, నిమ్నవర్గాలకు న్యాయం జరిగేలా పార్టీని చిరాగ్ నడిపిస్తాడని నాకు నమ్మకముంద’ని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు.
సంస్థాగతంగా ఎల్‌జేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియాకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. త్వరలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. గత ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఎల్‌జేపీ కేవలం ఒకచోట మాత్రమే పోటీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment