
న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామి లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్‌జేపీ) బీజేపీకి షాకిచ్చింది. జార్ఖండ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలోకి దిగుతామని స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు జార్ఖండ్‌లో 50 శాసన సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని.. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. కాగా 81 శాసన సభ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించింది. కాగా జార్ఖండ్‌లో ఎల్‌జేపీ ప్రభావం లేకపోయినా మిత్రపక్షానికి వ్యతిరేకంగా పోటీకి దిగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్‌జేపీ చేరడంలో కీలక పాత్ర పోషించిన చిరాగ్.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ప్రకారం 50 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో పోటీ చేసిన ఎల్‌జేపీ అక్కడ పరాజయం పాలైంది.
झारखंड में चुनाव लड़ने का आख़िरी फ़ैसला प्रदेश इकाई को लेना था।लोक जनशक्ति पार्टी झारखंड प्रदेश इकाई ने यह फ़ैसला लिया है पार्टी 50 सीटों पर अकेले चुनाव लड़ेगी।आज शाम तक पार्टी के उमीदवारों की पहली सूची का एलान हो जाएगा।
— Chirag Paswan (@ichiragpaswan) November 12, 2019
Comments
Please login to add a commentAdd a comment