లోక్‌సభ ఎన్నికల అనంతరం తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ ప్రధాని అభ్యర్థి కాబోరని ఆయన తనయుడు...
మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ ప్రధాని అభ్యర్థి కాబోరని ఆయన తనయుడు, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్‌డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తృతీయ ఫ్రంటు పునరుత్థానం కోసం దేవెగౌడ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ప్రధాని అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై ‘ఆలు లేదు చూలు లేదు...’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే ప్రధాని ఎవరనేది తేలుతుందని చెప్పారు.
ఎన్నికల్లో దేవెగౌడ హాసన నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేసే ఆలోచన లేదన్నారు. కాగా బెంగళూరులో ఎమ్మెల్యేలకు జీ కేటగిరీ ఇంటిస్థలాల పంపకంపై ప్రభుత్వం సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలతో పాటు జీ కేటగిరీ నివేశనాలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ ఇంటి స్థలాల కేటాయింపులో ఎమ్మెల్యేల కంటే అధికారుల హస్త లాఘవమే అధికంగా కనిపిస్తోందని ఆరోపించారు.