- ఉత్తర కన్నడ అభ్యర్థి శివానంద నామినేషన్ ఉపసంహరణ
- ఆర్థిక ఇబ్బందులతో వైదొలుగుతున్నట్లు ప్రకటన
- నాయక్‌పై మండిపడిన కుమారస్వామి
- ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ ఆదేశం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజైన శనివారం ఉత్తర కన్నడ జేడీఎస్ అభ్యర్థి శివానంద నాయక్ పార్టీ అగ్ర నాయకులను నిశ్చేష్టులను చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆయన నామినేషన్ ఉపసంహరించు కోవడంతో అక్కడ పార్టీ అభ్యర్థే లేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్లు శివానంద ప్రకటించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, వేరే అభ్యర్థిని సూచించి ఉండాల్సిందన్నారు.
తానే పోటీ చేస్తానని ముందుకు రావడంతో శివానందకు టికెట్టు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు పేడి లాగా ఎన్నికల సమరం నుంచి పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్న మొత్తాన్ని పార్టీకి తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తనయుడు ప్రశాంత్ దేశ్‌పాండే, బీజేపీ అభ్యర్థిగా అనంత కుమార్ హెగ్డే పోటీ చేస్తున్నారు.
కాగా రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు గాను జేడీఎస్ ఇప్పటికే కొప్పళలో అభ్యర్థిని నిలపలేదు. దక్షిణ కన్నడ స్థానాన్ని మిత్ర పక్షం ఎస్‌డీపీఐకి కేటాయించింది. ఉత్తర కన్నడలో అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లయింది.