థర్డ్ ఫ్రంటే లక్ష్యం!
థర్డ్ ఫ్రంటే లక్ష్యం!
Published Tue, Feb 4 2014 4:08 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, చెన్నై:లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి పీఎం పీఠం కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో సీఎం జయలలిత ఉన్నారు. ఆ పార్టీ శ్రేణులు ఇదే నినాదంతో ముందుకెళుతున్నారు. తమ అధినేత్రిని ప్రధాని పదవిలో కూర్చోబెట్టడం తమ కర్తవ్యంగా ప్రతిన బూని మరీ ప్రజల్ని ఆకర్షించే పనిలో ఉన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు శరవేగంగా పంపిణీ చేస్తూ వస్తున్నారు. 40 సీట్లను ఒంటరిగా కైవశం చేసుకోవాలని తొలుత భావించినా, అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయో లేదో అన్న సందిగ్ధంలో అన్నాడీఎంకే వర్గాలు పడ్డాయి.
ఇదే విషయాన్ని కొందరు సీనియర్లు జయలలిత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వారి సూచనను పునరాలోచించిన జయలలిత కూటమికి అంగీకరించినట్టు తెలుస్తోంది. తొలుత కూటమి ఎవరితో అన్న మల్లగుల్లాలు పడ్డా, రాష్ట్రంలో సీపీఎం, సీపీఐలకు కార్మిక ఓటు బ్యాంకు ఉండటం, అదే సమయంలో జాతీయ స్థాయిలో మూడో కూటమికి ప్రయత్నాలు వేగవంతం కాడంతో పొత్తుకు సిద్ధమయ్యారు. వామపక్షాల్ని రాష్ట్రంలో ఆదరిస్తే, జాతీయ స్థాయిలో ఎన్నికల అనంతరం నెలకొనే పరిస్థితుల మేరకు తనకు ఆదరణ దక్కుతుందన్న విషయాన్ని గ్రహించారు. అందుకే థర్డ్ ఫ్రంట్ గెలుపు లక్ష్యంగా ఎన్నికల్లో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు.
పొత్తు: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో లౌకిక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శుక్రవారం సీపీఎం జాతీయ నేత కారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ బాటలో నడిచేందుకు సిద్ధ పడ్డ జయలలిత సీపీఐ నాయకులకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. జయలలిత తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోనున్నారన్న సంకేతంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి జాతీయనాయకులు సుధాకర్ రెడ్డి, బర్దన్ చెన్నై చేరుకుని గంటపాటుగా జయలలితతో భేటీ అయ్యారు. ప్రధానంగా థర్డ్ ఫ్రంట్ ఆవిర్భావం లక్ష్యంగానే ఈ భేటీ సాగినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో సీపీఐని తన కూటమిలోకి చేర్చుకోవడంతో పాటుగా, జాతీయ స్థాయిలో థర్డ్‌ఫ్రంట్‌లో చక్రం తిప్పడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సీపీఐకి సీట్ల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయాన్ని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి టీ పాండియన్ ప్రకటించారు. థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగానే భేటీ సాగిందని, ఆ కూటమిలో గెలుపు ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సీట్ల పందేరంపై ఎలాంటి చర్చ జరపలేదన్నారు. సీపీఐ పొత్తు ఖరారు చేసుకుందో లేదో, సీపీఎం జాతీయ నాయకులు రంగంలోకి దిగారు. సోమవారం పోయస్ గార్డెన్ తలుపులు తెరచుకోవడంతో చర్చలు విజయవంతం అయ్యాయి.
సీపీఎంతోనూ ఒకే : ఆదివారం సీపీఐను తన కూటమిలోకి ఆహ్వానించిన జయలలిత సోమవారం సీపీఎంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణన్, ఎంపీ టికే రంగరాజన్‌లు మధ్యాహ్నం పోయస్ గార్డెన్‌కు వెళ్లారు. సుమారు గంట పాటుగా థర్డ్‌ఫ్రంట్ ఆవిర్భావం లక్ష్యంగా భేటీ సాగింది. భేటీ అనంతరం పొత్తు కుదిరిందంటూ జయలలిత, కారత్ ప్రకటించారు. పీఎం కుర్చీతో పనిలేదు: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఆవిర్భావానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకాష్‌కారత్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో లౌకిక ప్రత్యామ్నాయంలోకి రాబోతున్న పార్టీల వివరాల్ని ఇప్పుడే ప్రకటించబోమన్నారు.
ఎన్నికల నాటికి ఆ పార్టీలను ప్రకటిస్తామన్నారు. ప్రత్యామ్నాయ రాజాకీయ శక్తిగా తమ కూటమి అవతరించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. లౌకిక ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి వస్తే, పీఎం అభ్యర్థి ఎవరో అని కారత్‌ను మీడియా ప్రశ్నించగా, సీఎం జయలలిత జోక్యం చేసుకున్నారు. పీఎం ఎవరన్నది ఇప్పుడు ముఖ్యం కాదని, జాతీయ స్థాయిలో గెలుపు లక్ష్యంగా పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం పీఎం కుర్చీ గురించి చర్చించుకుంటామని, ఇప్పుడు ఆ ప్రస్తావనకు చోటు లేదని దాట వేశారు. ఆదివారం బర్దన్ మీడియాతో మాట్లాడుతూ, తాము గెలిస్తే, జయలలిత ప్రధాని అయ్యేందుకు సహకరిస్తామని పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement