
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: థర్డ్ ఫ్రంట్ అనేది కేసీఆర్ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్ ఫ్రంట్‌లో ఏమీ ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మాజీ నక్సలైట్లు, ఆక్రమణదారులు, పాత కాంగ్రెస్ నేతల కలయికే టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘థర్డ్‌ఫ్రంట్‌కు నాయకులు లేరు, ఓట్లు లేవు’అని అన్నారు. దేశ ప్రజలు మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం కోరుకోవడం లేదన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయ పరంపరను కొనసాగించిందని, ఇదే విజయ పరంపర దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాలకు ద్వారం తెరుచుకుంటుందని మురళీధర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 119 స్థానాల నుంచి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, నేర చరిత, అవినీతి ఆరోపణలు లేని వారు, వివాదరహితులను పార్టీ బరిలో దింపుతుందని తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ పతనానికి రాహుల్ గాంధీ వేగంగా బాటలు వేస్తున్నారని అన్నారు.
ఆయన అధ్యక్షుడు అయిన తర్వాతే ఆ పార్టీ ఓటములను మూట కట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. 21వ శతాబ్దంలో దేశానికి బలమైన సుపరిపాలన ఇవ్వగలిగేది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని మురళీధర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితో పాటు కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్‌రావు పాల్గొన్నారు.