వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలనుకున్న జేడీఎస్ అధిపతి దేవెగౌడకు ఈ ఉప ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలనుకున్న జేడీఎస్ అధిపతి దేవెగౌడకు ఈ ఉప ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమ పార్టీకి గట్టి పట్టున్న రెండు లోక్‌సభ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి గెలవడం ద్వారా తృతీయ ఫ్రంట్‌కు ఊపిరులూదాలని ఆయన కన్న కలలు కల్లలయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై తొలి నుంచే అనుమానాలున్నట్లు ఆయన వైఖరే చెప్పింది. ఉప ఎన్నికల్లో బీజేపీతో పొత్తుందని కుమారుడు కుమారస్వామి ప్రకటించినప్పుడు ఇంతెత్తు ఎగిరిన ఆయన, తిరిగి మౌనంగా ఉండిపోయారు.
బెంగళూరు గ్రామీణ నుంచి పోటీ చేయడానికి కోడలు అనితా కుమారస్వామి నిరాకరించినప్పటికీ, కుటుంబ సభ్యులందరి చేత ఒత్తిడి తెప్పించి ఒప్పించారు. కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే తన సామాజిక వర్గం అండగా ఉంటుందనేది ఆయన ఆలోచన. కోడలికి మద్దతు కూడగట్టడానికి అన్ని పార్టీల వారితోనూ సంప్రదింపులు జరిపారు. చన్నపట్టణ ఎస్‌పీ ఎమ్మెల్యే సీపీ.యోగీశ్వర్ ఇంటికి వెళ్లి ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రతిగా భవిష్యత్తులో చన్నపట్టణలో జేడీఎస్ అభ్యర్థిని నిలపబోనని హామీ కూడా ఇచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయక ముందు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి డీకే. శివ కుమార్ మద్దతును కూడా కోరారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే...ఈ ప్రభావంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరి కొన్ని సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేశారు. ఈ ప్రయత్నాలన్నీ తృతీయ ఫ్రంట్ పునరుత్థానం కోసమే. కుమారస్వామి స్వయంగా, ఉప ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధిస్తే, తృతీయ ఫ్రంట్ తిరిగి ప్రాణం పోసుకుంటుందని ప్రకటించారు. అయితే అనూహ్య పరాజయంతో తృతీయ ఫ్రంట్ మాటేమో కానీ జేడీఎస్ మనుగడకే సవాలు ఎదురైంది.