‘ఇంట్లో ఉంటే నాయకులు కారు.. పార్టీ గెలవదు’
నల్లగొండ: తెలంగాణ బీజేపీ నాయకులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తలంటారు. ఇంట్లో కూర్చుంటే నాయకులు కారని, పార్టీ గెలవదని హెచ్చరించారు. అసలు రాష్ట్ర నాయకులు జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. గాల్లో లెక్కలు వేయడం కాదని, చేతల్లో చూపాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలని సూచించిన అమిత్‌షా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై, ముస్లింల 12శాతం రిజర్వేషన్లపై ఇంకా గట్టిగా పోరాటం చేయాల్సిందని అన్నారు.
అసలు ప్రగతి భవన్ నిర్మాణంపై ఎందుకు పోరాటం చేయలదేని ప్రశ్నించారు. 2018 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని అన్నారు. నియోజవర్గాల వారీగా అభ్యర్థులు లేని చోట చేరికలు నిర్వహించాలని, ఇప్పటి నుంచే వారిని ఎంపిక చేయాలని సూచించారు. ఇక నుంచి మూడు నెలలకోసారి తెలంగాణ వస్తానని, రోడ్ మ్యాప్ వేయాలని, అమలుచేయాలని సూచించారు. సెప్టెంబర్ లోపు అన్ని పోలింగ్ బూత్ కమిటీలు వేసుకోవాలి స్పష్టం చేశారు.