ఇలాగైతే కష్టం.. ఈ స్పీడ్ సరిపోదు
రాష్ట్ర బీజేపీ నేతలపై అమిత్ షా గుస్సా
- టీఆర్‌ఎస్‌పై ఎందుకు దూకుడుగా పోరాడలేకపోతున్నారు
- మతపర రిజర్వేషన్లపై ఏం చేశారు?
- రాష్ట్రపతి ఎన్నికల తర్వాత దక్షిణాదిలో రాజకీయ సమీకరణలు మారతాయని వ్యాఖ్య
నల్లగొండ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పోరాడుతున్నది సరిపోదు. మరింత దూకుడు పెంచాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిపై గట్టిగా ప్రశ్నించి ఎందుకు పోరాడలేక పోతున్నారు? ప్రగతిభవన్‌పై పోరాటం ఎందుకు చేయడం లేదు. దాన్ని ఉధృతం చేయాలి. టీఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రతి అంశంపై గట్టిగా పోరాడాల్సిందే..’’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టంచేశారు. ‘‘మత ప్రాతిపదికన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచితే మీరు చేసింది చాలా తక్కువ. అధికార టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఆ అంశంపై పార్టీ గట్టిగా పోరాడలేకపోయింది. దీనిపై ఎందుకు కోర్టుకు వెళ్లలేదు.
ఇలాంటి అంశాలపై ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ చేపడుతున్న కార్యాచరణ, దాని అమల్లో వేగాన్ని ఇలాగే కొనసాగిస్తే అధికారంలోకి రాలేం. తెలంగాణలో అధి కారంలోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్న పరిస్థితులను, అవకాశాలను బీజేపీ వదులుకున్నట్లు అవుతుంది’’అని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పదాధికారుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ పని తీరు, చేపడుతున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ కమిటీలు పూర్తిగా ఏర్పాటు చేయకపోవడం, సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అవసరైన చర్యలు చేపట్టకపోవడం, నాయకుల ప్రస్తుత పని విధానంలో తీసుకురావాల్సిన మార్పుచేర్పులు తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
మళ్లీ వస్తా.. ఆరు రోజులు ఉంటా..
ప్రస్తుత పని విధానాన్ని సమూలంగా మార్చుకుని, మళ్లీ తాను వచ్చే సెప్టెంబర్‌లోగా మిషన్–2019 రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. ‘‘పార్టీని అధకారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పని చేయాలి. పార్టీలో గ్రూపిజం పెరిగిందని సాక్షాత్తు ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు. గ్రూపులు లేకుండా చేయాలి. బీజేపీకి అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి సమర్థులైన నాయకులను తీసుకోవడంలో తప్పులేదు. ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికపై కూడా అవసరమైన కార్యాచరణ రూపొందిం చుకోండి.
బీజేపీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగాన ఉందని గట్టిగా నమ్ముతున్నాం.’’అని చెప్పారు. ‘నేను మూడ్రోజుల పర్యటనకు వస్తానని ప్రకటిం చాక ఎందరు రాష్ట్ర నాయకులు జిల్లాల్లో పర్యటించారో చేతులెత్తండి..’అని అమిత్ షా ప్రశ్నించారు. అం దుకు రాష్ట్ర పదాధికారుల నుంచి పెద్దగా స్పం దన కనిపించకపోవడంతో.. నేతల తీరును తప్పుబ్టారు. కేంద్ర పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని, పథకాల పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఒక నాయకుడు ప్రస్తావించగా.. ‘‘ఆ పార్టీ చేసే రాజకీయం ఆ పార్టీ చేస్తుంది. నాయకులు, కార్యకర్తలే ప్రచా రం చేస్తే ప్రజలకు అసలు విషయం అర్థమవుతుంది. గర్భిణిలకు కేంద్రం రూ.6 వేలు ఇస్తు న్న విషయాన్ని పార్టీ నేతలే ప్రచారం చేయాలి. దీని దరఖాస్తులను పార్టీ వారే నింపి అందజేస్తే బీజేపీ వారే ఇది చేస్తున్నారని ప్రజలకు తెలుస్తుంది..’’అని అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తమాషా..
సమావేశంలో అమిత్ షా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల తర్వా త దక్షిణాదిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత జరిగే తమాషా చూడండి. వచ్చే ఎన్నికల్లో మనకు పొత్తులుం డవు. ఎవరినీ భరించాల్సిన పని లేదు. ఒం టరిగానే అధికారంలోకి రావాలి. నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో మనం గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పీఠం కొట్టాల్సిందే..’’అని అన్నారు.
ఇక్కడ్నుంచే శంఖారావం..
పార్టీ పదాధికారుల భేటీకి ముందు నల్లగొండలో మేధావులతో అమిత్ షా సమావేశంలో నిర్వహించారు. దక్షిణాదిలో పార్టీ సమరశంఖారావం తెలంగాణ నుంచే పూరిస్తామని, అందుకు తమకు అండగా నిలవాలని మేధావులకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 1,650 పార్టీలుంటే బీజేపీ, వామపక్షాల్లో మినహా ఎక్కడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పగలరా అని మేధావులనుద్దేశించి ప్రశ్నిం చారు. ‘టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ తర్వాత, కేటీఆరో, కవితో అవుతారు. కాంగ్రెస్‌లో రాహుల్ అవుతారు. కానీ బీజేపీలో పనిచేసే కార్యకర్తలే పార్టీ అధ్యక్షులవుతారు. అందుకు నేనే నిదర్శనం. గుజరాత్‌లోని నారాయణ్‌పూర్ పోలింగ్ బూత్ కన్వీనర్‌గా ఉన్న నేను జాతీ య అధ్యక్షుడిని కాగలిగాను. ఇది ఏ పార్టీలోనైనా సాధ్యమవుతుందా’’అని షా వ్యాఖ్యానించారు.