అనవసరపు మాటలొద్దు
అమిత్‌షా.. మా అభివృద్ధిని చూడండి: హరీశ్‌రావు
సాక్షి,మేడ్చల్ జిల్లా: అనవసర మాటల జోలికి వెళ్లకుండా నల్లగొండ జిల్లాలో మిషన్ కాకతీయ చెరువులను చూస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి తెలుస్తుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సూచించారు. తమ పాలన పారదర్శకమని, తప్పులు చూపిస్తే సరిదిద్దు కుంటామన్నారు. పేదల అభివృద్ధే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా అమిత్ షా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులా బాద్‌లో మిషన్‌కాకతీయ పనుల ప్రారంభో త్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మట్లాడారు.
మిషన్ కాకతీయ పనులను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ వారే కాకుండా కేంద్రమంత్రి ఉమాభారతి సైతం మెచ్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పరిశ్రమల రంగంలోనూ తెలంగాణ కు కేంద్రం నంబరువన్ అవార్డు అందజేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలల ఏర్పాటు లాంటి ఎన్నో పథకాలు చేపట్టామని వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై అమిత్‌షా విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ‘మిషన్ కాకతీయ’పనులు చూసి అభినందిస్తున్నారని అన్నారు. ఏదులాబాద్ సభలో బీజేపీ కార్యకర్తలు.. టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలసి భారీ పూలమాలతో మంత్రిని ఘనంగా సత్కరించారు.
రైతులకు సాదా బైనామా...
హెచ్‌ఎండీఏ పరిధిలోని రైతుల భూములకు సాదా బైనామా పంపిణీ చేసే విధంగా రెండు, మూడు రోజుల్లో జీఓ విడుదల చేయనున్నట్లు తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రైతు భూములకు సాదా బైనామాలు అందజేస్తు న్నప్పటికీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని రైతులకు ఇవ్వటం లేదన్న విషయం తన దృష్టికి రావటంతో ప్రత్యేక జీఓ జారీకి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సభకు ముందు జిల్లాలోని ఏదులాబాద్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండల కేంద్రాల్లో రూ.15.58 కోట్లతో చేపట్టిన లక్ష్మీనారాయణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే పనులతో పాటు ఇతర పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునితా మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్మే మలిరెడ్డి సుధీర్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీరెడ్డి, జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.