► ఎలాంటి వ్యూహం అనుసరిద్దాం..
► అమిత్ షా సమక్షంలో పార్టీ నేతల కీలక సమావేశం
► మళ్లీ సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనకు వస్తానన్న కమల దళపతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పట్ల అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై బీజేపీ సమాయత్తం అవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బుధవారం అర్ధరాత్రి వరకు రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సావధాన్‌సింగ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కృష్ణదాస్, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ తదితరులు సమావేశమై చర్చించారు. కేంద్ర పథకాల అమలు తీరు సరిగ్గా లేదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల దాకా వచ్చాయని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ విరుచుకుపడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర పార్టీ–శాసనసభా పక్షం మధ్య మెరుగైన సమన్వయంపై చర్చించారు. ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రంలో చేపట్టనున్న ‘ఇంటింటికి బీజేపీ’ కార్యక్రమంలో పార్టీలోని ప్రతి నాయకుడు 15 రోజుల పాటు కచ్చితంగా పోలింగ్ బూత్ స్థాయిలో పని చేసేలా చూడాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేస్తున్న తీరు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వెనక్కి వెళ్లడం వంటి అంశాలను గణాంకాలతో సహా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నుంచి సమర్థు్థలైన నాయకులను బీజేపీలో చేర్చుకునే అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. మళ్లీ సెప్టెంబరులో మూడు నుంచి ఆరు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తానని, ఆలోగా రాష్ట్ర పార్టీకి అప్పగించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అమిత్ షా ఆదేశించారు.