
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలపై పెత్తనా న్ని చెలాయిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా, రాష్ట్రాల హక్కులను సాధించుకునేందుకే సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను ప్రతిపాదించారని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను అన్ని పార్టీలు, వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు.
జాతీయ పార్టీలకు ఎంతసేపూ అధికారాన్ని కాపాడుకోవాలన్న కాంక్షే తప్ప మరో ఆలోచన ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ పిలిచినా తాను చేరబోనని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తనను అగౌరవపరిచి బయటకు వెళ్లేలా చేసిందని పేర్కొన్నారు. తన కుమారుడి రాజకీయ జీవితం తన వ్యక్తిగతమని డీఎస్ చెప్పారు.