సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘నేను టీఆర్‌ఎస్‌ను వీడితే ప్రజల దృష్టిలో మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది.. అందుకే నా అంతగా నేను పార్టీకి రాజీనామా చేయను.. దయచేసి నన్ను సస్పెండ్ చేయండి.. మీకు చేతకాకపోతే తీర్మానం వెనక్కి పంపండి’’అని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ నిర్ణయం ప్రకటించకుండా తనను మనస్తాపానికి గురి చేయవద్దని అధిష్టానాన్ని కోరారు. మనసులో ఏదో పెట్టుకుని.. నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరని చెప్పారు. లేనిపోనివి కల్పించి.. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారని, అర్ధరాత్రి 12 గంటలకు జైలులో దించారని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సంజయ్‌ని పోలీసులు రిమాండ్ కోసం జిల్లా న్యాయమూర్తి దగ్గరకు తీసుకు వెళితే.. మరునాడు ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అయినా పోలీసులు ఊళ్లో ఉన్న జడ్జీల దగ్గరకు తిప్పి.. చివరికి ఫ్యామిలీ కోర్టు జడ్జీ దగ్గరకు వెళితే రాత్రి 11 గంటలకు ఆదేశాలిచ్చారు..12 గంటలకు జైలులో దించారు.. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం చూపడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందనేది ఎవరికైనా అర్థం అవుతుంది’’అని ఆయన పేర్కొన్నారు. తన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరికపై వివరణ ఇచ్చిన డీఎస్.. అది అర్వింద్ స్వీయ నిర్ణయమని చెప్పారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు.
ఈ రోజుల్లో ఎదిగిన కొడుకులు వాళ్ల భవిష్యత్ గురించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అర్వింద్ బీజేపీలోకి వెళుతున్నారనే విషయం ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు వివరించానని, ఆయన సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం చేశారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పుకొచ్చా రు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేశానో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ బలహీన పర్చానో.. బీజేపీకి ఉపయోగపడేలా ఎప్పుడు మాట్లాడానో, తన అనుచరులను ఎవరిని బీజేపీకి పంపానో చెప్పాలన్నారు. తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని డీఎస్ పేర్కొన్నారు. కష్టసుఖాల్లో ఎల్లవేళలా వెన్నంటే ఉన్నందుకు తన అనుచరులకు రుణపడి ఉంటానన్నారు.
సరైన సమయంలో నిర్ణయం
తన విషయంలో సీఎం కేసీఆర్ స్పందించని పక్షంలో సరైన సమయంలో.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని డీఎస్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందుకు డెడ్‌లైన్లు ఏమీ లేవన్నారు.
నేను రాజీనామా చేయను
Published Wed, Sep 5 2018 2:37 AM | Last Updated on Wed, Sep 5 2018 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment