చెన్నె: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రకటన వెలువడిన తెల్లారే మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ రాజకీయ దూకుడు పెంచారు. ఈ సందర్భంగా తమిళనాడులో కొత్త పొత్తు ఏర్పాటుచేశారు. తనతో కలిసి వచ్చే వారిని కలుపేసుకుని వెళ్తానని ఈ సందర్భంగా కమల్ ప్రకటించాడు.
ఎంఎన్‌ఎం పార్టీ 2018లో స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం కమల్ హాసన్ రాజకీయాల్లోకి దిగారు. అవినీతి రహిత తమిళనాడును మార్చేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కమల్ పార్టీ స్థాపించిన అనంతరం తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కమల్ రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తన స్నేహితుడు అగ్ర నటుడు రజనీకాంత్‌ను కలిసిన విషయం తెలిసిందే. తనకు మద్దతు పలకాలని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై రజనీ ఇప్పటివరకు ఏం స్పందించలేదు.
తాజాగా కమల్ ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌ను కలిశారు. ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారుచేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అయితే మూడో కూటమి సీఎం అభ్యర్థిని తానేనని కమల్ స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని.. మార్చి 7వ తేదీకి తొలి విడతగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తానని కమల్ హాసన్ వివరించారు.
మంచి పనుల కోసం తాను తగ్గడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. దీనర్థం కుదిరితే అన్నాడీఎంకే, డీఎంకే, శశికళతో కూడా కలిసేందుకు సిద్ధమని పరోక్షంగా కమల్ చెప్పారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కమల్ హాసన్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment