కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి అవతరించడం ఖాయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి జోస్యం చెప్పారు.
జహీరాబాద్, న్యూస్‌లైన్: కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి అవతరించడం ఖాయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి జోస్యం చెప్పారు. సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జహీరాబాద్ వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనటానికి ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన ఆదరణతో యువత కొత్తదనాన్ని కోరుకుంటోందని వెల్లడైందని పేర్కొన్నారు.
మూడో ప్రత్యామ్నాయం కోసం 14 ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఇటీవల ఢిల్లీలో సమావేశమయ్యారని గుర్తుచేశారు.
మూడో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, వామపక్ష పార్టీల నేతలు సుముఖంగా ఉన్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు విసిగిపోయారని తెలిపారు.
ఆయన వెంట కర్ణాటక మాజీ మంత్రి కాశీంపూర్ బండెప్ప, టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నామ రవికిరణ్‌గుప్తా, జహీరాబాద్ పట్టణ ప్రముఖులు విశ్వనాథ్‌కోటా, విశ్వమోహన్, అశోక్‌చంద్రే, జి.సురేష్‌బాబు, జి.కిరణ్‌కుమార్, బెజుగం రాజేశ్వర్, బెజుగం వేణుగోపాల్, అశోక్ బెల్కేరి, బీదర్‌కు చెందిన అశోక్‌పాటిల్‌లు పాల్గొన్నారు.