
నరేంద్ర మోడీకి థర్డ్ ఫ్రంట్ భయం
జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ బలపడితే తన పరిస్థితి ఏమిటన్న ఆలోచనే ఇప్పుడు నరేంద్రమోడీకి నిద్ర లేకుండా చేస్తోంది. ప్రాంతీయ పార్టీలను తన దారిలోకి తెచ్చుకునేందుకు నరేంద్ర మోదీ విశ్వప్రయత్నం చేశారు. శక్తిమంతంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు సారీ చెప్పడంతో ప్రధాని కావాలన్న తన కల నెరవేరదని తెలుసుకున్న మోదీ పెద్దగా బలం లేని చిన్నా చితకా పార్టీలతో కూటమి కట్టారు. కానీ అవి కోరుకుంటున్న మేరకు బలాన్ని ఇస్తాయా అన్నది ప్రశ్నార్థకమే.
బలమైన ప్రాంతీయ పార్టీల అధినేతలుగా ఉన్న మమత బెనర్జీ, మాయావతి, జయలలితలు మోడీకి కొరకరాని కొయ్యలుగా మారారు. బెంగాల్ లో బిజెపి ఖాతా తెరవడం కష్టమేనని చెబుతున్నారు. తమిళనాట రెయిన్‌బో సంకీర్ణం పేరుతో బిజెపి ఏడు చిన్నా చితకా పార్టీలతో పెట్టుకున్న పొత్తు కూడా ఫలితమివ్వబోవడం లేదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
మాయావతి ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ స్థానాలు దక్కించుకుంటున్నారన్న అంచనాల నేపథ్యంలో యూపీలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనుకున్న మోదీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒడిశాలో మోదీ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడిందని రాజకీయ అంచనాలు చెబుతున్నాయి.
కీలకమైన తెలంగాణలో బిజెపి ఆశలకు టీఆర్ ఎస్ చెక్ పెట్టినట్లు అంచనాలు వస్తున్నాయి. మొత్తం 17 స్థానాల్లో బిజెపికి ఒక్కటి కూడా దక్కకపోవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల ఏడున ఎన్నికలు జరగనున్న సీమాంధ్రలోనూ బిజెపి ఖాతా తెరవకపోవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సహకరించారనే ఆగ్రహంతో ఉన్న ప్రజలు బాబు, మోదీలను విశ్వసించే పరిస్థితిలో లేరని సమాచారం. వీటికి తోడు ఫ్యాను గాలి ఉధృతికి బాబు, పవన్, మోదీ సేనలు కొట్టుకుపోవడం ఖాయమని వెల్లడౌతోంది.
మరో వైపు దేశవ్యాప్తంగా మోదీకి కేజ్రీవాల్ చెక్ పెట్టారని తెలుస్తోంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటలెక్చువల్ ఓటు, యువత ఓటు తమకే పడేలా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా వ్యవహరించాయని తెలిసింది. దాదాపు రెండొందల స్థానాల్లో బిజెపికి పడాల్సిన ఓట్లను ఆమ్‌ఆద్మీ పార్టీ చీల్చిందని సమాచారం. దీంతో ప్రధాని కావాలని కలలు కంటోన్న మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలు చెక్ పెట్టాయని సర్వేల ద్వారా తెలుస్తోంది.
రాష్ట్రంలో పార్టీ నేతలు వద్దన్నా, గెలిచే అవకాశం లేదన్నా చంద్రబాబుతో చేతులు కలిపిన మోడీ ఇప్పుడు ఒకే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏదో రకంగా జగన్‌ను అడ్డుకోవాలి, ప్రధానిగా తనకు రూటు క్లియర్ చేసుకోవాలన్న తాపత్రయంతో పనిచేస్తున్నారు. ప్రధాని పీఠం దక్కదని తేలిపోవడంతో థర్డ్‌ఫ్రంట్ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు ఈ ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. అయితే మోదీ ప్రచార మాయలో పడకుండా ప్రాంతీయ పార్టీల నేతలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. భవిష్యత్తులో వీరి ఐక్యత మోదీ ఆశలకు చెక్ పెట్టనుందనేది స్పష్టంగా తెలుస్తోంది.