నంద్యాల నుండే మూడో ఫ్రంట్‌కు శ్రీకారం
నంద్యాల: రాష్ట్రంలో మూడో ఫ్రంట్‌కు నంద్యాల నుండే శ్రీకారం చుట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికను వేదికగా చేసుకొని మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సీపీఐ, సీపీఎం, జనసేన, ఎస్‌డీపీఐ, లోక్‌సత్తా, ఆవాజ్ కమిటీలతో పాటు బీసీ, ఎస్సీ సంఘాలను కూడా కలిసి చర్చిస్తున్నామన్నారు. మూడో ఫ్రంట్ తరపున నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థిని దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 8.8 శాతం జనాభా ఉన్న ముస్లింలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోకుండా మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదన్నారు. అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కూడా పక్కదారి పట్టాయన్నారు.