![prashant kishor sharad pawar meeting in delhi third meeting - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/24/meet.jpg.webp?itok=Xo2_aSpf)
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 8 విపక్ష పార్టీల నేతలు మంగళవానం పవార్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశమైన మర్నాడు ఈ భేటీ చోటు చేసుకోవడం విశేషం. పవార్, ప్రశాంత్ కిషోర్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారని, గత పక్షం రోజుల్లో వారిమధ్య ఇది మూడో భేటీ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 11న ముంబైలో పవార్ నివాసంలో ఒకసారి, ఆ తరువాత తాజాగా సోమవారం ఢిల్లీలోని పవార్ నివాసంలో రెండోసారి వారు సమావేశమయ్యారని వెల్లడించాయి.
ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహలున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల మధ్య ప్రశాంత్ కిషోర్, పవార్‌ల మధ్య వరుస భేటీలు జరగడం ఆసక్తికరంగా మారింది. పవార్ నివాసంలో మంగళవారం జరిగిన విపక్ష నేతల సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, ఆర్‌ఎల్‌డీ, నేషనల్ కాన్ఫెరెన్స్, లెఫ్ట్ పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. అది రాజకీయేతర సమావేశమని అందులో పాల్గొన్న పలువురు నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment