సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఘోరంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తమ ఫ్రంట్ చిల్లర రాజకీయాల కోసం కాదని స్పష్టంచేశారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నామని, తమది తృతీయ ఫ్రంట్ కాదని, ప్రజలు, రైతుల ఫ్రంట్ అని పేర్కొన్నారు. దేశాన్ని, రైతులను, నిరుపేదలను, మహిళలను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమన్నారు. 2019 ఎన్నికలకు ముందే రైతుల కోసం ఎజెండా తయారు చేస్తామని, జాతి ప్రయోజనాల కోసమే ఫ్రంట్ ఏర్పడుతుందని చెప్పారు.
‘‘బీజేపీ, కాంగ్రెస్ ట్రాప్‌లో ఉన్న పార్టీలన్నీ బయటకు రావాలి. దేశాన్ని, భారతమాతను కాపాడాలి. రైతులు, నిరుపేదలు, మహిళలు, న్యాయం కోరుకుంటున్న వారిని రక్షించాలి’’అని పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫ్రంట్ ఉద్యమిస్తుందని, దేశాభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా తమతో కలిసిరావొచ్చని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే తాను కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు.
శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వివరించారు. కేసీఆర్ కృషిని దేవెగౌడ అభినందించారు. ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన సీఎం.. దేవెగౌడను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. సమావేశం అనంతరం దేవెగౌడ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు బి.వినోద్ కుమార్, జె.సంతోష్ కుమార్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, టీఎస్ ఎండీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
నీళ్ల కోసం కొట్టుకుంటే చోద్యం చూస్తున్నారా?
తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో దేవెగౌడ స్వయంగా పాల్గొన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. వారి లోపభూయిష్టమైన విధానాల వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటోంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో సమస్యలను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న కావేరి జల వివాదాన్ని కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదు.
జల వివాదాలను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాల మధ్య కేంద్రం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది’’అని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, ప్రతి ఎకరానికి సరిపడేంత సాగునీటిని అందించినా దాదాపు 30 వేల టీఎంసీల మిగులు ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి 2004లో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే.. 14 ఏళ్లు గడిచినప్పటికీ ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకుంటుంటే ఢిల్లీలోని కేంద్ర పాలకులు చోద్యం చూస్తున్నారు. ఆరు నెలల్లో, కనీసం ఏడాదిలో తీర్పు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆదేశించలేదా? ఇదంతా కాంగ్రెస్, బీజీపీ ప్రభుత్వాల అసమర్థత. వైఫల్యమే’’అని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయన్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు.
తెలంగాణ పథకాలు భేష్: దేవెగౌడ
దేశానికి స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లుగా సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తనతో, కుమారస్వామితో కేసీఆర్ చర్చలు జరిపారని వెల్లడించారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీల్లో మిత్రపక్షాలుగా ఉన్న స్థానిక పార్టీలన్నీ తృతీయ కూటమిలో చేరాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజాధనాన్ని దోచుకోవడం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం తప్ప ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి పట్టదని విమర్శించారు.
తృతీయ కూటమికి తమ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన పథకాలు చాలా బాగున్నా యని దేవెగౌడ కితాబిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గర్భిణుల ఆరోగ్యం కోసం వినూత్న పథకం తీసుకొచ్చారని కొనియాడారు. రైతుల కోసం తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా పథకం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
వారివి విభజన రాజకీయాలు: ప్రకాశ్‌రాజ్
సినీనటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు మతం, కులం, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆరోపించారు. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు.
నాలుగేళ్లుగా దేశానికి కేంద్రం చేసేందేమీ లేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలో మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమ సమయంలోనే మద్దతు
తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతు ఇవ్వడంతో పాటు వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు దేవెగౌడకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెట్టుబడి సాయం పథకం ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్ చేసి అభినందించారు.
హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు. అయితే తానే బెంగుళూరుకు వచ్చి కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని నాడు కేసీఆర్ చెప్పారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రకాశ్‌రాజ్ రియల్ హీరో అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment