devegouda
-
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్ అన్నారు. ‘‘హెచ్ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్ ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవటం గమనార్హం. -
ప్రధాని పదవిపై ఆశ.. 7 స్థానాల్లో పోటీ
బెంగళూరు : అద్వానీలా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాబోనని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తిప్పికొట్టారు. దేవెగౌడ ప్రధాని కావాలని ఆశపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో జేడీఎస్ కేవలం ఏడు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఐనా కూడా ఆ పార్టీ నేత(దేవెగౌడను ఉద్దేశిస్తూ) ప్రధానమంత్రి లేదా ప్రధాని సలహాదారు కావాలని ఆశపడుతున్నారు’ అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని కొన్ని సంవత్సరాల కిందట ప్రకటించిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మళ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించారు దేవెగౌడ. గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా పురికొల్పాయన్నారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆశలు లేవన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీలా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. తన పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని, అధికారమనేది ఆ తర్వాతి విషయమని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని, ప్రధాని కావాలని తనకు లేదని చెప్పుకొచ్చారు. చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతుగా నిలిచారని.. అందుకే కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని దేవెడౌడ స్పష్టం చేశారు. -
దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీకి, జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి పోరు వాడివేడిగా ఉంది. కర్ణాటక రాజకీయ పరిస్థితులు ఓ వైపు నుంచి కాక పుట్టిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ కాస్త కూల్‌గా వ్యవహరించారు. రాజకీయాలన్నింటిన్నీ పక్కన పెట్టి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవె గౌడకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. దేవె గౌడకు ఫోన్ చేసిన మోదీ, ఆయన 85వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.‘మన మాజీ ప్రధాని హెచ్డీ దేవె గౌడ జీతో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. దేవె గౌడ ఆరోగ్యవంతుడిగా సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు దేవె గౌడ మన దేశ ప్రధానిగా పనిచేశారు. నేడు ఆయన 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యడ్యూరప్పచే ప్రమాణ స్వీకారం చేయించడంపై ఆ రాష్ట్ర గవర్నర్‌పై కాంగ్రెస్, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ వారి ప్రయత్నాలకు చెక్‌పెట్టిన బీజేపీ, అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. బీజేపీ వైపే మొగ్గుచూపిన కర్ణాటక గవర్నర్ సైతం బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప చేతనే రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయించారు. రేపటి వరకు ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ ఉత్కంఠబరిత రాజకీయ పరిస్థితులతో బీజేపీపై కాంగ్రెస్, జేడీఎస్‌లు గుర్రుగా ఉన్నాయి. Spoke to our former Prime Minister Shri HD Deve Gowda Ji and conveyed birthday wishes to him. I pray for his good health and long life. — Narendra Modi (@narendramodi) May 18, 2018 -
కాంగ్రెస్‌వి హత్యారాజకీయాలు
సంతెమారనహళ్లి/ఉడుపి/చిక్కోడి: కర్ణాటక ఎన్నికల వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం మరింత వేడెక్కిస్తోంది. ఎన్నికలు మరో పదిరోజులు మిగిలున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు ప్రారంభించిన మోదీ.. మొదటిరోజే కాంగ్రెస్‌పై తీవ్ర ఎదురుదాడి చేశారు. చామరాజనగర, ఉడుపి, బెళగావి జిల్లాల్లో ఏర్పాటుచేసిన మూడు బహిరంగ సభల్లో.. సీఎం సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 15 నిమిషాలపాటు సిద్దరామయ్య సర్కారు ప్రజలకు ఏం చేసిందో అనర్గళంగా మాట్లాడాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అప్పుడే కన్నడ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. సిద్దరామయ్య హయాంలో కన్నడనాట హత్యారాజకీయాలు పెరిగాయని విమర్శించారు. ఓటమి భయంతోనే సీఎం చివరి నిమిషంలో రెండోచోట పోటీకి సిద్ధమయ్యారన్నారు. నచ్చిన భాషలో మాట్లాడండి చూద్దాం..! కన్నడ ప్రజలకు సిద్దరామయ్య సర్కారు చేసిన పనులను సొంతగా ఓ 15 నిమిషాలసేపు ఏ భాషలోనైనా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పాలని మోదీ సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందీ, ఇంగ్లీష్లోనైనా లేదంటే తన తల్లి మాతృభాషలోనైనా సరే (సోనియా ఇటలీ మూలాలను ప్రస్తావిస్తూ) 15 నిమిషాలసేపు కర్ణాటకలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను పేపర్‌మీద రాసుకుని కాకుండా సొంతంగా చెప్పాలని సవాల్ చేస్తున్నా. దీని ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటల్లో ఎంత సత్తా ఉందో అర్థం చేసుకుంటారు’ అని చామరాజనగర జిల్లా సంతెమారనహల్లిలోని ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. తనను పార్లమెంటులో 15 నిమిషాలపాటు మాట్లాడనిస్తే ప్రధాని తన సీట్లో కూర్చోకుండా చేస్తానని రాహుల్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 15 నిమిషాలు మాట్లాడటమే గొప్ప విషయం. ఆయన మాట్లాడేది వింటే ఎవరూ కూర్చోలేరు. రాహుల్.. మీముందు నేను కూర్చోలేను. మీరు చాలా గొప్పవాళ్లు (నామ్‌దార్), నేనో పనివాడిని (కామ్దార్) మాత్రమే’ అని మోదీ పేర్కొన్నారు. దేశం గర్వపడే ఇంజనీర్ విశ్వేశ్వరయ్య పేరును కూడా రాహుల్ సరిగా పలకలేరని ఎద్దేవా చేశారు. ఐదుసార్లు విశ్వేశ్వరయ్య పేరు పలకాలన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? అభివృద్ధితోపాటు హిందుత్వ కార్డునూ మోదీ ప్రయోగించారు. సిద్దరామయ్య ప్రభుత్వ హయాంలో దాదాపు 25 మంది బీజేపీ కార్యకర్తలు కన్నడ రాష్ట్రంలో హత్యలకు గురయ్యారని ఉడుపి సభలో పేర్కొన్నారు. జిహాదీ శక్తులే బీజేపీ కార్యకర్తలను చంపేశాయని.. వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని ఆయన విమర్శించారు. ‘వారు (బీజేపీ కార్యకర్తలు) చేసిన నేరమేంటి? మీ ఆలోచలను వ్యతిరేకించటమే పాపమా? కన్నడ ప్రజలకోసం వారి గొంతుక వినిపించారు. మేం వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తే.. మీరు హత్యలు చేసేందుకు అనుకూల వాతావరణాన్ని నిర్మించారు’ అని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ తీవ్రవాద ఆలోచనలున్న పార్టీని కర్ణాటకతోపాటు దేశం నుంచి పారద్రోలాలన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రజల నుంచి ‘అవును, పారదోలాల్సిందే’ అని భారీ స్పందన కనిపించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ సూచించారని గుర్తుచేసిన మోదీ.. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి గాంధీ చివరి కలను నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్కానా.. లట్కానా.. భట్కానా..! కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ తర్వాత కూడా పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగానే నిలిచారని.. తమ ప్రభుత్వం వచ్చాకే పేదలకు అకౌంట్లు ఇచ్చామని సంతెమారనహల్లి సభలో మోదీ పేర్కొన్నారు. ‘అప్పట్లో పేదలకు అకౌంట్లు ఉండేవి కాదు. అసలు వారికి బ్యాంకుల గురించి ఆలోచనే లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థనుంచి వారు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కొందరు వ్యక్తులు కలిసి బ్యాంకులను దోపిడీ చేశారు. కానీ యువత, రైతులు,పేదలకు మాత్రం రుణాలివ్వలేదు’ అని మోదీ విమర్శించారు. ఇసుక మాఫియాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఉడుపిలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు కావాలనే నిలిపివేసిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవటం (అట్కానా), ఎటూ తేల్చకుండా ఉంచటం (లట్కానా), వాస్తవాలను తప్పుదారి పట్టించటం (భట్కానా) కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు. విభజించి పాలిస్తున్నారు ‘చేప నీటి బయట ఎలా బతకలేదో.. కాంగ్రెస్ కూడా అధికారం లేకుండా ఉండలేదు. విభజన రాజకీయాలు చేసైనా అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటోంది’ అని బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగిన సభలో మోదీ విమర్శించారు. సిద్దరామయ్య ప్రభుత్వం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు పంపటంపై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ సోదరుల మధ్యన, ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టిస్తోంది. కులవాదాన్ని ప్రోత్సహించటం ద్వారా ఉన్నత, పేద వర్గాల మధ్య అగాధాన్ని పెంచుతోంది. అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ రిజర్వేషన్లను తీసివేస్తుందని దుష్ప్రచారం చేస్తోంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ‘2+1’ ఫార్ములాపై.. కుటుంబ రాజకీయాలపై మోదీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య రెండు సీట్లనుంచి పోటీచేయటంతోపాటు.. ఒక స్థానం నుంచి తన కుమారుడిని పోటీలోకి దించటాన్ని 2+1 ఫార్ములాగా పోల్చారు. సిద్దరామయ్యను ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల’ కన్నడ వర్షన్‌గా పేర్కొన్నారు. చాముండీశ్వరిలో ఓడిపోతానని తెలియటంతోనే సిద్దరామయ్య పట్టుబట్టి బాదామి నుంచీ నామినేషన్ వేశారన్నారు. ఈ విమర్శలను సిద్దరామయ్య తిప్పికొట్టారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు మోదీయే ‘2+1’ విధానంతో ముందుకెళ్తున్నారన్నారు. ‘ఓడిపోతామనే భయంతో.. ఇద్దరు రెడ్లు (గాలి సోదరులు ఇద్దరిని బరిలో దించటం), ఒక యెడ్డీ (సీఎం యడ్యూరప్ప)లను (2రెడ్డి+1యెడ్డీ) ఫార్ములా సాయం తీసుకుంటున్నారు’ అని విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ కూడా రెండుచోట్లనుంచి పోటీచేసిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారన్నారు. దేవెగౌడపై ప్రశంసలు మాజీ ప్రధాని, జేడీఎస్ సుప్రీం దేవేగౌడపై మోదీ ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. జేడీఎస్‌కు పట్టున్న మైసూరు ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘15–20 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఓ సభలో దేవేగౌడపై విమర్శలు చేశారని విన్నాను. అత్యంత సీనియర్ నేత, గౌరవనీయుడు అయిన దేవెగౌడ అంటే నాకు గౌరవం. ఆయన్ను విమర్శించటమేనా మీ సంస్కృతి? ఇది మీ అహంకారానికి నిదర్శనం. మీ జీవితం (కాంగ్రెస్ చీఫ్‌గా) ఇప్పుడే మొదలైంది. కానీ దేవెగౌడ.. దేశంలోని గొప్ప రాజకీయ నేతల్లో ఒకరు. మీరు ఆయన్ను అవమానించారు’ అని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడే ఇలా మాట్లాడితే మున్ముందు మరెన్ని విమర్శలు చేస్తారోనని.. ఇలాంటి అహంకార నేతతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమేనని ప్రధాని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మద్దతు రాదని.. జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొన్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
మాది ప్రజల ఫ్రంట్
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఘోరంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తమ ఫ్రంట్ చిల్లర రాజకీయాల కోసం కాదని స్పష్టంచేశారు. జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నామని, తమది తృతీయ ఫ్రంట్ కాదని, ప్రజలు, రైతుల ఫ్రంట్ అని పేర్కొన్నారు. దేశాన్ని, రైతులను, నిరుపేదలను, మహిళలను కాపాడటమే తమ అంతిమ లక్ష్యమన్నారు. 2019 ఎన్నికలకు ముందే రైతుల కోసం ఎజెండా తయారు చేస్తామని, జాతి ప్రయోజనాల కోసమే ఫ్రంట్ ఏర్పడుతుందని చెప్పారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్ ట్రాప్‌లో ఉన్న పార్టీలన్నీ బయటకు రావాలి. దేశాన్ని, భారతమాతను కాపాడాలి. రైతులు, నిరుపేదలు, మహిళలు, న్యాయం కోరుకుంటున్న వారిని రక్షించాలి’’అని పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫ్రంట్ ఉద్యమిస్తుందని, దేశాభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా తమతో కలిసిరావొచ్చని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. జేడీఎస్ నేతలు ఆహ్వానిస్తే తాను కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వివరించారు. కేసీఆర్ కృషిని దేవెగౌడ అభినందించారు. ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన సీఎం.. దేవెగౌడను ఆయన నివాసంలో కలుసుకున్నారు. దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు. సమావేశం అనంతరం దేవెగౌడ ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు బి.వినోద్ కుమార్, జె.సంతోష్ కుమార్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, టీఎస్ ఎండీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం కొట్టుకుంటే చోద్యం చూస్తున్నారా? తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో దేవెగౌడ స్వయంగా పాల్గొన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ‘‘స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. వారి లోపభూయిష్టమైన విధానాల వల్లే దేశం సమస్యలను ఎదుర్కొంటోంది. 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశంలో సమస్యలను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న కావేరి జల వివాదాన్ని కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదు. జల వివాదాలను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాల మధ్య కేంద్రం యుద్ధ వాతావరణం సృష్టిస్తోంది’’అని ఆరోపించారు. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని, ప్రతి ఎకరానికి సరిపడేంత సాగునీటిని అందించినా దాదాపు 30 వేల టీఎంసీల మిగులు ఉంటుందని చెప్పారు. కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి 2004లో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే.. 14 ఏళ్లు గడిచినప్పటికీ ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీళ్ల కోసం రాష్ట్రాలు కొట్టుకుంటుంటే ఢిల్లీలోని కేంద్ర పాలకులు చోద్యం చూస్తున్నారు. ఆరు నెలల్లో, కనీసం ఏడాదిలో తీర్పు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఆదేశించలేదా? ఇదంతా కాంగ్రెస్, బీజీపీ ప్రభుత్వాల అసమర్థత. వైఫల్యమే’’అని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయన్నారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ పథకాలు భేష్: దేవెగౌడ దేశానికి స్వాతంత్య్రం తర్వాత 70 ఏళ్లుగా సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తనతో, కుమారస్వామితో కేసీఆర్ చర్చలు జరిపారని వెల్లడించారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీల్లో మిత్రపక్షాలుగా ఉన్న స్థానిక పార్టీలన్నీ తృతీయ కూటమిలో చేరాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజాధనాన్ని దోచుకోవడం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం తప్ప ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి పట్టదని విమర్శించారు. తృతీయ కూటమికి తమ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన పథకాలు చాలా బాగున్నా యని దేవెగౌడ కితాబిచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గర్భిణుల ఆరోగ్యం కోసం వినూత్న పథకం తీసుకొచ్చారని కొనియాడారు. రైతుల కోసం తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా పథకం అమలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారివి విభజన రాజకీయాలు: ప్రకాశ్‌రాజ్ సినీనటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు మతం, కులం, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆరోపించారు. వచ్చే నెలలో జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా దేశానికి కేంద్రం చేసేందేమీ లేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశంలో మార్పు కోరుకునే ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ సమయంలోనే మద్దతు తెలంగాణ ఉద్యమ సమయంలో మద్దతు ఇవ్వడంతో పాటు వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో దేవెగౌడ పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు దేవెగౌడకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పెట్టుబడి సాయం పథకం ప్రకటించిన సందర్భంగా కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్ చేసి అభినందించారు. హైదరాబాద్‌కు వస్తానని చెప్పారు. అయితే తానే బెంగుళూరుకు వచ్చి కలిసి ఆశీర్వాదం తీసుకుంటానని నాడు కేసీఆర్ చెప్పారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సమాజం, పేదలు, అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రకాశ్‌రాజ్ రియల్ హీరో అని ప్రశంసించారు. -
అక్కడ బీజేపీ ఓటమే బీఎస్పీ లక్ష్యం..!
సాక్షి, న్యూఢిల్లీ: పంతం.. పంతం.. పంతం నీదా నాదా సై..! అవును రాజకీయ రణరంగంలో విశ్రమించడం ఉండదు. అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. పోట్లాడుకునే వేదికలు మారుతుంటాయ్ అంతే.. మొన్న, నిన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దెబ్బకు దెబ్బ అన్నట్టు సాగిన బీజేపీ, బీఎస్పీ మధ్య పోరు ఇక కర్ణాటకకు మారింది. అదేంటీ.. అక్కడ ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీలే కదా. మరి మధ్యలో బీఎస్పీ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా.. విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ కంచుకోటలు గోరఖ్‌పూర్, ఫూల్పూర్ స్థానాల్లో విజయం సాధించి ఎస్పీ- బీఎస్పీ కూటమి ఆ పార్టీకి గట్టి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్యంగా క్రాస్ ఓటింగ్ ద్వారా వచ్చిన ఓట్లతో బీజేపీ తన తొమ్మిదో అభ్యర్థిని గెలిపించుకొని బీఎస్పీపై ప్రతీకారం తీర్చుకుంది. ఈ పోటాపోటీ ఎత్తులు పైఎత్తులు 20 శాతం దళిత జనాభా ఉన్న కర్ణాటకకు మారాయి. దళిత ఓటర్ల మద్దతుతో కర్ణాటకలో బీఎస్పీ పోటీ చేయబోతున్న 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి బీజేపీకి అధికారాన్ని దూరం చేయాలని యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే దేవెగౌడ సారథ్యంలోని జేడీ(ఎస్)తో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీల్లో ఎవరి పాచికలు పారతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
రాములోరి సన్నిధిలో మాజీ ప్రధాని
పూజలు చేసిన దేవెగౌడ భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని భారత మాజీ ప్రధానమంత్రి హెచ్డీ.దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ ఆదివారం దర్శించుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి చేరుకున్న మాజీ ప్రధానమంత్రికి ఐటీడీఏ పీఓ, ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్, ఏఎస్పీ భాస్కరన్, తహసీల్దార్ రామకృష్ణ స్వాగతం పలికి, రామాలయానికి తీసుకొచ్చారు. దేవస్థానం ఈఓ రమేష్‌బాబు, అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిధ్యాల నడుమ వారికి పరివట్టం కట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ద్వజస్తంభానికి మాజీ ప్రధాని నమస్కారం చేశారు. తదుపరి గర్భగుడిలో రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీలక్ష్మీతాయారమ్మ వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. రామాలయం నిర్మించిన భక్త రామదాసు చరిత్ర వివరాలను, భద్రాచల పుణ్యక్షేత్రం, సుదర్శన చక్రం విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్చకులు, పండితులు దేవెగౌడకి ఆశీర్వచనం ఇచ్చి, శేష వస్త్రాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శాంతమ్మ, సర్పంచ్ బి.శ్వేత, సీఐ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు