ఆలయంలో దేవెగౌడ దంపతులు
-
పూజలు చేసిన దేవెగౌడ
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని భారత మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ.దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ ఆదివారం దర్శించుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి చేరుకున్న మాజీ ప్రధానమంత్రికి ఐటీడీఏ పీఓ, ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ రాజీవ్, ఏఎస్పీ భాస్కరన్, తహసీల్దార్ రామకృష్ణ స్వాగతం పలికి, రామాలయానికి తీసుకొచ్చారు. దేవస్థానం ఈఓ రమేష్‌బాబు, అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళవాయిధ్యాల నడుమ వారికి పరివట్టం కట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ద్వజస్తంభానికి మాజీ ప్రధాని నమస్కారం చేశారు. తదుపరి గర్భగుడిలో రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీలక్ష్మీతాయారమ్మ వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. రామాలయం నిర్మించిన భక్త రామదాసు చరిత్ర వివరాలను, భద్రాచల పుణ్యక్షేత్రం, సుదర్శన చక్రం విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్చకులు, పండితులు దేవెగౌడకి ఆశీర్వచనం ఇచ్చి, శేష వస్త్రాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శాంతమ్మ, సర్పంచ్ బి.శ్వేత, సీఐ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీసు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు