సంతెమారనహళ్లి/ఉడుపి/చిక్కోడి: కర్ణాటక ఎన్నికల వాతావరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం మరింత వేడెక్కిస్తోంది. ఎన్నికలు మరో పదిరోజులు మిగిలున్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు ప్రారంభించిన మోదీ.. మొదటిరోజే కాంగ్రెస్‌పై తీవ్ర ఎదురుదాడి చేశారు. చామరాజనగర, ఉడుపి, బెళగావి జిల్లాల్లో ఏర్పాటుచేసిన మూడు బహిరంగ సభల్లో.. సీఎం సిద్దరామయ్యతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
15 నిమిషాలపాటు సిద్దరామయ్య సర్కారు ప్రజలకు ఏం చేసిందో అనర్గళంగా మాట్లాడాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. అప్పుడే కన్నడ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. సిద్దరామయ్య హయాంలో కన్నడనాట హత్యారాజకీయాలు పెరిగాయని విమర్శించారు. ఓటమి భయంతోనే సీఎం చివరి నిమిషంలో రెండోచోట పోటీకి సిద్ధమయ్యారన్నారు.
నచ్చిన భాషలో మాట్లాడండి చూద్దాం..!
కన్నడ ప్రజలకు సిద్దరామయ్య సర్కారు చేసిన పనులను సొంతగా ఓ 15 నిమిషాలసేపు ఏ భాషలోనైనా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పాలని మోదీ సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందీ, ఇంగ్లీష్‌లోనైనా లేదంటే తన తల్లి మాతృభాషలోనైనా సరే (సోనియా ఇటలీ మూలాలను ప్రస్తావిస్తూ) 15 నిమిషాలసేపు కర్ణాటకలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను పేపర్‌మీద రాసుకుని కాకుండా సొంతంగా చెప్పాలని సవాల్ చేస్తున్నా.
దీని ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటల్లో ఎంత సత్తా ఉందో అర్థం చేసుకుంటారు’ అని చామరాజనగర జిల్లా సంతెమారనహల్లిలోని ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. తనను పార్లమెంటులో 15 నిమిషాలపాటు మాట్లాడనిస్తే ప్రధాని తన సీట్లో కూర్చోకుండా చేస్తానని రాహుల్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఆయన 15 నిమిషాలు మాట్లాడటమే గొప్ప విషయం. ఆయన మాట్లాడేది వింటే ఎవరూ కూర్చోలేరు. రాహుల్.. మీముందు నేను కూర్చోలేను. మీరు చాలా గొప్పవాళ్లు (నామ్‌దార్), నేనో పనివాడిని (కామ్‌దార్) మాత్రమే’ అని మోదీ పేర్కొన్నారు. దేశం గర్వపడే ఇంజనీర్ విశ్వేశ్వరయ్య పేరును కూడా రాహుల్ సరిగా పలకలేరని ఎద్దేవా చేశారు. ఐదుసార్లు విశ్వేశ్వరయ్య పేరు పలకాలన్నారు.
ప్రశ్నిస్తే చంపేస్తారా?
అభివృద్ధితోపాటు హిందుత్వ కార్డునూ మోదీ ప్రయోగించారు. సిద్దరామయ్య ప్రభుత్వ హయాంలో దాదాపు 25 మంది బీజేపీ కార్యకర్తలు కన్నడ రాష్ట్రంలో హత్యలకు గురయ్యారని ఉడుపి సభలో పేర్కొన్నారు. జిహాదీ శక్తులే బీజేపీ కార్యకర్తలను చంపేశాయని.. వారికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని ఆయన విమర్శించారు.
‘వారు (బీజేపీ కార్యకర్తలు) చేసిన నేరమేంటి? మీ ఆలోచలను వ్యతిరేకించటమే పాపమా? కన్నడ ప్రజలకోసం వారి గొంతుక వినిపించారు. మేం వ్యాపారానుకూల వాతావరణాన్ని నిర్మిస్తే.. మీరు హత్యలు చేసేందుకు అనుకూల వాతావరణాన్ని నిర్మించారు’ అని మోదీ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ తీవ్రవాద ఆలోచనలున్న పార్టీని కర్ణాటకతోపాటు దేశం నుంచి పారద్రోలాలన్నారు.
ఈ వ్యాఖ్యలకు ప్రజల నుంచి ‘అవును, పారదోలాల్సిందే’ అని భారీ స్పందన కనిపించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ సూచించారని గుర్తుచేసిన మోదీ.. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి గాంధీ చివరి కలను నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అట్కానా.. లట్కానా.. భట్కానా..!
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ తర్వాత కూడా పేదలు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగానే నిలిచారని.. తమ ప్రభుత్వం వచ్చాకే పేదలకు అకౌంట్లు ఇచ్చామని సంతెమారనహల్లి సభలో మోదీ పేర్కొన్నారు. ‘అప్పట్లో పేదలకు అకౌంట్లు ఉండేవి కాదు. అసలు వారికి బ్యాంకుల గురించి ఆలోచనే లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థనుంచి వారు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో కొందరు వ్యక్తులు కలిసి బ్యాంకులను దోపిడీ చేశారు.
కానీ యువత, రైతులు,పేదలకు మాత్రం రుణాలివ్వలేదు’ అని మోదీ విమర్శించారు. ఇసుక మాఫియాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఉడుపిలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు కావాలనే నిలిపివేసిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవటం (అట్కానా), ఎటూ తేల్చకుండా ఉంచటం (లట్కానా), వాస్తవాలను తప్పుదారి పట్టించటం (భట్కానా) కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు.
విభజించి పాలిస్తున్నారు
‘చేప నీటి బయట ఎలా బతకలేదో.. కాంగ్రెస్ కూడా అధికారం లేకుండా ఉండలేదు. విభజన రాజకీయాలు చేసైనా అధికారాన్ని నిలుపుకోవాలనుకుంటోంది’ అని బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగిన సభలో మోదీ విమర్శించారు. సిద్దరామయ్య ప్రభుత్వం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తూ ప్రతిపాదనలు పంపటంపై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ సోదరుల మధ్యన, ఉత్తర–దక్షిణ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టిస్తోంది.
కులవాదాన్ని ప్రోత్సహించటం ద్వారా ఉన్నత, పేద వర్గాల మధ్య అగాధాన్ని పెంచుతోంది. అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ రిజర్వేషన్లను తీసివేస్తుందని దుష్ప్రచారం చేస్తోంది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు.
‘2+1’ ఫార్ములాపై..
కుటుంబ రాజకీయాలపై మోదీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య రెండు సీట్లనుంచి పోటీచేయటంతోపాటు.. ఒక స్థానం నుంచి తన కుమారుడిని పోటీలోకి దించటాన్ని 2+1 ఫార్ములాగా పోల్చారు. సిద్దరామయ్యను ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాల’ కన్నడ వర్షన్‌గా పేర్కొన్నారు. చాముండీశ్వరిలో ఓడిపోతానని తెలియటంతోనే సిద్దరామయ్య పట్టుబట్టి బాదామి నుంచీ నామినేషన్ వేశారన్నారు.
ఈ విమర్శలను సిద్దరామయ్య తిప్పికొట్టారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు మోదీయే ‘2+1’ విధానంతో ముందుకెళ్తున్నారన్నారు. ‘ఓడిపోతామనే భయంతో.. ఇద్దరు రెడ్లు (గాలి సోదరులు ఇద్దరిని బరిలో దించటం), ఒక యెడ్డీ (సీఎం యడ్యూరప్ప)లను (2రెడ్డి+1యెడ్డీ) ఫార్ములా సాయం తీసుకుంటున్నారు’ అని విమర్శించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ కూడా రెండుచోట్లనుంచి పోటీచేసిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారన్నారు.
దేవెగౌడపై ప్రశంసలు
మాజీ ప్రధాని, జేడీఎస్ సుప్రీం దేవేగౌడపై మోదీ ప్రశంసల వర్షం కురిపించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. జేడీఎస్‌కు పట్టున్న మైసూరు ప్రాంతంలో జరిగిన ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘15–20 రోజుల క్రితం రాహుల్ గాంధీ ఓ సభలో దేవేగౌడపై విమర్శలు చేశారని విన్నాను.
అత్యంత సీనియర్ నేత, గౌరవనీయుడు అయిన దేవెగౌడ అంటే నాకు గౌరవం. ఆయన్ను విమర్శించటమేనా మీ సంస్కృతి? ఇది మీ అహంకారానికి నిదర్శనం. మీ జీవితం (కాంగ్రెస్ చీఫ్‌గా) ఇప్పుడే మొదలైంది. కానీ దేవెగౌడ.. దేశంలోని గొప్ప రాజకీయ నేతల్లో ఒకరు. మీరు ఆయన్ను అవమానించారు’ అని మోదీ పేర్కొన్నారు.
ఇప్పుడే ఇలా మాట్లాడితే మున్ముందు మరెన్ని విమర్శలు చేస్తారోనని.. ఇలాంటి అహంకార నేతతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమేనని ప్రధాని అన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మద్దతు రాదని.. జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు పేర్కొన్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment