
తుమకూరు: కాంగ్రెస్ నేతలు తనను 91 పర్యాయాలు దూషించారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. కర్ణాటక ఎన్నికలు ఆయన కోసం కాదన్న విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. రాహుల్ సోమవారం తురువెకెరె నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల ప్రచారం కోసం మీరు కర్ణాటకకు వచ్చారు. గత మూడేళ్లలో మీరు కర్ణాటకకు ఏం చేశారో చెప్పాలి.
అలాగే, వచ్చే అయిదేళ్లలో యువత, విద్య, ఆరోగ్యం, అవినీతిపై పోరు వంటి అంశాల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి. అయితే, మీరు కర్ణాటక గురించి మాట్లాడటం లేదు. ఇక్కడి నేతలు బొమ్మై, యడ్యూరప్ప గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు. నరేంద్ర మోదీ గురించి మాత్రం చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికలు ఏ ఒక్కరి కోసమో కాదు. మోదీ గురించి కాదని గ్రహించాలి’ అన్నారు. ‘‘కర్ణాటకలో పర్యటనలప్పుడు సిద్దరామయ్య, శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు ప్రజల కోసం ఏం చేశారో నేను చెబుతుంటా. మోదీ కూడా సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప పేర్లను ఒకట్రెండుసార్లు ప్రస్తావిస్తే వారు కూడా సంతోషపడతారు కదా!’’ అని రాహుల్ అన్నారు.
బీజేపీకి 40 సీట్లు చాలు
కర్ణాటకలో బీజేపీ సర్కారు 40 శాతం పర్సంటేజీలు తీసుకుంటోందని కాబట్టి ఈ ఎన్నికల్లో 40 సీట్లు ఇస్తే చాలని రాహుల్ అన్నారు. ప్రతి పనికీ కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు తీసుకుంటున్న బీజేపీని ఈసారి 40 సీట్లకే పరిమితం చేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో 150 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లయితే తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోలేదని అన్నారు. బీజేపీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మఠాధిపతుల నుంచీ వసూళ్లు చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment