
అధికారమిస్తే ఆర్టికల్ 3 సవరిస్తాం
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్
రాష్ట్రాల అనుమతితోనే విభజన చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: తాము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినట్టు మరే రాష్ర్టం విషయంలో జరగకుండా ఆర్టికల్ 3 సవరిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ వెల్లడించారు. ఏదైనా రాష్ట్ర విభజించాల్సివస్తే దానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ అంగీకరిస్తేనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణలు తెస్తామన్నారు. గురువారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతోపాటు లోక్‌పాల్‌ను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, ఎస్.రామచంద్ర పిళ్లై, ఏకే పద్మనాభన్‌తో కలసి మేనిఫెస్టోను విడుదల చేశారు. అదే విధంగా ఎన్నికలకు సంబంధించి ఇంగ్లీష్, హిందీల్లో రూపొందిన పార్టీ వెబ్‌సైట్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై కారత్ విమర్శలు గుప్పించారు. విధాన పరంగా కాంగ్రెస్, బీజేపీలకు తేడా లేదన్నారు. నరేంద్రమోడీ ప్రసంగాలు ఇతర దేశాలతో సంబంధాలను చెడగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. గుజరాత్ తరహా అభివృద్ధి అంటే అవి ఎంతో ప్రమాదకరమైన కార్పోరేట్ విధానాలన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశానికి ప్రత్యామ్నాయ విధానాలున్న లౌకిక ప్రజాతంత్ర ప్రభుత్వం అవసరం ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న 11 పార్టీల కూటమిని బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గతానికి భిన్నంగా వామపక్ష పార్టీలన్నీ పరస్పరం సహకరించుకుంటూ అత్యధిక స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు తెలిపారు. దాదాపు 90 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వారణాసిలో గతంలో మాదిరిగానే ఈ మారు సీపీఎం అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్టు వెల్లడించారు.