డీఎంకేకు భంగపాటు
Published Mon, Mar 10 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
కాంగ్రెస్‌తో కలిసి కాపురం చేసిన పాపం డీఎంకేను వెంటాడుతూనే ఉంది. యూపీఏ అవినీతి పాలన, 2 జీ స్పెక్ట్రం కుంభకోణం డీఎంకేకు శాపమైపోయింది. డీఎంకే పిలుపుతో పొత్తు ఆలోచన చేసిన వామపక్షాలు ఆ పార్టీలు చేసిన పాపాలు తమకు చుట్టుకుంటాయని వెనకడుగువేశాయి. డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆదివారం నాగపట్నంలో స్పష్టం చేయడంతో కరుణకు భంగపాటు తప్పలేదు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఎదుర్కొనేందుకు బలమైన కూట మిగా తాము ఏర్పడబోతున్నామని డీఎంకే ధీమా వ్యక్తం చేసింది. అయితే ఆచరణకు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో కూటమి ఏర్పడలేదు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల తరువాత బలమైన పార్టీగా పేరొందిన డీఎండీకే కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే అయాచిత వరంగా అన్నాడీఎంకే నుండి వామపక్షాలు వైదొలగడంతో కరుణ ఎగిరిగంతేశారు. వెంటనే పొత్తుకు ఆహ్వానం పలికి పార్టీ సీనియర్ నేత టీఆర్ బాలును ఢిల్లీకి పంపారు. డీఎంకేతో పొత్తుపై శని, ఆదివారాల్లో సుదీర్ఘం గా చర్చించుకున్న వామపక్షాల అగ్రనేతల వద్దనే తీర్మానించుకున్నారు.
ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నాగపట్నం వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కారదర్శి ప్రకాష్ కారత్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో పొత్తులేదని ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వాల్లో భాగస్వామిగా మెలిగి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకేతో పొత్తుపెట్టుకుంటే ఎన్నికల ప్రచారాల్లో తాము ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని, అందుకే తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వివరణ ఇచ్చారు. ప్రకాష్‌కారత్ ప్రకటనపై కరుణ స్పందిస్తూ, ఆయన ఢిల్లీకి వెళ్లిన తరువాత పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే వామపక్షాల నిర్ణయాన్ని ప్రకటించేందుకు మూడురోజులు గడువుఇచ్చానని తెలిపారు.
Advertisement
Advertisement