దిద్దు‘బాట’లో మార్క్సిస్టులు! | CPM party to amendment of party policy | Sakshi
Sakshi News home page

దిద్దు‘బాట’లో మార్క్సిస్టులు!

Published Tue, Jan 20 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

CPM party to amendment of party policy

భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకే సమీక్ష: ప్రకాశ్ కారత్
 సాక్షి, హైదరాబాద్: సీపీఎం దిద్దుబాటు దిశగా సాగుతోంది. గతంలో జరిగిన తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కేంద్ర కమిటీ మూడురోజుల సమావేశ ఎజెండా ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘విశాఖపట్నంలో వచ్చే ఏప్రిల్‌లో జరిగే పార్టీ జాతీయ మహాసభలకు రాజకీయ ముసాయిదాను ఖరారు చేస్తున్నాం.
 
 బహుశా మంగళవారానికి ఇది ఖరారు కావచ్చు. ఈ సమావేశాల్లో ప్రధానంగా 2 తీర్మానాలను చర్చకు చేపట్టాం. ఒకటి రాజకీయ తీర్మానం. వచ్చే మూడేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించినది. రెండోది గత 20 ఏళ్లలో అనుసరించిన రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినది. వీటిపై చర్చించి పార్టీ కమిటీ ఆమోదించిన అనంతరం ప్రజల్లో చర్చకు పెడతాం. మాది ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ. గతాన్ని సమీక్షిస్తున్నామంటే తప్పులు జరిగినట్టు అర్థం కాదు. పరిస్థితిని అవగతం చేసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవడానికేనని భావించాలి. ముందుకు నడవాలన్నా గతాన్ని చూసుకోవాలి కదా..’ అని అన్నారు.
 
 ఎన్నికలు, రాజకీయ విధానం వేర్వేరు..
 ‘ఎన్నికల్లో ఓటమి వేరు. రాజకీయ విధానం వేరు. రెండింటినీ కలగలిపి చూడకూడదు. సరైన దిశలో పయనించామా లేదా? అనే శోధన చేసుకుంటున్నాం. దాని ఆధారంగా ముందుకు వెళతాం. బలాల్నీ, బలహీనతల్నీ గుర్తిస్తాం. అన్ని విషయాలు పార్టీ ముందు, ప్రజల ముందు ఉంచుతాం. ప్రజా ఉద్యమాల ఆధారంగా ముందుకు సాగుతాం..’ అని చెప్పారు. వామపక్షాల ఐక్యతకు పెద్దపీట వేశామని, ఆ దిశగానే పయనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కేంద్రంలో సీపీఐ, సీపీఎంలతో పాటు మరో 4 వామపక్ష పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్రాలలోనూ ఆ ప్రక్రియ ముందుకు సాగుతోందన్నారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ కూడా నడుస్తున్న చరిత్రేనని, మహాసభల్లో దీనిపై దిశానిర్దేశం చేస్తామని కారత్ పేర్కొన్నారు.
 
 దేశంలో ప్రస్తుతం ఆర్డినెన్స్‌ల రాజ్యం నడుస్తోందని, మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతూ కార్మికవర్గానికి అన్యాయం తలపెడుతోందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకే అన్ని వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశ ప్రధాన సమస్యల్లో మతోన్మాద రాజకీయం ఒకటని, దీన్నుంచి ప్రజల్ని, దేశాన్ని కాపాడడం ప్రధానమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement