the National Conference
-
దిద్దు‘బాట’లో మార్క్సిస్టులు!
భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకే సమీక్ష: ప్రకాశ్ కారత్ సాక్షి, హైదరాబాద్: సీపీఎం దిద్దుబాటు దిశగా సాగుతోంది. గతంలో జరిగిన తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ భవిష్యత్‌కు బాటలు వేసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కేంద్ర కమిటీ మూడురోజుల సమావేశ ఎజెండా ఇదేనని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సోమవారం సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘విశాఖపట్నంలో వచ్చే ఏప్రిల్‌లో జరిగే పార్టీ జాతీయ మహాసభలకు రాజకీయ ముసాయిదాను ఖరారు చేస్తున్నాం. బహుశా మంగళవారానికి ఇది ఖరారు కావచ్చు. ఈ సమావేశాల్లో ప్రధానంగా 2 తీర్మానాలను చర్చకు చేపట్టాం. ఒకటి రాజకీయ తీర్మానం. వచ్చే మూడేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించినది. రెండోది గత 20 ఏళ్లలో అనుసరించిన రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినది. వీటిపై చర్చించి పార్టీ కమిటీ ఆమోదించిన అనంతరం ప్రజల్లో చర్చకు పెడతాం. మాది ప్రజాస్వామ్యయుతంగా నడిచే పార్టీ. గతాన్ని సమీక్షిస్తున్నామంటే తప్పులు జరిగినట్టు అర్థం కాదు. పరిస్థితిని అవగతం చేసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవడానికేనని భావించాలి. ముందుకు నడవాలన్నా గతాన్ని చూసుకోవాలి కదా..’ అని అన్నారు. ఎన్నికలు, రాజకీయ విధానం వేర్వేరు.. ‘ఎన్నికల్లో ఓటమి వేరు. రాజకీయ విధానం వేరు. రెండింటినీ కలగలిపి చూడకూడదు. సరైన దిశలో పయనించామా లేదా? అనే శోధన చేసుకుంటున్నాం. దాని ఆధారంగా ముందుకు వెళతాం. బలాల్నీ, బలహీనతల్నీ గుర్తిస్తాం. అన్ని విషయాలు పార్టీ ముందు, ప్రజల ముందు ఉంచుతాం. ప్రజా ఉద్యమాల ఆధారంగా ముందుకు సాగుతాం..’ అని చెప్పారు. వామపక్షాల ఐక్యతకు పెద్దపీట వేశామని, ఆ దిశగానే పయనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కేంద్రంలో సీపీఐ, సీపీఎంలతో పాటు మరో 4 వామపక్ష పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్రాలలోనూ ఆ ప్రక్రియ ముందుకు సాగుతోందన్నారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ కూడా నడుస్తున్న చరిత్రేనని, మహాసభల్లో దీనిపై దిశానిర్దేశం చేస్తామని కారత్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఆర్డినెన్స్‌ల రాజ్యం నడుస్తోందని, మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతూ కార్మికవర్గానికి అన్యాయం తలపెడుతోందని చెప్పారు. దీన్ని ఎదుర్కొనేందుకే అన్ని వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దేశ ప్రధాన సమస్యల్లో మతోన్మాద రాజకీయం ఒకటని, దీన్నుంచి ప్రజల్ని, దేశాన్ని కాపాడడం ప్రధానమని పేర్కొన్నారు. -
‘ఆర్టికల్ 370’పై హామీ కావాలి
బీజేపీతో దోస్తీకి పీడీపీ పరోక్ష సంకేతాలు కశ్మీర్లో సర్కారు ఏర్పాటుకు గల అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నామన్న పీడీపీ ఆర్టికల్ 370, ఏఎఫ్ఎస్పీఏ అంశాలపై పార్టీ వైఖరి మారదని స్పష్టీకరణ ఎన్సీ నుంచి ‘బేషరతు మద్దతు’ ప్రతిపాదనేదీ రాలేదన్న పీడీపీ అధికార ప్రతినిధి శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్ధమంటూ శనివారం సంకేతాలిచ్చింది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణకు భద్రత కల్పించడం, సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) తొలగించడం అనే కీలక అంశాలపై.. తమతో జట్టుకట్టబోయే పార్టీల నుంచి హామీ కావాలని కోరింది. ‘‘అన్ని అవకాశాలూ తెరిచే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీతోనైనా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై మేం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ శ్రీనగర్‌లో పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నాం... రాష్ట్రంలోని 87 అసెంబ్లీ సీట్లకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లభించని విషయం తెలిసిందే. పీడీపీ 28 స్థానాలు గెలుచుకుని మిగతా పార్టీలకన్నా ముందుండగా.. 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ రెండో స్థానంలో నిలిచిన విషయమూ విదితమే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సంప్రదింపుల కోసం రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా ఈ రెండు పార్టీలతోనూ జనవరి 1వ తేదీన భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. తమ పార్టీ నాయకత్వం ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలన్నిటినీ పరిశీలిస్తోందని నయీమ్ చెప్పారు. ఆర్టికల్ 370పై తమ పార్టీ వైఖరి ఏ మాత్రం మారబోదన్నారు. అలాగే సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించటానికీ తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కశ్మీర్ అంశానికి పరిష్కారం కోసం రాజకీయ ప్రక్రియను ప్రారంభించటానికి కూడా తాము నిబద్ధులమై ఉన్నామన్నారు. ఎన్సీ నుంచి ఏ సమాచారం రాలేదు... ‘భవిష్యత్తులో జట్టుకట్టబోయే భాగస్వామ్య పక్షం ముఖ్యమంత్రి పదవిని చెరి కొంత కాలం పంచుకోవాలని డిమాండ్ చేస్తే పీడీపీ అంగీకరిస్తుందా?’ అని ప్రశ్నించగా.. ఏ పార్టీతోనూ చర్చలు ఇంకా ఈ అంశం వరకూ రాలేదని ఆయన బదులిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ పార్టీకి కాంగ్రెస్ ప్రతిపాదన పంపిందని.. దీనిని తమ నాయకత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ బద్ధశత్రువైన నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో పీడీపీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తామన్న ప్రతిపాదన గురించి ప్రస్తావించగా.. ఇలాంటి సమాచారమేదీ తమకు ఆ పార్టీ నుంచి అందలేదని నయీమ్ సమాధానమిచ్చారు. బీజేపీతో దోస్తీకి పీడీపీ నేతల వ్యతిరేకత... ఇదిలావుంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 మంది సభ్యులు అవసరమైన పరిస్థితుల్లో పీడీపీ సంశయాత్మక పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీతో చెలిమి చేయడమంటే.. రాష్ట్రంలో ఇటీవల మళ్లీ పుంజుకుంటున్న తమ పార్టీకి ఆత్మహత్యా సదృశమేనని పీడీపీలో బలమైన నేతలు కొందరు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కేవలం 15 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయిన నేషనల్ కాన్ఫరెన్స్.. ప్రభుత్వ ఏర్పాటు పోటీ నుంచి వైదొలగింది. పార్టీ నాయకత్వం బీజేపీతో చర్చలు జరుపుతోందన్న వార్తలు వెలువడిన తర్వాత ఎన్సీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేయటం దీనికి కారణం. పార్టీలతో చర్చలు జరుపుతున్నాం: బీజేపీ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అక్కడి పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ శనివారం ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. అయితే.. ఎవరితో చర్చలు జరుపుతున్నామన్నది ఆయన వెల్లడించలేదు. -
సభలు సక్సెస్.. శ్రేణుల్లో ఉత్తేజం
ముగిసిన వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభలు వ్యవసాయ కార్మికుల ఉద్యమబాట వరంగల్ : పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై పోరుబాట పట్టేందుకు వ్యవసాయ కార్మికులు సన్నద్ధమవుతున్నారు. అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీ య మహాసభలు అందించిన ఉత్తేజంతో ఉద్యమాలు చేపట్టేం దుకు నిర్ణయించారు. వరంగల్ కేంద్రంగా నాలుగు రోజుల పాటు అత్యంత కోలాహలంగా జరిగిన జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. ఉపాధి హామీని నీరుగార్చే కుట్రలను వ్యతిరేకించడంతోపాటు వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం నూతన నాయకత్వం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులకుతోడుగా కలిసొచ్చే శక్తులతో కలిసి ఐక్యపోరాటాలతో ముందుకు సాగాలని ఈసందర్భంగా తీర్మానించారు. ఉత్తేజాన్నిచ్చిన సభ జూలై 30న చాకలి ఐలమ్మనగర్లో(ఓసిటీ గ్రౌండ్)లో భారీ బహిరంగ సభతో ప్రారంభమైన మహాసభలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా జనాన్ని సమీకరించా రు. జిల్లా నలుమూలల నుంచి వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజ రైన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌తోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటూరి రామయ్య, విజయరాఘవన్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నాగయ్య, వెంకట్ తదితరులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. కళాకారుల ఆటాపాటతో సభ హోరెత్తింది. స్ఫూర్తినిచ్చిన చర్చలు హన్మకొండలోని సుందరయ్యనగర్‌లో(నందనాగార్డెన్) జూలై 31న ప్రతినిధుల సభ అత్యంత ఉత్తేజకర వాతావరణంలో ప్రారంభమైంది. తొలిరోజు ప్రతినిధుల సభ ప్రారంభోపన్యాసంలో ఆర్థిక వేత్త ప్రొఫెసర్ ప్రభాత్‌పట్నాయక్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, వ్యవసాయ రంగంపై దుష్ఫలితాలను వివరంగా తెలియజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్ దేశవ్యాప్తంగా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాల నివేదిక సభకు సమర్పించారు. దీనిపై ప్రతినిధులు చర్చించారు. రెండవ రోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సంఘాన్ని పటిష్టం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చలు సాగా యి. ఇదే రోజు ‘వ్యవసాయ రంగం-ప్రపంచీకరణ’ అం శంపై హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో నిర్వహించిన సెమినార్లో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, ప్రొఫెసర్ షీలాభల్లా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వివిధ అంశాలపై వివరించారు. చివరి రోజు మహాసభలో భవిష్యత్ కర్తవ్యాలపై చర్చ అనంత రం సంఘం జాతీయ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. తమిళనాడుకు చెందిన తిరునావరక్కసును అధ్యక్షుడిగా, విజయరాఘవన్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. జాతీయ మహాసభల నిర్వహణ బాధ్యతలను భుజానెత్తుకున్న సీపీఎం, ప్రజాసంఘాల జిల్లా నేతలు సమన్వయంతో నెలరోజులు అలుపెరుగకుండా శ్రమించి విజయవంతం చేసి నాయకత్వం నుంచి అభినందనలు అందుకున్నారు.