‘ఆర్టికల్ 370’పై హామీ కావాలి
- బీజేపీతో దోస్తీకి పీడీపీ పరోక్ష సంకేతాలు
- కశ్మీర్‌లో సర్కారు ఏర్పాటుకు గల అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నామన్న పీడీపీ
- ఆర్టికల్ 370, ఏఎఫ్‌ఎస్‌పీఏ అంశాలపై పార్టీ వైఖరి మారదని స్పష్టీకరణ
- ఎన్‌సీ నుంచి ‘బేషరతు మద్దతు’ ప్రతిపాదనేదీ రాలేదన్న పీడీపీ అధికార ప్రతినిధి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్ధమంటూ శనివారం సంకేతాలిచ్చింది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణకు భద్రత కల్పించడం, సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) తొలగించడం అనే కీలక అంశాలపై.. తమతో జట్టుకట్టబోయే పార్టీల నుంచి హామీ కావాలని కోరింది. ‘‘అన్ని అవకాశాలూ తెరిచే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీతోనైనా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై మేం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ శ్రీనగర్‌లో పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నాం...
రాష్ట్రంలోని 87 అసెంబ్లీ సీట్లకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లభించని విషయం తెలిసిందే. పీడీపీ 28 స్థానాలు గెలుచుకుని మిగతా పార్టీలకన్నా ముందుండగా.. 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ రెండో స్థానంలో నిలిచిన విషయమూ విదితమే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సంప్రదింపుల కోసం రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా ఈ రెండు పార్టీలతోనూ జనవరి 1వ తేదీన భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. తమ పార్టీ నాయకత్వం ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలన్నిటినీ పరిశీలిస్తోందని నయీమ్ చెప్పారు. ఆర్టికల్ 370పై తమ పార్టీ వైఖరి ఏ మాత్రం మారబోదన్నారు. అలాగే సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించటానికీ తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కశ్మీర్ అంశానికి పరిష్కారం కోసం రాజకీయ ప్రక్రియను ప్రారంభించటానికి కూడా తాము నిబద్ధులమై ఉన్నామన్నారు.
ఎన్‌సీ నుంచి ఏ సమాచారం రాలేదు...
‘భవిష్యత్తులో జట్టుకట్టబోయే భాగస్వామ్య పక్షం ముఖ్యమంత్రి పదవిని చెరి కొంత కాలం పంచుకోవాలని డిమాండ్ చేస్తే పీడీపీ అంగీకరిస్తుందా?’ అని ప్రశ్నించగా.. ఏ పార్టీతోనూ చర్చలు ఇంకా ఈ అంశం వరకూ రాలేదని ఆయన బదులిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ పార్టీకి కాంగ్రెస్ ప్రతిపాదన పంపిందని.. దీనిని తమ నాయకత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ బద్ధశత్రువైన నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో పీడీపీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తామన్న ప్రతిపాదన గురించి ప్రస్తావించగా.. ఇలాంటి సమాచారమేదీ తమకు ఆ పార్టీ నుంచి అందలేదని నయీమ్ సమాధానమిచ్చారు.
బీజేపీతో దోస్తీకి పీడీపీ నేతల వ్యతిరేకత...
ఇదిలావుంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 మంది సభ్యులు అవసరమైన పరిస్థితుల్లో పీడీపీ సంశయాత్మక పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీతో చెలిమి చేయడమంటే.. రాష్ట్రంలో ఇటీవల మళ్లీ పుంజుకుంటున్న తమ పార్టీకి ఆత్మహత్యా సదృశమేనని పీడీపీలో బలమైన నేతలు కొందరు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కేవలం 15 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయిన నేషనల్ కాన్ఫరెన్స్.. ప్రభుత్వ ఏర్పాటు పోటీ నుంచి వైదొలగింది. పార్టీ నాయకత్వం బీజేపీతో చర్చలు జరుపుతోందన్న వార్తలు వెలువడిన తర్వాత ఎన్‌సీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేయటం దీనికి కారణం.
పార్టీలతో చర్చలు జరుపుతున్నాం: బీజేపీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అక్కడి పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ శనివారం ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. అయితే.. ఎవరితో చర్చలు జరుపుతున్నామన్నది ఆయన వెల్లడించలేదు.