jammukasmir
-
కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ: భారత సైన్యం రెండు రోజుల క్రితం భారీ కాల్పులతో పీవోకేలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను, సైనిక పోస్టులను ధ్వంసం చేసినా పాకిస్తాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల గుండా ఉగ్రమూకలను పంపడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మారలేదు. తాజాగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ. జమ్మూకశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ముష్కరులు హతం కాగా, ఒక సైన్యాధికారి నేలకొరిగాడు. ఎల్వోసీ వెంట పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. దక్షిణ కశీ్మర్లోని త్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆగస్టులో గుజ్జర్ వర్గానికి చెందిన ఇద్దరు సోదరులను చంపడంలో వీరి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లో గస్తీ తిరుగుతున్న బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నేలకొరిగారు. అదే సమయంలో ఎల్వోసీ ఆవలి వైపు నుంచి పాక్ సైన్యం కూడా కాల్పులు జరపగా దీటుగా బదులిచ్చామని సైన్యం పేర్కొంది. అంతకుముందు పూంచ్ జిల్లాలో ఎల్వోసీ వెంట పాక్ బలగాలు మోరా్టర్లతో జరిపిన కాల్పుల్లో మహిళ సహా ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ కాల్పులు మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగాయి. ప్రతిగా భారత సైన్యం కూడా కాల్పులు జరిపింది. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భూగర్భ బంకర్లలో తలదాచుకున్నారు. పాఠశాలల్లోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని సైన్యం ప్రకటించింది. -
కుల్గామ్‌లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం భీకర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతం కాగా, ఓ పోలీస్ డీఎస్పీ, మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్ జిల్లాలోని తురిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ అమన్ ఠాకూర్ నేతృత్వంలోని పోలీస్, ఆర్మీ సంయుక్త బృందం ఘటనాస్థలికి బయలుదేరింది. అయితే తురిగామ్‌ను ఈ బృందం సమీపించగానే ఉగ్రవాదులు వీరిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో డీఎస్పీ అమన్ ఠాకూర్ మెడ భాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..అమన్ ఠాకూర్‌తో పాటు హవల్దార్ సోంబీర్‌కు తీవ్రగాయాలు కాగా హుటాహుటిన వాయుమార్గం ద్వారా ఆర్మీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారన్నారు. తురిగామ్‌లో నక్కిన ముగ్గురు జైషే ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆర్మీ మేజర్, ముగ్గురు సైనికులు గాయపడ్డారనీ, వీరి ఆరో గ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అమన్ మృతిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్, డీజీపీ దిల్బాగ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలను కాదని.. జువాలజీలో మాస్టర్స్ చేసిన అమన్ ఠాకూర్‌కు పోలీస్ శాఖలో పనిచేయాలన్నది చిరకాల స్వప్నం. అందుకే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ పోలీస్‌శాఖలో చేరారు. దొడా జిల్లాకు చెందిన అమన్‌కు తొలుత జమ్మూకశ్మీర్ సాంఘిక సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అనంతరం స్థానిక ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్‌గానూ ఉద్యోగం దక్కింది. అయితే పోలీస్ ఉద్యోగంపై ఉన్న మక్కువతో అమన్ తన ప్రయత్నాలు కొనసాగించారు. చివరికి జమ్మూకశ్మీర్ పోలీస్ సర్వీస్‌కు 2011లో ఎంపికయ్యారు. ఏడాదిన్నర క్రితం కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల విభాగానికి చీఫ్‌గా అమన్ నియమితులయ్యారు. అప్పట్నుంచి అమన్ బృందం చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాగా, విధినిర్వహణలో చూపిన ధైర్య సాహసాలకు గానూ అమన్ డీజీపీ ప్రశంసా మెడల్–సర్టిఫికెట్, షేర్–ఏ–కశ్మీర్ మెడల్‌ను అందుకున్నారు. అమన్‌కు తల్లిదండ్రులతో పాటు భార్య సరళా దేవి, కుమారుడు ఆర్య(6) ఉన్నారు. -
‘పుల్వామా’ జవాన్లకు రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఈ నెల 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు అమరులు కావడంపై రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సంతాపం ప్రకటించాయి. జవాన్ల మృతికి నివాళిగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం కె. చంద్రశేఖర్‌రావు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్వామా ఉగ్ర దాడి అత్యంత అమానుషమన్నారు. దీన్ని సైనికులు, వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ దేశం, సమస్త భారత జాతిపై జరిగిన దాడిగా దేశ ప్రజలంతా తీవ్ర ఆవేదన చెందారన్నారు. ఇది యావన్మంది హృదయాలను కదిలించిన విషాద ఘటన అని, దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని దుర్ఘటన అని పేర్కొన్నారు. జవాన్ల కుటుం బాలు ఒంటరి కాలేద న్న సంకేతమిచ్చేలా వారి వెంట తామున్నామ ని చాటిచెప్పాలన్నారు. ఉగ్రవాద కార్చిచ్చును ఆపివేయాలని, ఇందుకోసం పటిష్ట వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం రచించాలని దేశమంతా కోరుకుంటోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అమర జవాన్ల కుటుంబాలు, వారి పిల్లలను సంరక్షించే బాధ్యతలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. దాడిలో చనిపోయిన జవాన్లకు వినమ్ర నివాళి అర్పిస్తున్నామంటూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ తీర్మానంపై అన్ని పక్షాల నేతలు మాట్లాడిన తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వారి మృతికి నివాళిగా సభ రెండు నిమిషాలు మౌ నం పాటించింది. మండలిలో వైద్య, ఆరోగ్యశా ఖ మంత్రి ఈటల ఉగ్ర దాడిపై ప్రభుత్వం తరఫున తీర్మానం ప్రవేశపెట్టారు. వీరసైనికుల ప్రాణత్యాగం వెలకట్టలేనిదని, అమర జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల చొప్పున సాయం అందిస్తామన్నారు. పుల్వామా ఘటనపై ఎవరేమన్నారంటే... ప్రగాఢ సానుభూతి శోకార్తులైన అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఉగ్ర దాడిలో అసువులుబాసిన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరేందుకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ అందరం ఏకం కావాలి... దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు జాతి యావత్తూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. – మహ్మద్ అలీ షబ్బీర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జాతి యావత్తూ అండదండలు అమర జవాన్ల కుటుంబాల కోసం జాతి యావత్తూ నిలబడుతుంది. సీఎల్పీ నేతగా పుల్వామా లాంటి విషాద ఘటనపై తొలిసారి మాట్లాడాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా. భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జైషే షయాతీన్... పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడింది జైషే మహ్మద్ (ప్రవక్త సైన్యం) కాదు... జైషే ష యాతీన్ (దెయ్యాల సైన్యం). మన భూభాగంపై పాక్ అస్థిరత కోరుకుంటోంది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. అందరం కలసికట్టుగా దేశం కోసం నిలబడాలి. అహ్మద్ బలాల, ఎంఐఎం ఎమ్మెల్యే దేశ సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలర్పించే జవాన్ల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే. ఆ పోరాట యోధులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాయిని నర్సింహారెడ్డి, మాజీ హోంమంత్రి మానవత్వానికి ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలి. పాక్‌కు బుద్ధి చెప్పే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. – రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ దేశ సమగ్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు జాతి యావత్తు సంఘీభావంగా నిలుస్తుంది. కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీరీల రక్షణ కూడా మన బాధ్యత. జాతుల మధ్య విధ్వంసం సృష్టించడం ఉగ్రవాదుల అసలు లక్ష్యం. అమాయక కశ్మీరీలపై దాడి చేస్తే అది నెరవేరినట్లే. జాఫ్రీ, మజ్లిస్ ఎమ్మెల్సీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. పాక్‌తో తాడోపేడో తేల్చుకోవాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాయాలి. వాళ్ల భాషలోనే దీటైన రీతిలో జవాబు చెప్పాలని కోరాలి. రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే -
‘పుల్వామా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం వనస్థలిపురంలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో వివిధ సంఘాల సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ పూల్వామా ఘటనకు కారకులైన వారికి మరిచిపోలేని గుణపాఠం చెప్పాలని, రానున్న కాలంలో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భారత్ సత్తాను ప్రపంచానికి తెలియజేసేలా పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎం. మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సరాజు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు హన్మంతరావు, కార్యదర్శి బసవయ్య, సచివాలయనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇ.చంద్రశేఖర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
జమ్ముకశ్మీర్‌లో టెన్షన్ టెన్షన్
-
సరిహద్దులో శాంతి!
మోర్టార్ షెల్స్ ప్రయోగంపై నిషేధానికి భారత్, పాక్ అంగీకారం న్యూఢిల్లీ: సరిహద్దులో తిరిగి శాంతి స్థాపన దిశగా భారత్, పాకిస్తాన్‌లు కీలక చర్యలు చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి మోర్టార్ దాడులపై పూర్తి నిషేధం విధించాలని నిర్ణయించాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు, సీమాంతర చొరబాట్లు తదితర సున్నిత అంశాలను ఉమ్మడిగా పరిష్కరించుకునేందుకు వాటిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. శనివారం ఢిల్లీలో ముగిసిన మూడు రోజుల చర్చల్లో బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ దేవేంద్ర కుమార్ పాఠక్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్(పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్ ఫరూఖ్ బుర్కీ ఈ మేరకు 20 సూత్రాల ఉమ్మడి చర్చల రికార్డుపై సంతకాలు చేశారు. కాగా, చిట్టచివర పరిస్థితుల్లో మాత్రమే భారీ ఆయుధాలను వినియోగించాలని కూడా ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. సరిహద్దులో కొన్ని నెలలుగా మోర్టార్ షెల్స్ ప్రయోగం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరగడం తెలిసిందే. కాగా, మోదీ భారత ప్రధాని అయ్యాక సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరిగిపోయాయని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. -
లష్కరే టాప్ మిలిటెంట్ హతం
శ్రీనగర్: జమ్మూక శ్మీర్లో మిలిటెంట్లపై పోరులో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ ఇర్షద్ గానీని శనివారం ఎన్కౌంటర్లో హతమార్చాయి. పుల్వామా జిల్లా కాకపోరా ప్రాంతంలోని బేగమ్ బాగ్ గ్రామం వద్ద మిలిటెంట్లు ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ రంగంలోకి దిగి, పోలీసులతో కలసి గానీని మట్టుబెట్టింది. మిగతా మిలిటెంట్ల కోసం గాలిస్తున్నారు. కాకపోరాకే చెందిన ఇర్షద్ తలపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. 2013లో హైదర్‌పోరాలో 8 మంది జవాన్లను చంపిన కేసుతోపాటు ఆర్మీ, పోలీసులపై జరిగిన పలు దాడుల కేసుల్లో అతడు నిందితుడు. -
ఆలం అరెస్ట్.. అట్టుడికిన కశ్మీర్
గృహనిర్బంధంలో హురియత్ చైర్మన్ గిలానీ శ్రీనగర్‌లో అల్లర్లు.. పలువురికి గాయాలు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం వేర్పాటువాదులు నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శ్రీనగర్ నుంచి త్రాల్ వరకు జరపాల్సిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవటంతో ఘర్షణ చెలరేగింది. ఇటీవల పుల్వామా జిల్లాలో సైన్యం చేతిలో ఇద్దరు యువకులు చనిపోయినందుకు నిరసనగా ఈ ర్యాలీని వేర్పాటువాదులు తలపెట్టారు. ఈ ర్యాలీలో హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ పాల్గొనకుండా ఆయన్ను గురువారం రాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం శ్రీనగర్‌లో జరిపిన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేసిన వేర్పాటువాదనేత మసరత్ ఆలం భట్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బుడ్గాం కోర్టు ఆయనను 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో హింస చెలరేగింది. దేశ వ్యతిరేక చర్యలను సహించబోమని, పాక్ జెండాలు ప్రదర్శించిన, నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పుల్వామా ఎన్కౌంటర్ నకిలీదని స్థానికులు అంటుండగా, మృతులు ఉగ్రవాదులని సైన్యం చెబుతోంది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హురియత్ శుక్రవారం నిర్వహించిన ర్యాలీ ఘర్షణకు దారితీసింది. శ్రీనగర్‌లో హురియత్ మద్దతుదారులు రాళ్లు విసరడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో డజను మంది గాయపడ్డారు. కాగా రాష్ర్టంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఉపేక్షించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆలం మళ్లీ జైలుకే వెళతాడని, దేశ సమగ్రత విషయంలో రాజీ పడబోమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక ఆలం అరెస్ట్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి ఒత్తిడి చేయలేదని బీజేపీ పేర్కొంది. రాజ్‌నాథ్ సూచనల మేరకే రాష్ర్ట ప్రభుత్వం స్పందించిందని తెలిపింది. మరోవైపు తన అరెస్ట్ కొత్తేమీ కాదని, రాష్ర్టంలో పాక్ జెండాలను ప్రదర్శించడం, అనుకూల నినాదాలు చేయడం కూడా కొత్త కాదని మసరత్ ఆలం అన్నారు. జాతీయ జెండా దహనం ఇద్దరు యువకుల ఎన్‌కౌంటర్‌పై హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ వర్గం శుక్రవారం నౌహట్టాలో నిర్వహించిన నిరసన ప్రదర్శన అల్లర్లకు దారితీసింది. ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు జాతీయ జెండాను తగులబెట్టారు. హురియత్ నేతల అరెస్ట్‌పై ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు చెలరేగాయి. పలుచోట్ల భద్రతాదళాలపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. మిలిటెంట్ల పేరుతో అమాయక యువకులను సైన్యం పొట్టనబెట్టుకుంటోందని ఫరూఖ్ మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హురియత్ చైర్మన్ గిలానీ శనివారం కశ్మీర్ లోయలో బంద్‌కు పిలుపునిచ్చారు. -
వేర్పాటువాదులపై కేంద్రం ఫైర్
గిలానీ ర్యాలీలో పాక్ నినాదాలపై సీరియస్ కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశం గిలానీ, ఆలం హౌస్ అరెస్ట్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ నిర్వహించిన ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దేశవ్యతిరేక చర్యల్లో పాల్గొన్న వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ర్ట సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌తో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. జాతీయ భద్రత విషయంలో ఏ విధంగానూ రాజీ పడకూడదని సూచించారు. ఐదేళ్ల తర్వాత రాష్ర్టంలో ర్యాలీ నిర్వహించేందుకు గిలానీకి అవకాశమిచ్చినట్లు సయీద్ వివరించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన వేర్పాటువాద నేత మసరత్ ఆలం ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ర్యాలీ సందర్భంగా పాక్‌కు అనుకూలంగా ఆలం నినాదాలు చేయగా, మరికొందరు ఆ దేశ జెండాలను ప్రదర్శించారు. కాగా, దీనిపై జమ్మూలో గురువారం నిరసనలు వ్యక్తమయ్యాయి. వేర్పాటువాద నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ క్రాంతి దళ్, హిందూ శివసేన, మరో సంస్థతో పాటు కశ్మీరీ పండిట్లు నిరసనలు చేపట్టారు. కాగా, పాక్ జెండాలు ఎగరేయడం తనకు తప్పుగా కనిపించడం లేదని ఆలం అన్నారు. జాతి విద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ పేర్కొంది. ఇలాంటి ఘటనలను సహించబోమని సీఎం సయీద్ పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో గిలానీ, ఆలం, మరో వేర్పాటువాద నేతలపై కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం త్రాల్లో ర్యాలీ నిర్వహిం చనున్న నేపథ్యంలో ఆలం, గిలానీలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. -
కశ్మీర్లో కాల్పుల మోత
ఒకేరోజు మూడు వేర్వేరు చోట్ల తీవ్రవాదుల కాల్పులు ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఒకేరోజు మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఓ కేసు విచారణ కోసం వెళ్లిన ముగ్గురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. నిరాయుధులైన ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చిచంపారు. షోపియన్ జిల్లా అంషిపొరా గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు కొద్ది గంటల ముందే కశ్మీర్ లోయలో మరో దాడి జరిగింది. బారాముల్లా జిల్లా పటాన్ ప్రాంతంలో సాధారణ బస్సులో వెళ్తున్న పోలీసు అధికారిపై అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఇందులో ఓ సబ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. మిలిటెంట్లు పారిపోయాక డ్రైవర్ బస్సును నేరుగా సమీపంలోని పోలీసు చెక్‌పోస్ట్ వద్దకు తీసుకువెళ్లడంతో ఆ ఎస్సైని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడో ఘటన పుల్వామా జిల్లా ట్రాల్ పట్టణంలో చోటుచేసుకుంది. ఇక్కడ మిలిటెంట్లు.. గతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో పనిచేసిన రఫీక్ అహ్మద్ భట్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అంషిపొరా కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు షబీర్ హుస్సేన్, నజీర్ అహ్మద్, హెడ్‌కానిస్టేబుల్ ముస్తాక్ అహ్మద్ అక్కడికక్కడే చనిపోయారు. వీరు ఆయుధాల్లేకుండా ఆ గ్రామానికి వెళ్లారు. దీన్ని అదనుగా తీసుకొని తీవ్రవాదులు వారిపై తూటాలు కురిపించారు. ఒకేరోజు మూడు కాల్పుల ఉదంతాలు చోటుచేసుకోవడం కశ్మీర్లో కలకలం సృష్టించింది. అదీ పర్యాటకులను ఆకర్షించేందుకు దాల్ సరస్సు ఒడ్డున ఆసియాలో అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను ముఖ్యమంత్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ ప్రారంభించిన రోజే మిలిటెంట్లు రెచ్చిపోవడం గమనార్హం. -
కశ్మీర్లో వరద బీభత్సం
ఎడతెరపి లేని వానలు... జనజీవనం అస్తవ్యస్తం కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి.. శిథిలాల కింద 8 మంది ఉప్పొంగుతున్న జీలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం రంగంలోకి దిగిన కేంద్రం.. రూ.200 కోట్ల తక్షణ సాయం కేంద్రమంత్రి నఖ్వీని హుటాహుటిన కశ్మీర్‌కు పంపిన మోదీ శ్రీనగర్/జమ్మూ: ఏడు నెలలు తిరగకుండానే జమ్మూకశ్మీర్‌ను మళ్లీ వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి. 36 గంటల నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వానలు, ఉప్పొంగుతున్న నదులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో తొమ్మిది మంది చనిపోయారు. చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 8 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దూకాయి. జాతీయ విపత్తు సహాయక దళానికి(ఎన్డీఆర్ఎఫ్)చెందిన ఎనిమిది బృందాలు, ఆర్మీ బలగాలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. తక్షణ సాయం కింద కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ శ్రీనగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బుద్గాం జిల్లాలోని లాడెన్ గ్రామంలో నాలుగు ఇళ్లపై కొండచరియలు విరిగిపడంతో అందులోని వారంతా శిథిలాల్లో చిక్కుకుపోయారు. శిథిలాల నుంచి ఇప్పటిదాకా ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, అందులో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరో 8 మంది ఈ శిథిలాల కింద ఉండొచ్చని తెలిపారు. వరదలకు ఉధంపూర్‌లో కూడా ఒకరు చనిపోయారు. మరోవైపు వరుసగా మూడోరోజు శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసేశారు. 294 కిలోమీటర్లున్న ఈ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో సుమారు 2 వేల ట్రక్కులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కశ్మీర్‌లోని ఏడు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున స్థానికులు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం అందిస్తామని కేంద్రం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ.. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని హుటాహుటిన కశ్మీర్‌లోయకు పంపారు. బారాముల్లా జిల్లాలోని పటాన్ ప్రాంతంలో పర్యటించిన నఖ్వీ.. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా సీఎం ముఫ్తీకి ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రంలో మూడు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి సీఎం సయీద్, మంత్రులు స్వయంగా సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. జీలం ఉగ్రరూపం.. భారీ వర్షాలతో కశ్మీర్లో జీలం నది ఉగ్రరూపం దాల్చింది. అనంతనాగ్ జిల్లాలోని సంగం, రామ్మున్షీ బాగ్లతోపాటు అనేకచోట్ల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాలవారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. సోమవారం సాయంత్రానికి నది కాస్త శాంతించింది. నీటిమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక రాజధాని శ్రీనగర్‌తోపాటు కశ్మీర్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలతో నిరాశ్రయులైనవారికి ప్రభుత్వ భవనాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. 320 కుటుంబాలు ఈ శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. పూంఛ్ జిల్లాలోని చాందిక్-కలీ బ్రిడ్జి ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 50 మందిని పోలీసులు, సైనిక బలగాలు రక్షించాయి. సోమవారం ఉదయం శ్రీనగర్‌లో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కిందటేడాది సెప్టెంబర్‌లో వచ్చిన ఆ వరదల్లో 300 మందికిపైగా చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. -
కశ్మీర్లో మళ్లీ ‘ఉగ్ర’ దాడి
ఈసారి ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్లు, కాల్పులతో తెగబడ్డ ఇద్దరు టైస్టులు హతమార్చిన బలగాలు జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. సాంబ జిల్లాలో జమ్మూ, పఠాన్‌కోట్ హైవేపై ఉన్న మెష్వారా ఆర్మీక్యాంప్‌పై శనివారం ఉదయం 5.50 గంటలకు ఇద్దరు ఉగ్రవాదులు గ్రెనేడ్లు, కాల్పులతో విరుచుకుపడ్డారు. అయితే, ఆ దాడిలో భద్రతాబలగాలు కానీ, పౌరులు కానీ ఎవరూ గాయపడలేదని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక పౌరుడు సైకిల్‌పై నుంచి కిందపడి స్వల్పంగా గాయపడ్డాడు. భద్రతాదళాల ఎదురుకాల్పులో ఆ ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారు. కథువా జిల్లాలోని రాజ్‌భాగ్ పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చనిపోగా, డిప్యూటీ ఎస్పీ సహా 11 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. రాజ్‌భాగ్ పోలీస్‌స్టేషన్‌పై శుక్రవారం దాడి చేసిన ఉగ్రవాదులు, శనివారం ఆర్మీక్యాంప్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఒకే ఉగ్రవాద సంస్థకు చెందినవారా? కాదా? అన్న విషయం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి లెఫ్ట్‌నెంట్ కల్నల్ మనీశ్ మెహతా పేర్కొన్నారు. ‘ఆర్మీక్యాంప్ లోపలికి రావడానికి ఉగ్రవాదులు ప్రయత్నించలేదు. బయట్నుంచే కాల్పులు జరిపారు. గ్రెనేడ్లు విసిరారు. దాంతో అక్కడే వారిని చుట్టుముట్టి హతమార్చాం’ అని మెహతా చెప్పారు. జమ్మూ, పఠాన్‌కోట్ రహదారిపై రెండు రోజుల్లో రెండు వరుస దాడులు జరగడంతో.. ముందుజాగ్రత్త చర్యగా ఆ హైవేను మూసివేశారు. ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల వల్ల బలహీనపడ్డ ఉగ్రవాదులు.. తమ అస్తిత్వాన్ని చూపెట్టుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యానించారు. ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడే ఇలాండి దాడులకు తెగబడ్తారన్నారు. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి చాలా రహస్య మార్గాలున్నాయని, కొన్నిసార్లు మొత్తం ఐబీని పహారా కాయడం కష్టమవుతుందని పారికర్ వివరించారు. కాగా, ఉగ్రవాదం ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మానవజాతికే సవాలుగా మారిందని, ఆ మహమ్మారిపై ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాటం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. పాక్ అనుకూల వైఖరి వల్లనే దాడులు పాకిస్తాన్ అనుకూల వైఖరి అనుసరిస్తున్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ను కట్టడి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది. పాకిస్తాన్‌తో, మిలిటెంట్లతో, వేర్పాటువాదులతో ముఫ్తీ నెరపుతున్న రహస్య సంబంధాల ఫలితమే ఈ ఉగ్రదాడులని జమ్మూకశ్మీర్ సీఎల్పీ నేత నావంగ్ రిగ్జిన్ జోరా తీవ్రంగా ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రాలు అనుసరిస్తున్న ఈ గందరగోళ విధానాలు ఇలాగే కొనసాగితే మరోసారి రాష్ట్రంలో ఉగ్రవాదం పెచ్చరిల్లే ప్రమాదముందని జోరా హెచ్చరించారు. ‘ప్రధాని మూడ్ బావుంటే పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటారు. మూడ్ బాగోకపోతే ఇరుదేశాల మధ్య చర్చలను రద్దు చేస్తారు. ఇలా భావోద్వేగాలపై ఆధారపడ్డ విదేశాంగ విధానం ఉంటే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు. -
రాజకీయ పొత్తులు ముఖ్యం కాదు
దేశ రక్షణే ప్రధానం: హోంమంత్రి రాజ్‌నాథ్ ఆలం వివాదంలోకి గవర్నర్‌ను లాగిన కశ్మీర్ హోంశాఖ ఘజియాబాద్/జమ్మూ: దేశరక్షణ తమ ప్రభుత్వ అతి ప్రాధాన్య అంశమని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో పొత్తు దేశ రక్షణ కంటే ముఖ్యం కానే కాదన్నారు. వేర్పాటువాది మసరత్ ఆలం విడుదలపై వివాదం రేగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్‌నాథ్ మంగళవారం ఘజియాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాగా, కశ్మీర్ సీఎం సయీద్.. రాజ్‌నాథ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకపై సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామని, బీజేపీని సంప్రదించకుండా ఏ వేర్పాటువాదినీ విడిచిపెట్టబోమని ఆయన అన్నట్లు సమాచారం. ఆలంను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు ఆలం విడుదలపై పార్లమెంటులో రెండో రోజు కూడా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. సయీద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. సయీద్ ప్రభుత్వం మరో 800 మంది వేర్పాటువాదులను విడుదల చేయాలనుకుంటోందని ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక పంపించారన్న వార్తలపై కేంద్రం జవాబివ్వాలంటూ రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ఆలం విడుదలకు సంబంధించి కశ్మీర్ హోం శాఖ జమ్మూ కలెక్టర్‌సకు రాసిన లేఖ వివాదానికి తెరలేపింది. ఆలం విడుదల ఉత్తర్వులు గవర్నర్ పాలన ఉన్న ఫిబ్రవరిలోనే వెలువడినట్లు ఈ లేఖ స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వివాదంలోకి కొత్తగా గవర్నర్ ఎన్ఎన్ వోరా చిక్కుకున్నారు. -
రేపు జమ్మూకశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. పీడీపీ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం ఉదయం పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతానేజ బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం. -
కశ్మీర్ పీఠంపై కూటమి
-
కశ్మీర్ పీఠంపై కూటమి
కొలువుదీరనున్న బీజేపీ-పీడీపీ సంకీర్ణం ప్రకటించిన అమిత్ షా, మెహబూబా ముఫ్తీ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే బీజేపీ-పీడీపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. రాష్ట్రానికి కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టనున్న పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. గురువారం కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)ను బహిర్గతం చేయనున్నారు. మార్చి 1న సయీద్ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. మంగళవారమిక్కడ అమిత్ షా నివాసానికి వెళ్లిన మెహబూబా ముఫ్తీ ఆయనతో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే సీఎంపీకి తుది రూపు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి బీజేపీ-పీడీపీ కూటమి త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వివిధ అంశాలపై చర్చల అనంతరం కనీస ఉమ్మడి ప్రణాళిక ఒక కొలిక్కి వచ్చిందని షా తెలిపారు. మోదీతో సయీద్ భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడన్నది ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్నాళ్లూ ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు. కీలకమైన అంశాలపై రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని, కూటమికి సీఎంపీ ఎజెండా ఉంటుందని మెహబూబా చెప్పారు. ఇది రాష్ట్రంలో గతంలో కూటములకు భిన్నమని, తొలిసారిగా ప్రజలు, రాష్ట్రం, దేశ ప్రయోజనాల ప్రాతిపదికన కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. 87 స్థానాలున్న అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) 15, కాంగ్రెస్12 సీట్లు గెల్చుకున్నాయి. సీఎంపీలో ఏముంది?: సీఎంపీలోని అంశాలను అధికారికంగా వెల్లడించకపోయినా.. సాయుధ దళాల ప్రత్యేక అధికారచట్టంపై కమిటీ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించా యి. ఆర్టికల్ 370పై ఆందోళన అక్కర్లేదని బీజే పీ పీడీపీకి అభయమిచ్చింది. పశ్చిమ పాక్ నుంచి శరణార్థులుగా వచ్చిన 25 వేల కుటుంబాలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆరేళ్లు ఆయనే సీఎం! రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని, బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం. -
పీడీపీకి మద్దతుపై గవర్నర్‌కు ఎన్సీ లేఖ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి లాంఛనంగా మద్దతు ప్రకటిస్తూ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రాకు మంగళవారం లేఖ రాసింది. పార్టీ జమ్మూ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ దేవేందర్‌సింగ్ రాణా ఈ లేఖను గవర్నర్‌కు జమ్మూలో అందజేశారు. ఈ మేరకు ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ట్వీట్’ చేశారు. కాగా, తాజా పరిణామంపై పార్టీలో చర్చించాక స్పందిస్తామని పీడీపీ ప్రతినిధి నయీమ్ అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రస్తుతం బీజేపీతో అనధికార స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు. -
కశ్మీర్ లేనిదే భారత్‌తో చర్చలు లేవు: పాక్
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ అంశం ఎజెండాలో భాగంగా లేనిదే భారత్‌తో తాము ఎలాంటి చర్చలూ ప్రారంభించబోమని పాకిస్తాన్ స్పష్టంచేసింది. గత ఏడాది కశ్మీర్ నేతలతో చర్చలకు నిర్ణయించిన సమావేశాన్ని రద్దుచేయటం ద్వారా ఈ అంశంపై చర్చించేందుకు భారత్ సుముఖంగా లేదని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్‌అజీజ్ వ్యాఖ్యానించారు. రెండు దేశాలూ చారిత్రక అపనమ్మకాన్ని అధిగమించి శాంతి చర్చలు జరపాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఇరు దేశాలకూ సూచించగా అజీజ్ పైవిధంగా స్పందించారు. ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలూ ముందుకు వచ్చి చర్చలు జరపడాన్ని తా ము ప్రోత్సహిస్తామని కెర్రీ పేర్కొన్నారు. -
ఆగని పాక్ దుశ్చర్య
భారీగా మోర్టారు బాంబు దాడులు బీఎస్ఎఫ్ జవాను మృతి జమ్మూ:సరిహద్దులోని భారత భద్రతా శిబిరాలు, పౌర ఆవాస ప్రాంతాలపై పాకిస్తాన్ మళ్లీ భారీ మోర్టారు బాంబుల దాడి ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను చనిపోయారు. గత వారం రోజుల్లో పాక్ బలగాల మోర్టారు బాంబుల దాడి, కాల్పుల్లో మొత్తం నలుగురు జవాన్లు, ఒక మహిళ చనిపోయారని, భారత ఎదురు కాల్పుల్లో ఐదుగురు పాక్ రేంజర్లు, ఒక బాలిక మృతిచెందారని ఉన్నతాధికారులు చెప్పారు. సరిహద్దు వెంట శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకూ ఎటువంటి కాల్పుల ఉల్లంఘనలూ జరగలేదు. ‘అయితే సోమవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సాంబా, కతువా జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ రేంజర్లు మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించారు. తొలుత స్వల్ప కాల్పులతో మొదలు పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు భారత సరిహద్దు శిబిరాలపై భారీ స్థాయిలో మోర్టారు బాంబులతో కాల్పులు మొదలుపెట్టారు’ అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో సాంబా సెక్టార్లో విధుల్లో ఉన్న దేవేందర్‌కుమార్ అనే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ చనిపోయారని చెప్పారు. పౌర ఆవాసాలు లక్ష్యంగా పాక్ షెల్లింగ్... పాక్ దళాలు ఉద్దేశపూర్వకంగానే పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని మోర్టారు బాంబులు కాలుస్తున్నాయని.. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సరిహద్దులోని భారత గ్రామాలన్నిటిపైనా పాక్ బలగాలు మోర్టారు షెల్లింగ్ జరుపుతున్నాయని.. భారత భూభాగంలోని 57 గ్రామాల్లో ఐదు వేల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో ఉన్నారని కతువా డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వివరించారు. ‘పాక్ ప్రయోగిస్తున్న షెల్స్ భారత భూభాగంలో మూడు, నాలుగు కిలోమీటర్ల వరకూ వచ్చిపడుతున్నాయి’ అని చెప్పారు. కాగా, సరిహద్దులో భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో తమ పౌరులిద్దరు చనిపోయారని పాక్ ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడం కొనసాగుతోంది. సాంబా, కతువా జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి గత ఐదు రోజుల్లో 3,500 మందికి పైగా ప్రజలు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు, సహాయ శిబిరాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. కతువా జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో 1800 మంది ఉన్నారు. సాంబా జిల్లాలో వేయి మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. వీరికి వసతి, సాయం అందించేందుకు భారత సైనిక దళం ఆపరేషన్ ‘హాస్లే బులంద్’ పేరుతో కృషి చేస్తోంది. -
బీజేపీతో దోస్తీకి సుముఖం!
కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ సంకేతాలు కశ్మీర్ తీర్పు మోదీకి ఓ సవాలు, అవకాశమన్న మెహబూబా ముఫ్తీ పార్టీ ఏదైనా పీడీపీ అజెండాను గౌరవించాలని వ్యాఖ్య.. గవర్నర్‌తో భేటీ అయిన పీడీపీ నాయకురాలు జమ్మూ: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు.. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్రమోదీకి ఒక సవాలు, ఒక అవకాశం అని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా.. రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు వ్యతిరేకం కాదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆహ్వానం మేరకు మెహబూబా బుధవారం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదో పెద్ద బాధ్యత. మోదీకి ఇదో పెద్ద బాధ్యత. జమ్మూకశ్మీర్ అనేది నెహ్రూ నుంచి నేటి వరకూ ఏ ప్రధానికైనా అతి పెద్ద సవాలుగా ఉంది. అభివృద్ధి తన స్వప్నమని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని మోదీ చెప్తున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో శాంతియుత వాతావరణం లేకుండా అభివృద్ధి జరగదు. వాజ్‌పేయి రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా అభివృద్ధి సాధ్యం కాదు. వాజ్‌పేయి ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించారు. హురియత్‌తో బేషరతు చర్చలు ప్రారంభించారు. అద్వానీ ఉప ప్రధానమంత్రిగా ఉన్నపుడు వాజ్‌పేయి పాక్‌తో చర్చలు ప్రారంభించారు. రాష్ట్రానికి ఉదార ఆర్థిక ప్యాకేజీ లభించింది. యూపీఏ సర్కారు దీనిని కొంత కాలం కొనసాగించింది.. ఆ తర్వాత నిలిపివేసింది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘ఏ కూటమి ఏర్పాటైనా.. అది ప్రజా తీర్పును, సఖ్యత అనే సూత్రాన్ని గౌరవించాలి. దీనిని పాటించనంతవరకూ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా నిష్ర్పయోజనమే’ అని అన్నారు. గవర్నర్‌తో మాట్లాడిన అంశాల గురించి వెల్లడించలేదు. అయితే.. కేవలం ప్రభుత్వ ఏర్పాటు కోసం మెజారిటీని కూడగట్టుకోవటం తమ పార్టీ ప్రాధాన్యం కాదని చెప్పారు. పీడీపీకి 55 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్న మీడియా కథనాలను ఉటంకించారు. ‘భాగస్వామ్య పక్షం బీజేపీయా, ఎన్సీయా, కాంగ్రెస్సా అనేది సమస్య కాదని.. సఖ్యత కోసం పీడీపీ ఎజెండాను గౌరవించడమనేది ముఖ్యం. నాయకత్వమనేది ఈ సవాలును స్వీకరించి ప్రజాతీర్పును తలదాలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 15 నిమిషాల పని’ అని పేర్కొన్నారు. ముఫ్తీ వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నాం: బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలను ఉటంకిస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీ వ్యాఖ్యలను, మీడియా ద్వారా ఇచ్చిన సంకేతాలను తాము ఆహ్వానిస్తున్నామని, అభినందిస్తున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ పేర్కొన్నారు. తమ రెండు పార్టీల మధ్య సమాచార సంబంధం నెలకొల్పుకున్నామని.. ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు చర్చలను లాంఛనంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత చొరవ తీసుకోవాలని, ఆ తర్వాత కాంగ్రెస్ వైఖరి ఏమిటనేది చెప్తామని జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్ పేర్కొన్నారు. 12వ అసెంబ్లీ ఏర్పాటుపై నోటిఫికేషన్ జమ్మూకశ్మీర్‌లో 12వ అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అనుమతితో జనవరి 20తో కాలపరిమితి తీరిపోతున్న 11వ అసెంబ్లీ స్థానంలో... 12వ అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ అయిందని న్యాయశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన సభ్యులు ప్రమాణం చేస్తారని చెప్పారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఏర్పాటుపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది. అయితే, రాజ్యాంగం ప్రకారం జమ్మూకశ్మీర్‌లో ఆ పనిని న్యాయ శాఖ చేస్తుంది. -
‘ఆర్టికల్ 370’పై హామీ కావాలి
బీజేపీతో దోస్తీకి పీడీపీ పరోక్ష సంకేతాలు కశ్మీర్లో సర్కారు ఏర్పాటుకు గల అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నామన్న పీడీపీ ఆర్టికల్ 370, ఏఎఫ్ఎస్పీఏ అంశాలపై పార్టీ వైఖరి మారదని స్పష్టీకరణ ఎన్సీ నుంచి ‘బేషరతు మద్దతు’ ప్రతిపాదనేదీ రాలేదన్న పీడీపీ అధికార ప్రతినిధి శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్ధమంటూ శనివారం సంకేతాలిచ్చింది. రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ అధికరణకు భద్రత కల్పించడం, సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) తొలగించడం అనే కీలక అంశాలపై.. తమతో జట్టుకట్టబోయే పార్టీల నుంచి హామీ కావాలని కోరింది. ‘‘అన్ని అవకాశాలూ తెరిచే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీతోనైనా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై మేం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ శ్రీనగర్‌లో పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నాం... రాష్ట్రంలోని 87 అసెంబ్లీ సీట్లకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లభించని విషయం తెలిసిందే. పీడీపీ 28 స్థానాలు గెలుచుకుని మిగతా పార్టీలకన్నా ముందుండగా.. 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ రెండో స్థానంలో నిలిచిన విషయమూ విదితమే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సంప్రదింపుల కోసం రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా ఈ రెండు పార్టీలతోనూ జనవరి 1వ తేదీన భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. తమ పార్టీ నాయకత్వం ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలన్నిటినీ పరిశీలిస్తోందని నయీమ్ చెప్పారు. ఆర్టికల్ 370పై తమ పార్టీ వైఖరి ఏ మాత్రం మారబోదన్నారు. అలాగే సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించటానికీ తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కశ్మీర్ అంశానికి పరిష్కారం కోసం రాజకీయ ప్రక్రియను ప్రారంభించటానికి కూడా తాము నిబద్ధులమై ఉన్నామన్నారు. ఎన్సీ నుంచి ఏ సమాచారం రాలేదు... ‘భవిష్యత్తులో జట్టుకట్టబోయే భాగస్వామ్య పక్షం ముఖ్యమంత్రి పదవిని చెరి కొంత కాలం పంచుకోవాలని డిమాండ్ చేస్తే పీడీపీ అంగీకరిస్తుందా?’ అని ప్రశ్నించగా.. ఏ పార్టీతోనూ చర్చలు ఇంకా ఈ అంశం వరకూ రాలేదని ఆయన బదులిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ పార్టీకి కాంగ్రెస్ ప్రతిపాదన పంపిందని.. దీనిని తమ నాయకత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ బద్ధశత్రువైన నేషనల్ కాన్ఫరెన్స్ రాష్ట్రంలో పీడీపీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇస్తామన్న ప్రతిపాదన గురించి ప్రస్తావించగా.. ఇలాంటి సమాచారమేదీ తమకు ఆ పార్టీ నుంచి అందలేదని నయీమ్ సమాధానమిచ్చారు. బీజేపీతో దోస్తీకి పీడీపీ నేతల వ్యతిరేకత... ఇదిలావుంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 మంది సభ్యులు అవసరమైన పరిస్థితుల్లో పీడీపీ సంశయాత్మక పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీజేపీతో చెలిమి చేయడమంటే.. రాష్ట్రంలో ఇటీవల మళ్లీ పుంజుకుంటున్న తమ పార్టీకి ఆత్మహత్యా సదృశమేనని పీడీపీలో బలమైన నేతలు కొందరు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా ఎన్నికల్లో కేవలం 15 సీట్లకే పరిమితమై అధికారం కోల్పోయిన నేషనల్ కాన్ఫరెన్స్.. ప్రభుత్వ ఏర్పాటు పోటీ నుంచి వైదొలగింది. పార్టీ నాయకత్వం బీజేపీతో చర్చలు జరుపుతోందన్న వార్తలు వెలువడిన తర్వాత ఎన్సీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తం చేయటం దీనికి కారణం. పార్టీలతో చర్చలు జరుపుతున్నాం: బీజేపీ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అక్కడి పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ శనివారం ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. అయితే.. ఎవరితో చర్చలు జరుపుతున్నామన్నది ఆయన వెల్లడించలేదు. -
ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిద్దాం!
పీడీపీ, బీజేపీలకు గవర్నర్ ఆహ్వానం జనవరి 1న వారితో వేర్వేరుగా భేటీ జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అదిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీకి మద్దతిస్తామంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్‌లు ముందుకొచ్చినప్పటికీ.. పీడీపీ వైపు నుంచి స్పందన లేదు. కానీ మద్దతిస్తామంటూ ఎన్సీ తమకు లేఖ రాసిందంటూ ఒక ఉత్తరాన్ని పీడీపీ లీక్ చేసింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో మద్దతిస్తామని మౌఖికంగా మాత్రమే చెప్పామని ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. లేని లేఖను సృష్టించడం ద్వారా పీడీపీ బీజేపీతో మైండ్‌గేమ్ ఆడుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పీడీపీకి బేషరతుగా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ఎన్సీ నేత జునియాద్ మట్టూ మరోసారి స్పష్టం చేశారు. పీడీపీ- ఎన్సీ ప్రభుత్వానికి మద్దతిస్తామని ముగ్గురు స్వతంత్రులు కూడా ముందుకొచ్చారని సమాచారం. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చిద్దాం రండంటూ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పీడీపీ, బీజేపీలను రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా వేర్వేరుగా ఆహ్వానించారు. జనవరి 1వ తేదీ ఉదయం పీడీపీకి, అదేరోజు మధ్యాహ్నం బీజేపీకి ఆయన సమయమిచ్చారు. జనవరి 18న ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంటూ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జుగల్ కిషోర్‌లకు గవర్నర్ లేఖలు పంపించారని రాజ్ భవన్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు సహా తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో ఆ చర్చలకు రావాలని గవర్నర్ కోరినట్లు అనధికారిక సమాచారం. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవ్వాలన్న ఉద్దేశంతో రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ శ్రీనగర్‌లో చెప్పారు. కాగా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ శనివారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. ఒత్తిళ్లకు పీడీపీ లొంగరాదు: ఆజాద్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో ఒత్తిళ్లకు తలొగ్గకుండా పీడీపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీతోపాటు తాము కూడా పీడీపీకి మద్దతు ప్రకటించామన్నారు. కాగా, మతమార్పిళ్లపై ప్రధాని మోదీ దృతరాష్ట్రు డిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. -
బీజేపీ సత్తా వెనక రాంమాధవ్
జమ్మూకశ్మీర్‌లో కమలం 25 సీట్లు గెలవడంలో కీలకం అత్యధిక ఓట్ల శాతం వెనక తెలుగుతేజం కృషి సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం వెనక తెలుగుతేజం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యూహం పనిచేసిందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి తమ బలాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ పెంచుకుంటూ 25 సీట్లు గెలుపొందడంలో, అత్యధిక ఓట్ల శాతం (23%) సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతోంది. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ర్టంలో బీజేపీ రెండో స్థానంలో నిలవడం ఆషామాషీ విషయం కాదని...పక్కా ప్రణాళికతో పనిచేయడం వల్లే కమలదళం ఈ ఫలితాలు సాధించగలిగిందని అంటోంది. ఇంతకీ రాంమాధవ్ రాష్ట్రంలో అనుసరించిన వ్యూహం ఏమిటంటే... అభివృద్ధి నినాదంతో ముందుకు... జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే వివాదాస్పద ‘ఆర్టికల్ 370’ని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా ఎంచుకోగా రాంమాధవ్ వ్యూహంతో బీజేపీ మాత్రం అభివృద్ధి నినాదాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకొని ప్రజల వద్దకు వెళ్లింది. అభివృద్ధి చుట్టూ ప్రచారం చేపట్టేలా పార్టీ శ్రేణులను రాంమాధవ్ సమాయత్తం చేశారు. ఉగ్రవాదం, హింస కారణంగా అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రం అన్ని రంగాల్లో పుంజుకునేలా చేయడం కేవలం బీజేపీకే సాధ్యమంటూ ప్రచారంలో ఆయన నినదించారు. ‘కుటుంబ పాలన, అవినీతితో మమేకమైన పార్టీలు కావాలా? అభివృద్ధి కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కశ్మీర్లో ఎన్నికలను, రాజకీయాలను పాకిస్తాన్ అంశంతోనే ముడిపెడుతున్నారని, దశాబ్దాలుగా అదే ఎజెండా అయ్యిందని, దాన్ని పక్కనబెట్టి అభివృద్ధి దిశగా నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్ అంశం యావత్ భారత దేశంతో ముడివడి ఉందని, కేవలం ఆ రాష్ట్రంతోనే సంబంధం కలిగి లేదని ఎన్నికలకు ముందు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మాజీ వేర్పాటువాదులతో మంతనాలు... కశ్మీర్ లోయలో బలంగా లేమని గ్రహించిన ఆయన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌లతో విసిగి వేసారిన నేతలతో సంబంధాలు నెరిపి కొత్త సమీకరణలకు తెరతీశారు. గతంలో వేర్పాటువాదాన్ని బలంగా వినిపించిన నేతలతోనూ సంబంధాలు నెరిపారు. మాజీ వేర్పాటువాది, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్ గనీ లోన్ ప్రధాని మోదీని కలవడం వెనక కూడా రాంమాధవ్ ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కశ్మీరీ పండితుల కోసం... కశ్మీరీ పండితులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు రాంమాధవ్ వ్యూహాలు రచించారు. వీరంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కశ్మీరీ పండిట్ సంఘాలన్నీ కృషిచేశాయి. ఈ సంఘాల్లో ప్రేరణ కల్పించింది బీజేపీ వ్యూహమే. కాగా, కశ్మీర్లో వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమైందీ? కేంద్రం ఎలా సాయపడిందీ వివరించడంలోనూ బీజేపీ విజయం సాధించింది. మెరుగైన ఫలితం... రాంమాధవ్ ప్రచార వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జమ్మూకశ్మీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 25 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. 1987లో రెండు సీట్లతో రాష్ర్టంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం 1996లో 8 సీట్లు, 2002లో 11 సీట్లకు చేరి తాజాగా గత ఎన్నికలకన్నా రెట్టింపు సీట్లను సాధించే స్థాయికి ఎదిగింది. అయితే బీజేపీ గెలుచుకున్న సీట్లన్నీ జమ్మూ ప్రాంతం నుంచే కావడం, కశ్మీర్ లోయ, లడఖ్లలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఒక్కటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలాంశంగా నిలిచింది. ఎన్నికల ఫలితంపై రాంమాధవ్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఎన్నికల ఫలితం మిశ్రమ భావాలను మిగిల్చింది. అయితే పార్టీకి ఇదొక గొప్ప విజయం. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా నిలిచాం. రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. -
కశ్మీరాన వీడని చిక్కుముడి
ప్రభుత్వ ఏర్పాటుపై తొలగని ప్రతిష్టంభన బీజేపీతో పొత్తును దాదాపు తోసిపుచ్చిన ఎన్సీ పీడీపీతో ఎన్సీ జట్టు?; అదే బాటలో కాంగ్రెస్ శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. హంగ్ ఫలితాల నేపథ్యంలో సంకీర్ణ సర్కారు అనివార్యమైనా ఎవరెవరు జతకడతారన్న చిక్కుముడి వీడటంలేదు. 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాన పార్టీలవైపు చూస్తుండగా ఆయా పార్టీల నుంచి గురువారం కూడా అటువంటి సంకేతాలేవీ అందలేదు. సర్కారు ఏర్పాటుపై ఎన్సీ, బీజేపీ నాయకత్వాల మధ్య సంప్రదింపులు జరిగినా ముందడుగు పడలేదని తెలియవచ్చింది. రాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసినట్లు వార్తలు వచ్చినా ఇరు పార్టీలు వాటిని ఖండించాయి. ఈ పరిస్థితుల్లో కమల దళానికి మద్దతును ఎన్సీ దాదాపు తోసిపుచ్చినట్లేనని తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు తాము సుముఖంగా లేమని, ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేశామని ఎన్సీ ఎమ్మెల్యే ఆగా సయ్యద్ రుహుల్లా గురువారం పేర్కొన్నారు. మరోవైపు ఒమర్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పీడీపీకి తాము చేసిన మద్దతు ప్రతిపాదనపై స్పందించాల్సినది ఆ పార్టీయేనని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ సైతం పీడీపీకి దగ్గరయ్యేందుకు గాలం వేస్తోంది. భావసారూప్యతగల పార్టీలతో కలసి సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించాలంటూ రాష్ట్ర పీసీసీ చీఫ్ సైఫుద్దీన్ సౌజ్ గురువారం పీడీపీ చీఫ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌ను కోరారు. పీడీపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజాతీర్పును గౌరవించినట్లు అవుతుందన్నారు. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు నుంచి దూరం పెట్టేందుకు కాంగ్రెస్, ఎన్సీలతో కలసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు పీడీపీకి సంఖ్యాబలం సరిపోతుందని మరో కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో మేమే కీలకం: జైట్లీ జమ్మూకశ్మీర్‌లో ఏర్పడబోయే ప్రభుత్వంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పార్టీ నూతన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కలసి గురువారం జమ్మూ విచ్చేసిన జైట్లీ... ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో పీడీపీకి ఎక్కువ సీట్లు (28) వచ్చినా అత్యధిక ఓట్ల శాతం (23%) మాత్రం తమకే వచ్చిందన్నారు. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తి తామేనని, ‘వీటో’ అధికారం ప్రస్తుతం తమ చేతిలోనే ఉందన్నారు. -
కశ్మీర్లో హంగ్, జార్ఖండ్‌లో బీజేపీ!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు కశ్మీర్లో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న పీడీపీ రెండో స్థానానికి ‘కమలం’ పరిమితమయ్యే అవకాశం జార్ఖండ్‌లో బీజేపీకే పీఠం దక్కే చాన్స్ న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రధాన రాజకీయ పార్టీలపై ఎగ్జిట్ పోల్స్ నీళ్లు చల్లాయి. రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ ఫలితాలు రావచ్చని అంచనా వేశాయి. ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని తెలిపాయి. తద్వారా సార్వత్రిక ఎన్నికలతోపాటు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బాగా పనిచేసిన ‘మోదీ మాయాజాలం’ జమ్మూకశ్మీర్‌లో పనిచేయలేదని చెప్పకనే చెప్పాయి. తొలి నుంచీ బాగా పట్టున్న జమ్మూ ప్రాంతంలో మినహా కశ్మీర్ లోయ, లడఖ్లలో ఓటర్లు బీజేపీని తిరస్కరించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన అభివృద్ధి నినాదంతోపాటు ‘మిషన్ 44 ప్లస్’ సీట్ల లక్ష్యంతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర నిరాశను కలిగించనున్నాయి. అలాగే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తహతహలాడుతున్న నేషనల్ కాన్ఫరెన్స్‌ను ఈ అంచనాలు నైరాశ్యంలో ముంచెత్తనుండగా పీడీపీ శిబిరంలో మాత్రం ఉత్సాహం నింపనున్నాయి. మరోవైపు జార్ఖండ్ పీఠం మాత్రం కమల దళానికే దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. జార్ఖండ్‌లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వివరించాయి. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)తోపాటు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకునే అవకాశం ఉందని తెలిపాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం ఐదో, తుది దశ పోలింగ్ ముగిసిన వెంటనే పలు చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. ఈ నెల 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు అద్దం పడతాయో మరో రెండు రోజుల్లో తేలనుంది. రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. -
నేడు రెండో విడత ఎన్నికలు
కశ్మీర్లో 18, జార్ఖండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ శ్రీనగర్/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీల రెండో విడత ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. కశ్మీర్లో 18, జార్ఖండ్‌లోని 7 నక్సల్స్ ప్రభావిత గిరిజన జిల్లాల్లోని 20 స్థానాలకు పోలింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఈ విడతలో రెండు రాష్ట్రాలతో కలిపి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఏడుగురు రాష్ట్ర మంత్రులు, ఓ మాజీ కశ్మీర్ వేర్పాటువాద నేత భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. జమ్మూ ప్రాంతంలోని రెండు జిల్లాలు, కశ్మీర్ లోయలోని ఐదు జిల్లాల్లో ఉన్న 18 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 175 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. మొత్తం 87 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో గత నెల 25న 15 స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 71 శాతం పోలింగ్ నమోదయింది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ వేర్పాటువాద నేత సజ్జాద్‌గనీ ఈ విడతలో హంద్వారా నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 12 లక్షల మంది ఓటేయనున్నారు. ఇక, 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 233మందిలో మాజీ సీఎంలు అర్జున్ ముండా, మధు కోడా ఉన్నారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు మొత్తం 20 స్థానాల్లో, బీజేపీ 18 చోట్ల, దాని మిత్రపక్షం అజ్సూ పార్టీ రెండు చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాయి. 44 లక్షల మంది ఈ విడతలో ఓటేయనున్నారు. జార్ఖండ్ లో గ త నెల 25న 13 స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదైంది. -
కార్మికుల కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: దేశంలోని అన్నిరంగాల కార్మికులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ప్రారంభించి వారికి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గ్రాండ్ మినర్వా హోటల్లో యూనియన్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్(యునైట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త వెబ్ పోర్టల్‌కు కార్మికుల వివరాలు, ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 2వేల సాఫ్ట్వేర్ కంపెనీల్లో 10లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. వీరంతా పరస్పరం ఆలోచనలు పంచుకుని మంచి ఫలితాలతో దేశ పురోభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఏపీ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ మాట్లాడుతూ దేశంలో 1.65 లక్షల పోస్టాఫీసులతో తమ శాఖ విస్తృత సేవలందిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త పథకాల ద్వారా 325 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. డెబిట్, క్రెడిట్ కార్డు సేవలను ప్రారంభించనున్నామని చెప్పారు. ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, సరైన వేతనాలు తదితర అంశాలపై తమ సంస్థ పని చేస్తుందని యునైట్స్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా యునైట్స్ కవర్ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, రీజినల్ సెక్రటరీ క్రిష్టోఫర్, పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ శిల్ప తదితరులు పాల్గొన్నారు. జమ్మూ, కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ వైపే ముస్లింలు జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ముస్లింలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఆదివారం దత్తాత్రేయ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ మైనారిటీ మోర్చా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హజ్ యాత్రికుల కోసం మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో ముస్లింలను ఎక్కువ సంఖ్యలో పార్టీలో చేర్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గజల్ గాయకుడు పండిట్ విఠల్‌రావును పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేయాలని పార్టీ మైనారిటీ మోర్చా అధ్యక్ష ఉపాధ్యక్షులు హనీఫ్ అలీ, అబ్దుల్ వహీద్ కేంద్ర మంత్రి దత్తాత్రేయను కోరారు. -
స్వేచ్ఛగానే ఈ ఎన్నికలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరుగుతున్నాయని 52% ప్రజలు అభిప్రాయపడుతున్నారని పాకిస్తాన్‌కు చెందిన పత్రిక డాన్ వెల్లడించింది. దీనికి సంబంధించి డాన్ నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో దాదాపు 8 వేల మంది పాల్గొనగా.. వారిలో 52.54% ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పేర్కొంది. సాధారణంగా జమ్మూకశ్మీర్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా జరగవని పాక్ మీడియా ఎప్పుడూ చెబుతూ ఉండేది. అందుకు అతి తక్కువ పోలింగ్ శాతాన్ని రుజువుగా చూపుతూ ఉండేది. -
చర్చలతోనే విద్వేషాలకు తెర
భారత్, పాక్ సమస్యలపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న అపరిష్కృత సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సార్క్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు హాజరైన నేపథ్యంలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. నాల్గో విడతలో జరగనున్న సోన్వార్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఒమర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లనివ్వం: ఎన్సీ జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉంటామని నేషనల్ కాన్ఫరెన్స్ తన మేనిఫెస్టోలో ప్రతినబూనింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలీ అహ్మద్ సాగర్ తదితర నేతలు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాగా, కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని రాష్ట్రంలోని రాజకీయ పక్షాల కార్యకర్తలకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు పుల్వామా ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. -
రెండు రాష్ట్రాల్లో రేపే తొలిదశ పోలింగ్
రాంచీ/జమ్మూ: జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. జార్ఖండ్‌లోని 13 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు, జమ్మూకశ్మీర్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూకశ్మీర్ లోని 15 స్థానాలకు జరగనున్న మొదటి విడత పోలింగ్ లో ఏడుగురు మంత్రులతో సహా 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 123 మంది పోటీలో ఉన్నారు. -
రెండు రాష్ట్రాల్లో రేపే ‘తొలి దశ’
జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో ముగిసిన ఎన్నికల ప్రచారం కశ్మీర్లో 15 సీట్లు, జార్ఖండ్‌లో 13 స్థానాల్లో పోలింగ్ రాంచీ/జమ్మూ: జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. జార్ఖండ్‌లోని 13 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలు, జమ్మూకశ్మీర్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తొలి దశ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో గడువు ముగిసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. కశ్మీర్ తొలి విడత పోలింగ్ బరిలో 123 మంది, జార్ఖండ్ తొలి దశ బరిలో 199 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘బీజేపీ పాలనలో జార్ఖండ్ భ్రష్టుపట్టింది’ దల్తోంగంజ్/గుమ్లా: ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడి 14 ఏళ్లు అయిందని, దీనిలో 11 ఏళ్లపాటు ఈ రాష్ట్రాన్ని బీజేపీయే పాలించిందని, ఈ కాలంలో జార్ఖండ్ అభివృద్ధి సాధించింది లేకపోగా మరింత దిగజారి పోయిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కే వలం మూడు జిల్లాలకే పరిమితమైన మావోయిస్టు సమస్య ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి పాకిందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధితోనే మావోయిస్టు సమస్యను తరిమి కొట్టొచ్చన్నారు. అదేవిధంగా దేశంలోని సహజ సంపదను ప్రజల చేతికే అప్పగించడం వల్ల అభివృద్ధి త్వరితగతిన సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జార్ఖండ్‌లోని మావోయిస్టు ప్రభావిత దల్తోంగంజ్, గుమ్లా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నక్సలిజం బాటపట్టిన యువతను జనజీవన స్రవంతిలోకి మళ్లించాల్సిన అవసరముందన్నారు. గిరిజనులు, దళితులు, పేదలు, బీసీలకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో తాము తీసుకొచ్చిన భూ సేకరణ చట్టానికి కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సవరణలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అదేవిధంగా జార్ఖండ్‌లోని గిరిజనుల భూములకు రక్షణ కల్పించే ఉద్దేశంతో తెచ్చిన కౌలు హక్కు దారుల చట్టాన్ని కూడా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని సోనియా విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోవడానికి 11 ఏళ్లు పాలించిన బీజేపీయే కారణమన్న విషయాన్ని ప్రధాని మోదీకి తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు యూపీయే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చిందని, అయితే, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయా నిధులను ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. ‘బీజేపీ మునుగుతుంది’ శ్రీనగర్: వివాదాస్పద ఆర్టికల్ 370 విషయంలో రెండు పడవల ప్రయాణం చేస్తే బీజేపీ మునిగిపోవడం ఖాయమని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. బీజేపీ ఒక అవకాశవాద పార్టీ అని ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టికల్ 370పై బీజేపీ పలువిధాలుగా మాట్లాడుతుండటంపై ప్రశ్నించగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మూలో ఆ ఆర్టికల్‌పై మాట్లాడితే జాతీయ అంశం అవుతుంది కాబట్టి అక్కడ మౌనంగా ఉంటున్నారని, కశ్మీర్ లోయలో మరోలా వ్యవహరిస్తూ ప్రాంతాన్ని బట్టి మాటలు మారుస్తున్నారని విమర్శించారు. శనివారం కిస్టవార్లోని ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని మోదీ 370 అధికరణపై ఏమీ మాట్లాడని విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలు ఎన్నికల స్టంట్: ముఫ్తీ కశ్మీర్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలన్నీ ఎన్నికల స్టంట్ అని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి విమర్శించారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీకి రాష్ట్ర విషయాలేమీ సరిగా తెలియవని మోదీ వ్యాఖ్యలతో అర్థమవుతోందని విమర్శించారు. -
తెరపైకి మళ్లీ ‘ఆర్టికల్ 370’!
జమ్మూకశ్మీర్‌కు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే అధికరణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పార్టీల మాటల యుద్ధం గెలుపే లక్ష్యంగా ‘370’పై బీజేపీ మాట మారుస్తోందన్న కాంగ్రెస్ నేషనల్ డెస్క్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘ఆర్టికల్ 370’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆ ఆర్టికల్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. రామజన్మభూమి, ఉమ్మడి పౌర స్మృతితో పాటు ఈ అంశాన్నీ తమ ఎజెండాలో భాగం చేసుకుంది. 2009 పార్టీ మేనిఫెస్టోలోనూ ఆ అంశాన్ని చేర్చింది. కానీ 2014 వచ్చేసరికి.. జమ్మూలో 2013, డిసెంబర్లో ఒక సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 పై చర్చ జరగాల్సి ఉందని, దానివల్ల జమ్మూకశ్మీర్‌కు ఏమైనా ప్రయోజనాలు లభించాయా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే, కశ్మీర్ ఎన్నికల సమయంలో ఆ అంశాన్ని లేవనెత్తవద్దంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 19న వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 విషయంలో బీజేపీ వైఖరిలో వచ్చిన ఈ మార్పును అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్.. జమ్మూకశ్మీర్‌లో అధికారం కోసం బీజేపీ మాట మార్చిందని విమర్శిస్తోంది. ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడం బీజేపీకి అలవాటేనని దుయ్యబడ్తోంది. తమ వైఖరిలో మార్పేం లేదని, ఆర్టికల్ 370పై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, కాకపోతే ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఆర్టికల్ 370 అంశాన్ని వాడుకోవద్దనే ఉద్దేశంతోనే.. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తొద్దని అంటున్నామని బీజేపీ వాదిస్తోంది. ఆర్టికల్ 370 విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టతనివ్వాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కనీసం 44 స్థానాలు సాధించి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఆ వ్యూహంలో భాగంగానే ఆర్టికల్ 370పై మెతక వైఖరి అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 పూర్వాపరాలు, ముఖ్యాంశాలు.. 1947లో జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ నాయకుడైన షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 370ని రూపొందించారు. అయితే, దీనికి తాత్కాలిక స్థాయి కాకుండా శాశ్వత స్థాయి కావాలని అబ్దుల్లా చేసిన డిమాండ్‌కు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేదు. ఈ అధికరణను రూపొందించేందుకు రాజ్యాంగ ప్రధాన రూపకర్త అయిన డాక్టర్ అంబేద్కర్ అంగీకరించలేదు. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ‘తాత్కాలిక’ స్వతంత్ర ప్రతపత్తిని కల్పించింది. రాజ్యాంగంలో ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలను పొందుపర్చిన 21వ భాగంలో దీన్ని చేర్చారు. క్రమంగా తొలగించాలనే ఉద్దేశంతోనే దీనికి తాత్కాలిక స్థాయి కల్పించారు. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. రక్షణ, విదేశీ వ్యవహారాలు,ఆర్థిక, సమాచార రంగాల్లో మినహా మరే ఇతర అంశాల్లోనైనా చట్టాలను ఈ రాష్ట్రంలో అమలు పర్చేందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, ఆస్తుల సముపార్జన.. ఈ అంశాల్లో మిగతా దేశంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలున్నాయి. మిగతా రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఆస్తులు కొనుక్కోవడాన్ని అనుమతించరు. రాష్ట్ర సరిహద్దులను పార్లమెంటు మార్చలేదు. ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించడానికి వీలు కలిగించే ఆర్టికల్ 360ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉపయోగించలేదు. ఎమర్జెన్సీని కూడా యుద్ధ సమయాల్లో, విదేశీ ఆక్రమణల సమయాల్లో మాత్రమే ప్రకటించాలి. అంటే అంతర్గత అశాంతి తదితర కారణాలతో ఎమర్జెన్సీ ప్రకటించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు ఈ రాష్ట్ర ప్రజలకు వర్తించవు. రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన విద్యాహక్కును కూడా ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు. 1965 వరకు జమ్మూకశ్మీర్‌కు గవర్నర్ స్థానంలో ‘సదర్ ఇ రియాసత్’, ముఖ్యమంత్రి స్థానంలో ‘ప్రధానమంత్రి’ ఉండేవారు. జనాభా పరంగా జమ్మూలో హిందువులు, కశ్మీర్ లోయలో ముస్లింలు, లడఖ్ ప్రాంతంలో ముస్లింలు, బౌద్ధ మతస్తులు అధికంగా ఉన్నారు. -
కాషాయ రాజకీయం
కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో సోనియా ధ్వజం బండిపొరా/చందర్‌కోట్: జమ్మూకశ్మీర్ వరద బాధితులకు సాయంపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధితులకు అంతులేని హామీలు ఇచ్చిందని, అయితే అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కొన్ని శక్తులకు సొంత విధానాలు లేవని, అవి అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని బీజేపీని ఉద్దేశించి అన్నారు. కశ్మీర్ వేర్పాటు వాద నేత సజ్జద్ లోన్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ అయిన నేపథ్యంలో ఈ విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా శుక్రవారం బందిపొరా, చందర్‌కోట్‌లలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ‘కశ్మీరీలు వరద బీభత్సం నుంచి కోలుకోకముందే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడ్డం మంచిది కాదు. అయితే సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. 2005లో అధీన రేఖ వద్ద భూకంపం సంభవించినప్పుడు నాటి యూపీఏ ప్రభుత్వం బాధితులను అన్నిరకాలుగా ఆందుకుంది’ అని పేర్కొన్నారు. ‘సహాయం, పునరావాసం, పునర్నిర్మాణం కోసం రూ. 45వేల కోట్ల సహాయక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్రం కోరింది. అయితే ప్రధాని మోదీ రూ. 745 కోట్లే ప్రకటించారు’ అని విమర్శించారు.