- జమ్మూకశ్మీర్‌కు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే అధికరణ
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పార్టీల మాటల యుద్ధం
- గెలుపే లక్ష్యంగా ‘370’పై బీజేపీ మాట మారుస్తోందన్న కాంగ్రెస్
నేషనల్ డెస్క్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘ఆర్టికల్ 370’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌కు తాత్కాలిక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆ ఆర్టికల్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. రామజన్మభూమి, ఉమ్మడి పౌర స్మృతితో పాటు ఈ అంశాన్నీ తమ ఎజెండాలో భాగం చేసుకుంది. 2009 పార్టీ మేనిఫెస్టోలోనూ ఆ అంశాన్ని చేర్చింది. కానీ 2014 వచ్చేసరికి.. జమ్మూలో 2013, డిసెంబర్‌లో ఒక సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 పై చర్చ జరగాల్సి ఉందని, దానివల్ల జమ్మూకశ్మీర్‌కు ఏమైనా ప్రయోజనాలు లభించాయా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.
అలాగే, కశ్మీర్ ఎన్నికల సమయంలో ఆ అంశాన్ని లేవనెత్తవద్దంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 19న వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 విషయంలో బీజేపీ వైఖరిలో వచ్చిన ఈ మార్పును అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్.. జమ్మూకశ్మీర్‌లో అధికారం కోసం బీజేపీ మాట మార్చిందని విమర్శిస్తోంది. ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడం బీజేపీకి అలవాటేనని దుయ్యబడ్తోంది. తమ వైఖరిలో మార్పేం లేదని, ఆర్టికల్ 370పై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, కాకపోతే ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఆర్టికల్ 370 అంశాన్ని వాడుకోవద్దనే ఉద్దేశంతోనే.. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తొద్దని అంటున్నామని బీజేపీ వాదిస్తోంది.
ఆర్టికల్ 370 విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టతనివ్వాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కనీసం 44 స్థానాలు సాధించి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఆ వ్యూహంలో భాగంగానే ఆర్టికల్ 370పై మెతక వైఖరి అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్టికల్ 370 పూర్వాపరాలు, ముఖ్యాంశాలు..
1947లో జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ నాయకుడైన షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 370ని రూపొందించారు. అయితే, దీనికి తాత్కాలిక స్థాయి కాకుండా శాశ్వత స్థాయి కావాలని అబ్దుల్లా చేసిన డిమాండ్‌కు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించలేదు.
ఈ అధికరణను రూపొందించేందుకు రాజ్యాంగ ప్రధాన రూపకర్త అయిన డాక్టర్ అంబేద్కర్ అంగీకరించలేదు.
భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ‘తాత్కాలిక’ స్వతంత్ర ప్రతపత్తిని కల్పించింది. రాజ్యాంగంలో ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలను పొందుపర్చిన 21వ భాగంలో దీన్ని చేర్చారు. క్రమంగా తొలగించాలనే ఉద్దేశంతోనే దీనికి తాత్కాలిక స్థాయి కల్పించారు.
ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది.
రక్షణ, విదేశీ వ్యవహారాలు,ఆర్థిక, సమాచార రంగాల్లో మినహా మరే ఇతర అంశాల్లోనైనా చట్టాలను ఈ రాష్ట్రంలో అమలు పర్చేందుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి.
ప్రాథమిక హక్కులు, పౌరసత్వం, ఆస్తుల సముపార్జన.. ఈ అంశాల్లో మిగతా దేశంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలున్నాయి.
మిగతా రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఆస్తులు కొనుక్కోవడాన్ని అనుమతించరు.
రాష్ట్ర సరిహద్దులను పార్లమెంటు మార్చలేదు.
ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించడానికి వీలు కలిగించే ఆర్టికల్ 360ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉపయోగించలేదు.
ఎమర్జెన్సీని కూడా యుద్ధ సమయాల్లో, విదేశీ ఆక్రమణల సమయాల్లో మాత్రమే ప్రకటించాలి. అంటే అంతర్గత అశాంతి తదితర కారణాలతో ఎమర్జెన్సీ ప్రకటించాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు ఈ రాష్ట్ర ప్రజలకు వర్తించవు.
రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన విద్యాహక్కును కూడా ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు.
1965 వరకు జమ్మూకశ్మీర్‌కు గవర్నర్ స్థానంలో ‘సదర్ ఇ రియాసత్’, ముఖ్యమంత్రి స్థానంలో ‘ప్రధానమంత్రి’ ఉండేవారు.
జనాభా పరంగా జమ్మూలో హిందువులు, కశ్మీర్ లోయలో ముస్లింలు, లడఖ్ ప్రాంతంలో ముస్లింలు, బౌద్ధ మతస్తులు అధికంగా ఉన్నారు.