ఎన్నికల వేళ ‘ఆర్టికల్ 370’ సరికాదు
- పార్టీలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హితవు
పడ్డార్ (కిష్ట్‌వార్): జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసెంబ్లీ ఎన్నికల వేళ లేవనెత్తరాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హితవు పలికారు. అయితే జాతీయ అంశమైన ఆర్టికల్ 370 రద్దు గురించి చర్చ జరగాలని కోరుకుంటున్నామని...ఈ విషయంలో తమ పార్టీ (బీజేపీ) వైఖరి స్పష్టంగా ఉందన్నారు.
కానీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి వాడుకోరాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కిష్ట్‌వార్ జిల్లాలోని మారుమూల పడ్డార్ ప్రాంతంలో పార్టీ అభ్యర్థులు సునీల్ శర్మ (కిష్ట్‌వార్ నియోజకవర్గం), దలీప్ కుమార్ (భదేర్వా నియోజకవర్గం)లకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే అవినీతిలేని సుపరిపాలన అందిస్తామని, రాష్ట్రాన్ని శాంతి, సుస్థిర అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాగా, రాష్ట్ర దుస్థితికి గతంలో పాలించిన పార్టీల ‘రాజకీయ ఉగ్రవాదమే’ కారణమని బీజేపీ జమ్మూ కశ్మీర్ వ్యవహారాల ఇన్‌చార్జ్ రమేష్ అరోరా ఆరోపించగా ఈ ఎన్నికల్లో 44కుపైగా సీట్లను గెలుచుకుంటామని కేంద్ర మంత్రి జె.పి. నడ్డా జమ్మూలో తెలిపారు.
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 18 నియోజకవర్గాల్లో డిసెంబర్ 14న పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఈ నెల 26 వరకూ నామినేషన్లు వేసుకోవచ్చని, 27న వాటిని పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29ని చివరి తేదీగా పేర్కొంది.
ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నామినేషన్
దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన పీడీపీ పాట్రన్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 14న జరగనున్న నాలుగో దశ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది.