ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాజాగా సీఎం ఏక్‌నాథ్ షిండ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమకు శివసేన కార్యకర్తల ఓట్లు ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పై ఆధారపడుతున్నారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాలక మహాయుతి కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంపైనే మేము దృష్టి సారించాం. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. శివసేనకు చెందిన బేస్ ఓటు బ్యాంక్ మాకు మద్దతుగా ఉన్నారు. కానీ, యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రేకు మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పైనే వాళ్లు ఆధారపడుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) స్వల్ప విజయానికి సొంత బలం కంటే కాంగ్రెస్ మద్దతు వల్లే విజయం సాధించగలిగారు.
బాలాసాహెబ్ థాక్రే మహారాష్ట్రకు సైద్ధాంతిక మూలస్తంభం. ఉద్ధవ్ తన కుమారుడే అయినప్పటికీ, అతను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడిచిపెట్టాడు. బాలాసాహెబ్ పార్టీతో ఎప్పుడూ సహవాసం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. శివసేన-బీజేపీ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఉద్ధవ్ రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారు. బాలాసాహెబ్ పేరును ఉపయోగించుకునే అర్హత కూడా అతనికి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment